17, ఆగస్టు 2020, సోమవారం

వీర వనిత రాణి లింగమ్మ

గద్వాల్ కథ🌷*
*సోమనాద్రి - వీర వనిత రాణి లింగమ్మ - హనుమప్ప నాయుడు*
         🌷🌷🌷
గద్వాల్ నగరం తెలంగాణ రాష్ట్రం లోని 'జోగులంబగద్వాల్' జిల్లా ప్రధాన కార్యాలయం.  ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం.  గద్వాల్ చారిత్రాత్మకంగా హైదరాబాద్ నిజాం యొక్క  "గద్వాల్ సంస్థానం" యొక్క రాజధాని!

ఈ రోజు నేను ఈ వ్యాసంలో మీముందు ముగ్గురి ప్రాశస్త్యం ని కథలా చెప్పబోతున్నాను. వారు:
1. సోమానాధ్రి (సోమన్నభూపాలుడు)
2. వీర వనిత రాణి లింగమ్మ
3. హనుమప్ప నాయుడు

రాజరిక వ్యవస్థ ఘనంగా కొనసాగుతున్న రోజుల్లో గద్వాల సంస్థానం తనకంటూ ఓ ప్రత్యేక చరిత్ర సృష్టించుకొంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పేరు చెబితే ఇరుగు పొరుగు పాలెగాళ్లు గడగడ లాడిపోయేవారు. ఈ సంస్థానం వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అంతెందుకు నిజాం నవాబు సైతం గద్వాలను ప్రత్యేకంగానే పరిగణించేవారు. అలాంటి ఆ సంస్థానానికి నిర్మాణ వ్యవస్థాపక  మూలవిరాట్టుగా నిలిచిన పాలెగాడు నల సోమనాద్రి.  ఈ సంస్థానాన్ని ధర్మ నిరతితో పరిపాలించిన  సుప్రసిద్ధ పాలకుడు. ఇతన్ని  పెద్ద సోమభూపాలుడు, పెద శోభనాద్రి, సోమనాద్రి అని ప్రజలు ఎంతో ఆప్యాయంగా  పిలుచుకునేవారు. ఈ సంస్థానం స్థాపించాడానికి ముందు సోమనాద్రి 'పూడూరు'ను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. క్రీ.శ. 1663లో ఈ సంస్థాన స్థాపనకు గద్వాలలో బీజం వేశాడు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించాడు. ఈతని  పాళెగాని  తండ్రి పెద్దారెడ్డి. తల్లి బక్కమ్మ. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య అమ్మక్కమ్మ ,   చిన భార్య లింగమ్మ . తల్లి బక్కమ్మ పుట్టినిల్లు పూడూరు.  ఆ పూడూరే సోమనాద్రి తొలి రాజధాని.

చరిత్రలో స్మరించు కోవాల్సిన తెలుగు వీరవనితలు: పల్నాటి బాలచంద్రుని మగువ మాంచాల, నెల్లూరి సీమ సేనాధిపతి ఖడ్గ తిక్కన సతీమణి చానమ్మ ... ఇంకా ఎందరెందరో కథానాయిక ల్లో గద్వాల్ సోమనాద్రి సతీమణి లింగమ్మ కూడా ఒకరు.
శత్రు రాజుల కోటలో తన భర్త బందీ గా మారి కొన ఊపిరితో పోరాడుతున్నారన్న సమాచారం అందుకొంది రాణిలింగమ్మ. అంతలోనే వేగులు వచ్చి పూర్తిస్థాయి సమాచార మిచ్చారు.శతృ రాజులు యుద్దరంగం లో నిలవ లేక కర్నూలు కోటకు పారిపోతుండగా సోమనాద్రి వారిని వెంటబడి తరుముతూ  కర్నూలు కోటలో బందీగా చిక్కాడని చెప్పారు. రాజును విడిపించేందుకు కోట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నమైనా చేయకుండా తమ సైన్యం చేతులెత్తేసారని, అనుమతిస్తే వెనుదిరిగి వస్తామంటూ కబురు పంపించారని రాణి లింగమ్మతో చావు కబురు చల్లగా చెప్పారు. అందుకు ప్రతిగా రాణి ఏం చెప్పింది, మన కథానాయిక ఎలా అయిందన్నది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం పదండి మరి.

సోమనాద్రి ఆరడుగుల ఎత్తు గల  ఆజానుబాహుడు.  నల్లని రూపు తో గంభీరమైన ఆయన దేహదారుడ్యం చూపరులకు భీతిగొల్పేది. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగిన సోమనాద్రి  ఖడ్గం చేతబట్టా డంటే ప్రళయకాల రుద్రుడే. యుద్దరంగ మంటే మంచినీళ్ల ప్రాయమే.

పూడూరు రాజధానిగా ఆ ప్రాంత పాలెగాడుగా ఉన్న సోమనాద్రికి పూడూరు కోట మరమ్మత్తుల సందర్భంగా పెద్ద ఎత్తున గుప్త నిధులు దొరికాయి. ఆనాటి రోజుల్లో గద్వాల ప్రాంతమంతా అటవీమయంగా ఉండేది. అడవి జంతువులు విచ్చల విడిగా సంచరిస్తుండేవి. జనావాస యోగ్యంగా లేకపోవడంతో అడవి మరింత దట్టంగా పెరిగింది. సోమనాద్రి ఒకనాడు పూడూరు నుండి అటవి ప్రాంతంగా ఉండిన గద్వాల ప్రాంతానికి  వేటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఒక కుందేలు వేట కుక్కను తరమడం గమనించాడు. ఇక్కడి స్థలానికి ఏదో వీరోచిత మహత్తు ఉందన్న విషయాన్ని గ్రహించాడు. అందువల్ల ఇక్కడ రాజధాని నిర్మిస్తే తనకు అపజయమన్నది ఉండదని భావించాడు. ఇదే విషయాన్ని తన ముఖ్య  సహచరులతో చర్చించాడు.  తన అంగ రక్షకులు, అనుచరులు, సహచరులు కూడా సమ్మతించడంతో పూడూరు నుండి గద్వాలకు రాజధానిని మార్చాలని గట్టిగా  నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగానే పటిష్టిమైన  కోటను కూడా నిర్మించాలని తలపోశాడు. ఆ మేరకు  కార్యాచరణను సిద్ధం చేశాడు.
ఉత్తరం దిశన కృష్ణానది ఉండటం,
ఈ ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాలనుకున్నాడు.

సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని  గద్వాలకు, రాయచూరు కు మధ్యలో ఉన్న ఉప్పేరు ప్రాంతాన్ని పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు సమీప బంధువు.  ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి  తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలవాడనని సోమనాద్రి నమ్మబలికాడు. నవాబు అందుకు సంతోషంగా అంగీకరించాడు.

సోమనాద్రి  నిర్మాణం మొదలు పెట్టి వృత్తాకారంలో పటిష్టంగా, ఎంతో పకడ్బందీగా మట్టి కోటను నిర్మించాడు. తూర్పూ, పడమరల వైపు రెండు ప్రధానా ద్వారాలు, ఉత్తరం వైపు అత్యవసర రహస్య ద్వారం ఉండేటట్లు ప్రణాళిక రచించాడు.  కోటలో ఒక పెద్ద బావి, అంతఃపుర మందిరాలు, చెన్న కేశవ స్వామి ఆలయం నిర్మింపజేశాడు.  అనేక వ్యయప్రయాసలకు గురైనప్పటికీ కోట నిర్మాణం పూర్తి గావించి తన రాజధానిని గద్వాలకు తరలించాడు.

కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి ఉల్లంఘిం చాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నా డు. పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు కబురు పంపాడు సయ్య ద్ దావూద్ మియా.                                                            ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియ్యా అధ్వర్యంలో మూడు ప్రాంతాల నవాబులు ఏకమై ముప్పేట దాడికి పూనుకున్నారన్న సమాచారం సోమనాద్రికి అందింది.                                                               

ఇక ఎంత మాత్రం ఉపేక్షించకుండా సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని  రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు.  ఇరు పక్షాల మధ్య భీకర సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. యుద్ధ నష్ట పరిహారం గా తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, కొన్ని ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. చావుతప్పి కన్ను లొట్టబోయి ఎంతో దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.

అరగిద్ద యుద్ధంలో పరాభవాన్ని ఎదుర్కొన్న ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్, మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించింది. అది నవాబును  మరింతంగా కుంగదీసింది.  అవమాన భారంతో రగిలిపోయాడు. మిన్నంటిన ఆగ్రహంతో ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించే వరకు నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు.  సోమనాద్రి మీదకు దండయాత్ర సముచితం కాదని, ఆ యోచన విరమించుకోమని సయ్యద్‌కు నిజాం నవాబు సలహా ఇచ్చి అనునయించాడు. కాని సయ్యద్ పట్టు విడవలేదు. తప్పని పరిస్థితిలో ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధంలో పరాజయం పాలై అవమానంతో రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే మెరికల్లాంటి సైనికులను ఏరికూర్చుకొని తమ సైన్యాలతో కలిసి, నిజాం సైన్యానికి జత కలిశారు.

ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యాన్ని వెంటనిడుకొని నిజాం సైన్యం తుంగభద్రా నదికి ఉత్తరం దిశనుండి  బయలుదేరింది.  వీరు చాలరని తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు) గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల (నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు  నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది. సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరులోని నవాబుల సైన్యంపై  ముందుగా దండెత్తాడు.  నవాబుల సైన్యం కూడా అందుకు ధీటుగానే జవాబిచ్చింది. అంతకు ముందు అనేక యుద్దాల్లో ఒక ప్రణాళిక ప్రకారం సైన్యాన్ని నడిపిన సోమనాద్రికి ఈ యుద్దం అసలు లెక్కే లేకపోయింది. ఆ రోజంతా నవాబుల సైన్యంతో అరివీర భయంకరంగా ఎంతో వీరొచితంగా పోరాడాడు. ఫలితంగా నవాబుల సైన్యం కకావికలమై పోయింది. మొదటి రోజు పైచేయి సాధించిన విజయ గర్వంతో సోమనాద్రి ఆ రాత్రి కలుగొట్లకు తిరిగి వచ్చి విశ్రమించాడు.                                         

మొదటి రోజు యుద్దంలో సోమనాద్రి అసమాన పరాక్రమాన్ని చూసిన నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్ధారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకొంటే, మన విజయం సుళువుగా మారుతుందని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగిలించి తెచ్చినవాడికి  జాగీరును ఇస్తానని ప్రకటించాడు. ప్రాణాలకు తెగించి ఒక అశ్వ పాలకుడు కలుగొట్లకు వచ్చి ఎంతో నైపుణ్యంగా సోమనాద్రి గుర్రాన్ని తస్కరించుకువెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో పాటు, ఒక బంగారు కడియాన్ని కూడా అశ్వ పాలకునికి బహుమానంగా ఇచ్చాడు.

మరుసటి రోజు సోమనాద్రి శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేక పోవడం తనకు  కుడిచేయి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్య,స్థైర్యాలను విడువకుండా మరో జాతి గుర్రం సాయంతో ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందు రోజు నాటి ఉత్సాహం లేక పోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితో సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెళ్ళవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివ్వ గలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకు భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించాడు.

హనుమప్పనాయుడు:  సర్దార్ గుజ్జుల హనుమప్ప నాయుడు త్యాగం, విధేయత మరియు ధైర్యం ఇప్పటికీ ఎంతో గర్వంగా చెప్పుకునే జ్ఞాపకములుగా నిలచిపోయాయి !

హనుమప్ప నాయుడు యంగన్న పల్లె గ్రామానికి చెందిన బోయ కులస్థుడు.  ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరుడు. ప్రాణాలకు తెగించి తన ప్రభువు గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలుడునికి (నల సోమనాద్రికి)
విజయానికి దొహదపడిన కార్యశూరుడు.

సోమనాద్రి ప్రకటనకు హనుమప్ప నాయుడు అనే  ఒక బోయ సర్ధారు ముందుకు వచ్చాడు. ఇతని స్వగ్రామం నేటి ఇటిక్యాల మండలంలోని బొచ్చెంగన్న పల్లె. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా కట్టుకొని నిడ్జూరుకు బయలుదేరాడు. నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా సమీపించాడు. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదురనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టే అలా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్ని చూశాడు. చివరకు ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పను చూసి  సకిలించింది. సొప్పను చూసే సకిలించిందని సరి పెట్టుకున్నారు అక్కడి సైనికులు. గుర్రం కనపడిన ఆనందంతో తక్కువ దరకే సొప్పను అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకొనే సమయం కోసం ఎదురుచూస్తూ, ఎవరి కంటాపడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరి వెల్లకిలా పడుకున్నాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు విలవిలలాడితే, ప్రాణాలకే  ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకొన్నాడు. అర్థ తాత్రి దాకా, సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాడ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాక పోయేసరికి నడుముకున్న  కత్తిని ఎడమ చేతితో తీసుకొని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కొన్నాడు. తెగిన భాగానికి తలపాగ చుట్టుకొని లేచాడు.  గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కలుగొట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు  గుర్రంతో సహా నిలబడి హనుమప్ప నాయుడు ఎడమ చేతితో నమస్కరించాడు.. నాయుడి దుశ్చర్యకు రాజు ఆగ్రహించాడు.  రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాకా, జరిగిన సంగతంతా విన్నాకా  సోమనాద్రి చలించి పోయాడు.నాయుడుని కౌగిలించుకొని సన్మానం చేశాక తక్షణమే వైద్యం అందే ఏర్పాట్లు చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దాన శాసనం రాయించాడు.   
                                                                         
తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహ భరితుడైన  సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపాడు. అరివీర భయంకర ప్రతాపంతో నిజాం సైన్యంపై విరుచుకపడ్డాడు. ఆ నాటి యుద్ధంలో సోమనాద్రి చేతిలో ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్, బళ్ళారి నవాబు హతులయ్యారు. నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ వెళ్ళాడు సోమనాద్రి. నిజాం సైన్యం కర్నూలు కోటలోకి ప్రవేశించింది. తరుముతూ వెళ్ళిన సోమనాద్రి కూడా కొద్దిమంది సైనికులతో కలిసి కోటలోకి వెళ్ళాడు. హఠాత్తుగా వెనుక నుండి  కోట తలుపులు మూత పడ్డాయి.  దిక్కు తోచక బయటే మిగిలి పోయిన గద్వాల సైన్యం లోపలికి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసింది. కాని వీలు పడలేదు. కోటలో నవాబుల సైన్యం భారీగా ఉంది. తన తోడున్న కొద్ది మంది సైనికులతో మాత్రమే  తమ నాయకుడు కోటలోపలికి ప్రవేశించాడు. పైగా అప్పటికే చాలా సమయం గడిచి పోయింది. అందువల్ల తమ రాజు మరణించి ఉంటాడని, కాబట్టి తాము గద్వాలకు తిరిగి వస్తామని, మహరాణి లింగమ్మకు బయటే మిగిలి పోయిన సైన్యం కబురు పంపింది.

వీర వనిత రాణి లింగమ్మ:

ఆ సమాచారం అందుకున్న రాణి ఆగ్రహంతో ఊగిపోయింది. తమ సైనికుల పేలవతనానికి సిగ్గు పడింది. తమ సైనికుల తక్షణ కర్తవ్యం ఏమిటన్నది చెప్పకనే చెప్పే కబురు వారికి చేరేలా ఆజ్ఞను జారీ చేసింది ఇలా.

"అలాగే రండి! కాకపోతే నేను పంపించిన  ఈ గాజులు, చీరలు, పసుపు, కుంకుమలు ధరించి తిరిగి రండ" ని ప్రత్యుత్తరం పంపింది. దీంతో ఎక్కడ లేని పౌరుషం పొడుచు కొచ్చిన సైన్యం ఇక విజయమో, వీరస్వర్గమో ఎదో ఒకటి తేలిపోవాలని భావించింది. కళ్లు మూసి తెరిచే లోగా  కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టారు. పెల్లుబికిన ఆగ్రహంతో కోటలోకి దుమికారు. అప్పటి దాకా కోట తలుపులను తమ వీపు వైపు రక్షణ కవచంలా చేసుకొని తమతో ఉన్న కొద్ది పాటి సైన్యంతో శతృవులను మట్టి కరిపిస్తున్నాడు సోమనాద్రి. ఆ రోజంతా ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాద్రికి తన సైన్యాన్ని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లైయింది. సోమనాద్రి సైన్యం రెట్టించిన ఉత్సాహంతో మరింత విజృంభించింది. ముస్లిం సేనలను కత్తికొక కండగా నరికి వేస్తున్నారు. సోమనాద్రి తమనిక బ్రతకనించేటట్లు లేడని భావించిన  రాయచూరు, గుత్తి నవాబులు యుద్ద విముఖతను చూపారు. ఉప్పేరు నవాబు ఏం  చేయాలో దిక్కు తోచక  సందిగ్దంలో  పడిపోయాడు. ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకొని, సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించే సరికి, నిజాం కుడా సరేనన్నాడు. సోమనాద్రి కూడా అంగీకరించాడు. యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డివని భావించే   రామ, లక్ష్మణ ఫిరంగులను, కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది, విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చే ప్రయత్నాల్లో ఉండగా కపటోపాయంతో నిజాం సైన్యం సోమనాద్రిని హతమార్చింది. అయితే నిజాం మాత్రం తన నిజాయితీ ప్రదర్శించి గద్వాలను వశపర్చుకో కుండా సోమనాద్రి సతీమణి లింగమ్మ ను రాణిగా కొనసాగించాడు.
 
రాణి లింగమ్మ అధైర్యపడి తమ సైన్యాన్ని వెనుదిరిగి రమ్మని ఉంటే చరిత్ర మరోలా ఉండేది. బేలతనం ప్రదర్శించకుండా రాణివాసపు స్త్రీగా తమ సైన్యానికి పరోక్షంగా ధైర్యాన్ని నూరి పోసింది. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటమే శరణ్యమని చెప్పకనే చెప్పింది. అందుకే తన నిర్ణయం  విజయాన్ని సమకూర్చి పెట్టి, గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఇలాంటి వీరవనితలు పుట్టిన పుణ్యభూమి మన తెలుగు గడ్డ. అందుకే ఆ వీర వనితను స్మరించుకొని మనసారా నివాళులర్పిద్దాం.....
 *సేకరణ* :  శ్రీ ముసునూరి ఈశ్వర్ గారి పోస్టు.

కామెంట్‌లు లేవు: