17, ఆగస్టు 2020, సోమవారం

చెట్టు పంచిన స్నేహం - కధ



పార్వతీపురం అనే ఊళ్లో రామయ్య, సోమయ్య పక్క పక్క ఇళ్లల్లో ఉండేవారు. వీళ్ల ఇళ్లకు మధ్యన ఓ మామిడి చెట్టు ఉండేది. రామయ్య ఆ చెట్టుకు చాలా శ్రద్ధగా నీళ్లు పోస్తే... సోమయ్య ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్లకు ఆ చెట్టు నిండా మామిడి కాయలు విరగ్గాశాయి. దాంతో ఇద్దరూ ఆ కాయలు మావంటే మావని గొడవ పడడం మొదలుపెట్టారు.

చివరకు  ఇద్దరూ కలిసి న్యాయం కోసం ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. ‘మామిడి చెట్టులో ముప్పావు వంతు కొమ్మలు నా ఇంటివైపే ఉన్నాయి. కాబట్టి ఆ కాయలు నావే’ అన్నాడు సోమయ్య. ‘నేను రోజూ దానికి నీళ్లు పోశాను కాబట్టి కాయలు నావే...’ అన్నాడు రామయ్య. 

అంతా విన్న ఊరిపెద్ద మర్నాడు రమ్మని వాళ్లిద్దరినీ పంపించేశాడు. వాళ్లు వెళ్లిన అరగంటకు ఊరిపెద్ద తన దగ్గర పనిచేసే ఓ సహాయ కుడిని పిలిచి... ఇద్దరిళ్లకూ వెళ్లి మామిడికాయల్ని ఎవరో దొంగతనంగా కోసుకుంటున్నారని చెప్పమన్నాడు. ఆ పని వాడు మొదట సోమయ్య దగ్గరకు వెళ్లి... ఊరిపెద్ద చెప్పమన్నట్లే చెప్పాడు.

సోమయ్య ‘నేను ఖాళీగా లేను. తరవాత చూస్తా...’ అంటూ సమాధానమిచ్చాడు. తరువాత రామయ్య దగ్గరకు వెళ్లిన పనివాడు అదే విషయాన్ని చెబితే అతడు కర్ర తీసుకుని గట్టిగా అరుస్తూ ఇంటిబయటకు  వచ్చాడు.

సహాయకుడు ఇదే విషయాన్ని ఊరి పెద్దకు చెప్పడంతో అతడు మర్నాడు ‘చెట్టు ఎటువైపు ఉన్నా.. దాన్ని ఎవరు శ్రద్ధగా పెంచారో అది వాళ్లకే చెందుతుంది. కాబట్టి ఆ కాయల్ని కోసుకోవడానికి రామయ్య మాత్రమే అర్హుడు. అతడు ఇష్టపడి ఇస్తే సోమయ్య కూడా కొన్ని కాయలు తీసుకోవచ్చు’ అని చెప్పాడు.

ఆ తీర్పుతో ముఖం ముడుచుకున్న సోమయ్య దగ్గరకు రామయ్య వచ్చి, ‘కాయలు ఇద్దరం సమంగా తీసుకుందాం. ఇక నుంచీ చెట్టు సంరక్షణ కూడా  కలిసి చేద్దాం’ అన్నాడు. 

రామయ్య మంచితనం చూసిన సోమయ్య అప్పట్నుంచీ రోజూ చెట్టుకు నీళ్లుపోస్తూ రామయ్యతో స్నేహంగా ఉండసాగాడు.🍁
********************

కామెంట్‌లు లేవు: