25, ఆగస్టు 2020, మంగళవారం

రామాయణమ్ 41

పడుకొన్నావా హాయిగా ! ఊయలమీద ఊగుతూ కన్నులు తెరువకుండా ఇంకా నిద్దురలోనేవున్నవా నీవు! బయట ఏమి జరుగుతున్నదో తెలిస్తే నీ మత్తు పటాపంచలవుతుంది ! నీ గుండె చెరువవుతుంది .
.
జగతికంతా నీ సవతి కొడుకే రాజు కాబోతున్నాడు ,నీ పతి వలన నీకు పట్టిన గతి తెలియకున్నావు నీవు .
దశరధుడు నాకేస్వంతమని పగటికలలు కంటున్నావు !  కొంగుకు కట్టేసుకున్నాని భ్రమ పడ్డావు ! ఒడిలోదూరిన పాము అని తెలుసుకోలేక పోయావు ! ఎంత అమాయకురాలివమ్మా నీవు!.
.
 సవతిలీల నీకస్సలు తెలియకపాయె! ఎంత గడుసుదమ్మా నీ సవతి ! భాగ్యమంతా నాదే అని నీవు కలగంటున్నావు మొగుడికి వలవేసి అంతా తానే లాక్కున్నది ! .
.
ఏమిటే ! ఏమయ్యిందే ఇప్పుడు అంత కొంపలేమి మునిగిపోయినవని ఈ కేకలు పొద్దున్నే ! అని అడిగింది కైక.
.
నీ సవతి కొడుకుకు తెల్లవారగనే పట్టాభిషేకమట! రాముడే ఇకనుంచి రాజట! .
.ఈ మాట పూర్తిచేసిందో లేదో ! కైక ఒక్కసారి పట్టరాని ఆనందంతో చెంగున దూకి అబ్బ ఎంత మంచి వార్తచెప్పావే మంథరా! నీ జీవితంలో ఇంతకంటే మంచివార్త నాకు ఇకముందు చెప్పలేవు! అంతకుమునుపెప్పుడూ కూడా ఇంత మంచి వార్త నాకు చెప్పలేదు ! .
.
ఇదిగో ఇంత తీయని కమ్మని వార్త నాకెరిగించినందుకు నీకు బహుమతి అని తన మెడలో హారాన్ని తీసి చేతబట్టి మంథర కీయబోయింది కైక ! .
.
కైక ఇలా చేస్తుంటే మంధరకు హృదయతాపం హెచ్చింది ,కన్నులలో కోపం కనపడజొచ్చింది ,మనస్సంతా పాపం నింపుకొని ,ఆహా ! .ఇది నీకు మంచి కబురా! .
నీ సవతికొడుకు రాజవ్వటం నీకు ,నీకొడుకుకూ క్షేమకరమా ! ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు ! .
.
మంథరా ! రాముడే వాడు! సకలగుణాబిరాముడే ! సర్వలోకమనోహరుడే వాడు ! నా చిన్నతండ్రేవాడు ! వాడిని చూస్తే చాలునే ! నన్ను నేను మరచిపోతానే ,వాడు మా అందరి పుణ్యాలపంట ,వాడు మా వరాలమూట !
వాడిని గూర్చి ఇంకొక్క మాట మాట్లాడకే !
.
నాకు రాముడయినా ,భరతుడయినా ఒక్కటే!
.
రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే
తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యాభిషేక్ష్యతి!
.
నాకు రాముడయినా,భరతుడయినా ఒక్కటే!  తేడాలేదు! అందుకే రాజు రాముని రాజ్యాభిషిక్తుని చేస్తున్నాడంటే ఆనందం కలుగుతున్నది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*********************

కామెంట్‌లు లేవు: