25, ఆగస్టు 2020, మంగళవారం

శ్రీ శఠారి వైభవం...నమ్మాళ్వారులు

 శ్రీవైష్ణవసంబంధమైనఆలయాలలోఇచ్చే
#శఠగోపం_యొక్క_రూపం_వీరిదే
శఠ అనే మాయను హరించి వేయడం వలన, శఠ అనే మాయను కోపించినారు కనుక వీరికి శ్రీ శఠారి, శ్రీశఠగోపం అని నామములు

#శఠారి :- శఠము అనగా 'మాయ' ... అది పుట్టగానే మానవుని పట్టుకుంటుంది. దానివలన " భగవంతుడు మనకు రక్షకుడై ఉన్నాడు" అనే జ్ఞానం నశించి... ఏమీతెలియని అజ్ఞానంతో ఏడుస్తాం . కానీ విశ్వసైన్యాధిపతి ఐన విశ్వక్సేనులవారి అంశతో జన్మించిన వీరు - మాయ(శఠము) తనదగ్గరకు రాకుండా హుంకరించారు .... మాయను  పారిపోయేటట్లుభయపెట్టారు కనుక "శఠారి" అని పిలువబడినారు... భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తానని వస్తే "నిత్యం నీపాదుకులను నాతలపైధరించి సంసారులైనవారికి నీపాదాలను అందించే అవకాశం ఇవ్వుము" అన్నారు. లోకముపై వారికి ఎంతప్రేమ. తనకోసం ఏమీకోరలేదు. అందుకే విష్ణుదేవాలయములయందలి భగవంతుని పాదుకలను "శఠారి" లేదా "శఠగోపం" అంటారు.

అటువంటి శఠగోపయతి (శఠారి) గురించి తెలుసుకుందాం...

వృషభేతు విశాఖాయాం....
కురుకాపురి కారిజమ్ |
పాండ్యదేశే కలే రాదౌ....
శఠారిం సైన్యపం భజే ||

  కలియుగ ప్రారంభం లో వృషభమాసం (సౌరమానమును అనుసరించి రవి వృషభరాశిలో సంచరించు కాలం వృషభమాసం)లో విశాఖ నక్షత్రంలో .... విశ్వమునకు సైన్యాధిపతియైన శ్రీవిశ్ష్వక్సేనులవారి అంశతో.... పాండ్యదేశములోని కురికాపురి అను పురమునకు రాజైన కారి అనుపేరుగల రాజునకు పుత్రుడై అవతరించారు - శఠారులైన నమ్ ఆళ్వార్....

శఠారి యైన నమ్మాళ్వారు పాదములే మనకు రక్ష   

మాతాపితా యువతయః తనయావిభూతిః,
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్౹
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్,
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

ఇక కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు.

కారణం...శిశువు గర్భంలో ఉన్నప్పుడు పుట్టే ముందు ఆ శిశువుకి తన పూర్వ దశ అన్నీ తెలుస్తాయి. తల్లి గర్భం నుండి ప్రకృతిలోకి వచ్చేప్పుడు "శఠ" అనే వాయువు జ్ఞానద్వారాన్ని కప్పివేస్తుంది. అందుకే మందమతులం లేక శఠులం అవుతాం పుట్టగానే. మనం చేసిన పనులే మనకు జ్ఞాపకం ఉండవు సరిగ్గా. కానీ ఈ శిశువు శఠ అనే వాయువును కోప్పడి ఆ శఠ అనే వాయువుకి శత్రువు అయ్యాడట. 'అరి' శత్రువు, అందుకే శఠారి లేక "శఠకోపులు" అయ్యారు. మనకు శఠ అనే వాయువు వల్ల దాహం, ఆకలి వేస్తుంది. కాని ఆశిశువుకు ఆకలి లేదు, దప్పికలేదు, ఒక శిశువు గర్భంలో ఎట్లా ఉంటుందో అట్లానే ఉన్నాడు. లోన భగవత్ తత్వాన్నే అనుభవిస్తున్నాడు.

 తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు. ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది, ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాట లేదు, చూపు లేదు, ఎట్లాంటి ప్రవృత్తి లేదు. కేవలం కూర్చొని ఉంది. అట్లా 16 సంవత్సరాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది. అందరికి ఆశ్చర్యంగా అనిపించేది, క్రమంగా అందరూ మరచి పోయారు.

#మధురకవి ఆళ్వారులు నమ్మాళ్వారులను సేవించడం .....

అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే మధురకవి అని పేరు. చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక కనిపించింది. కొత్తగా ఆ నక్షత్రం ఉంది, పైగా అది దక్షిణం వైపు నడుస్తున్నట్లు కనిపించింది. అది కదులు తున్నట్లుగా రాత్రి అంతా ప్రయాణం సాగించాడు. తెల్లవారే సరికి నక్షత్రాలు కనిపించవు. రోజంతా అలసట తీర్చుకొని, మళ్ళీ రాత్రి ఆ నక్షత్రం నడిచిన వైపు ప్రయాణం సాగించాడు. అయితే కొన్నాల్లకు ఈ శిశువు ఉన్న ఊరికి చేరాక ఆ నక్షత్రం కనిపించడం మానేసింది.

ఆశ్చర్యం అనిపించింది. ఈ ఊర్లో ఏమైనా వింత జరుగుతుందా అని ఆ ఊరి పెద్దలని అడిగాడు. పెద్దగా ఎవ్వరికీ జ్ఞాపకం లేదు ఆ శిశువు గురించి. ఆ ఊరి దేవాలయంకి వెళ్ళి చూసాడు. అక్కడ చింతచెట్టు తొఱ్ఱలో నీలిరంగు శరీరం కల ఒక 16 ఏండ్ల బాలుడు కనిపించాడు. ఆకాశంలో కనపడ్డ నక్షత్రం యొక్క కాంతి ఈ బాలుడు దేహంలో కనపడింది. మాట లేదు పలుకు లేదు, బొమ్మలా ఉన్నాడు . ఏమైన మాట్లాడగలదడా అని తెలుసుకుందామని ఆ ప్రక్కనే చెట్టు ఎక్కి ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక రాయిని కిందికి విసిరాడు. ఆ శబ్దానికి బాలుడు ఒక్క సారి కనులు తెరిచి చూసాడు. మరి మాటేమైనా వచ్చునా అని ఒక  ప్రశ్న వేసాడు. ప్రకృతిలో  పుట్టేది ఏం తింటుంది, ఎక్కడ ఉంటంది... అడిగాడు. దానికి బదులుగా ఆ బాలుడు  సమాధానం .....  అక్కడే తింటుంది అక్కడే పడి ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. అబ్బో వేదాంతం కూడా తెలుసును అని అనుకున్నాడు. ఇలా ఆ శిశువు మాటలకి మెచ్చి, ఆ శిశువునే ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆ 16 సంవత్సరాలు లోన ఏదో దివ్యమైన దర్శనాన్ని పొంది, ఆ దర్శనం వల్ల పొందిన ఆనంద అనుభూతిని గానంచేశారు .. అదే తిరువాయ్ మొజి.

 శఠకోపులవారి పాటలను విని శ్రీరంగనాథుడే స్వయంగా 'నా' ఆళ్వార్ అనిపిలిపించుకున్నాడు,  అందుకే నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది.

 పరమ ప్రయోజనం భగవంతుడే అనే విశ్వాసంతో  ఎవరు పూజిస్తారో వారికి లభిస్తాడు భగవంతుడు. నాకు సమస్తం అతడే 'వాసుదేవః సర్వం' అని కోరిన నమ్మాళ్వార్ లాంటివారు దొరకడం ఎంత కష్టం అనుకున్నాడు పరమాత్మ. 'ఉన్నుం శోరు పరుగు నీరు తిండిం వెత్తిలయుం ఎల్లాం కన్నన్' నాకు తినే తిండి త్రాగే నీరు విళాసమైన వస్తువులు అన్నీ కృష్ణుడే అనుకున్నారు నమ్మాళ్వారు.  అట్లా అనుకున్నందుకు నమ్మాళ్వార్ తన స్థానం కూడా వదిలిపెట్టి వీరి హృదయాన్నే తన స్థానంగా చేసుకున్నాడు. వీరికి భగవంతుడిపై వ్యామోహం కాదు భగవంతుడికే నమ్మాళ్వార్ అంటే వ్యామోహం. నమ్మాళ్వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అనే పిచ్చి భగవంతుడికి కల్గేట్టు చేసారు. అందుకే నమ్మాళ్వార్ కి 'కృష్ణ తృష్ణా తత్వం' అని పేరు పెట్టారు పూర్వ ఆచార్యులు. అందుకే నమ్మాళ్వార్ ని పట్టుకుంటే కృష్ణుడు దొరక పోవడం అనేది ఉండదు. భగవంతుడి ప్రేమకి లక్ష్య భూతమైన వారు నమ్మాళ్వార్.

నమ్మాళ్వారు భగవంతుని అందరికీ నీ అనుగ్రహం లభించాలి అని కోరారు...

నీద్వారా వచ్చిన వారినే అనుగ్రహిస్తాను అన్నాడు పరమాత్మ...

ఐతే నీపాదుకలను నాతలపై ఉంచుకుని వారిని నీదయకు పాత్రులుగా చేస్తా అన్నారు నమ్మాళ్వారు.

 అందుకే మన ఆలయాల్లో తల శఠగోపం తలపై  తాకిస్తారు. శఠగోపం అంటే నమ్మాళ్వారే. అట్లా తాకించుకుంటే ఆయన కృప మనకు లభించినట్టే.   అందుకే భగవత్ కృప మూర్తీభవించిన ఆ ఆళ్వార్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమి ఉండవు అని అనుకుంటారు భక్తులు . అట్లా భావించే వారే నాకు సర్వస్వం అని భగవంతుడు అనుకుంటాడు.

భగవంతుడు ఎవరినైతే ప్రేమించాడో వారిని ఆళ్వారులు అని అంటాం.

భగవద్గీత 7 వ అధ్యాయంలో పరమాత్మ తనని కోరే వారు నాలుగు రకాలుగా ఉంటారని చెబుతూ ఒకనాడు అనుభవించి కోల్పోయిన సంపదలను కాంక్షించేవారు కొందరైతే ఇది వరకు లేని సంపదలను కాంక్షించేవారు మరి కొందరు, ఇలా వీరిని ఆర్థులు, అర్దార్థులు అని చెప్పి, మరి కొందరు ఆత్మ సాక్షాత్కారం కోరే వారు, వారిని జిజ్ఞాసువులు అని, నాలుగవ రకానికి చెందినవారిని జ్ఞాని అని చెప్పాడు స్వామి. . ఈ నాలుగు రకాలవారు సుకృతులు, ఏం కావాల్సినా నన్నే కోరుకుంటారు. ఈ నలుగురిలో ముగ్గురిని ఒక విభాగం చేసాడు. ఒకరిని ఒక విభాగం చేసాడు. అయితే ఈ ముగ్గురూ నన్నూ కోరుకుంటారు, నేను ఇచ్చేవి కోరుకుంటారు. నేను ఇస్తాను కనక నన్ను కోరుకుంటారు. అందుకే వారు ఏక భక్తులు కారు, ద్వి భక్తులు. "తేషాం జ్ఞాని నిత్య యుక్తః ఏక భక్తిః విశిష్యతే"

కానీ జ్ఞాని అనేవాడు ఏక భక్తి కలిగి ఉంటాడు, కేవలం నన్నే కోరుకుంటాడు, నేను ఇచ్చేవాటియందు ప్రేమ ఉండనే ఉండదు. ఎప్పటికి నన్నే కూడి ఉంటాడు.  మరి జ్ఞానికి నీకు ఉండే అనుబంధం ఎట్లాంటిది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా "ప్రియోహి జ్ఞానినోహి అహం అత్యర్థం సచ మమ ప్రియః" వాడికి నా జ్ఞానం కంటే గొప్ప ఇష్టం నేనంటే, నాకూ జ్ఞాని అంటే అంత ఇష్టం.అన్నాడు భగవానుడే స్వయంగా.... వారే ఆళ్వారులు... వారిలో నమ్ళ్వారులు ప్రధానమైనవారు.
********************

కామెంట్‌లు లేవు: