25, ఆగస్టు 2020, మంగళవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*74వ నామ మంత్రము*

*ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః*

భండాసురుని ముప్పైమంది కుమారులను సంహరించడానికి ఉద్యుక్తురాలైన తన కుమార్థె అయిన బాలాత్రిపురసుందరి విక్రమమును చూసి ఆనందించిన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను, ఆమె అంశలో జనియించిన బాలాత్రిపురసుందరిని మనోనేత్రములందు దర్శించుచూ ఉపాసించిన సాధకులకు వారిలో *భ్రమలను కలిగించి, వంచనకు గురిచేసే* అసురీశక్తులు నిర్మూలింపబడి కాపాడబడడమేకాక ఆ బాలాత్రిపుర సుందరి కరుణతో సరస్వతీ కటాక్షముతో విద్వత్తు, లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు, శక్తీ కటాక్షంతో లోకాలను ఆకట్టుకునే వాక్పటిమ సంప్రాప్తించి సుఖసంతోషాలతో జీవనం సాగించి అంత్యమున పరమపదమును పొందుదురు.

భండాసురునిపై యుద్ధమునకుద్యుక్తురాలైన జగదాంబ భండాసురుని తన శక్తిసేనలతో మట్టుపెడుతూ మంత్రిణి రాజశ్యామల, దండనాయకి అయిన వారాహి తనవెంట కదలివెళుతుండగా, అశ్వసేనకధినాయకురాలు అశ్వారూఢ, గజసేనకు నాయకురాలైన సంపత్కరీ వెనుకముందులుండగా, జ్వాలామాలిని, వహ్నివాసినులైన అగ్నిస్వరూపిణిలు వహ్నిప్రాకారములునేర్పరుచగా శక్తిస్వరూపిణి అయిన జగన్మాతపై భండాసురుని పుత్రులు ముప్పది మంది వీరావేశంతో విరుచుకుపడుతుంటే తనఅంశనుండి ఉద్భవించిన తొమ్మిది సంవత్సరముల బాలాత్రిపురసుందరిని భండునిపుత్రులతో పోరుసల్పమని ఆజ్ఞాపించింది. ఆ బాలా (కుమారి) త్రిపురసుందరి, మహాత్రిపురసుందరి  ఇచ్చిన రథమునధిరోహించి, సర్వాయుధపరిష్కృతయై, మహాత్రిపుర సుందరితో సమానమైన శక్తియుక్తులు కలిగినదగుటచేత చండప్రచండముగా భండుని సైన్యమును త్రొక్కుకుంటూ దాటి భండుని ముప్పైమంది పుత్రులను తునుముతుంటే మహాత్రిపురసుందరి ఆనందానికి ఆకాశంకూడా హద్దులు లేకుండాపోయిందని ఈ నామమంత్రములోని భావము.

*భండుని పుత్రులు*

1) చతుర్భాహువు, 2) చకోరాక్షుడు, 3) చతుశిరస్కుడు, 4)  వజ్రఘోషుడు, 5) ఊర్థ్వకేసుడు, 6) మహాకాయుడు, 7) మహాహనువు, 8) ముఖశత్రువు, 9) మఖస్కందుడు, 10) సింహఘోషుడు, 11) విరాలకుడు, 12) లశునుడు, 13) కుట్టిశేనుడు, 14) పురజిత్తు, 15) పూర్యరనూకుడు, 16) సర్గశత్రువు, 17) ఇంద్రశత్రువు, 18) అమీత్రకుడు, 19) విద్యున్మాలి, 20)  ఉగ్రకర్మ, 21) ఉగ్రధన్వా, 22) స్వర్గపీడుడు, 23) దుర్గుడు, 24) స్వర్గకంటకుడు, 25) అతిమాయుడు, 26) బృహన్నాయుడు, 27) విభీషణుడు, 28) శ్రుతిపారగుడు, 29) విదురుడు, 30) ఉపమాయువు.

బాలాత్రిపుర సుందరిని *బాల* అనియు, అలాగే బాలాత్రిపుర సుందరీ మంత్రము *బాలామంత్రమనియు* మిగుల ప్రసిద్ధి. ఈ బాలామంత్రం ఈ విధంగా ఉంటుంది *ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం" అంటూ *శ్రీబాలాయై నమః* లేదా *శ్రీబాలాత్రిపురసుందర్యై నమః* అని జపంచేయాలి. కాని ఈ మంత్రం గురువునుండి ఉపదేశింపబడాలి. ఈ మంత్రంలో *ఐం* అనేది వాగ్భవబీజం అనగా సరస్వతీ కటాక్షం కలిగిస్తుంది. *క్లీం* అనేది కామకళాబీజం, ఆకర్షణకు, చతుష్షష్టి కళలకు, లక్ష్యసిద్ధికి చెందుతుంది. *సౌః* అనేది మంగళ ప్రదమైన మోక్షానికి సంబంధించినది. అందుకే ఈ మంత్రం సర్వాభీష్ట ప్రదానమైన మంత్రంగా పండితులు చెబుతారు. *ఒక ఉదాహరణ* ప్రముఖ శ్రీవిద్యోపాసకులు కీర్తిశేషులు, (చందోలు - గుంటూరుజిల్లా)  తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు *బాలాత్రిపురసుందరీ ఉపాసకులు* తొలిరోజుల్లో కడుపేదరికం అనుభవించారు. అమ్మవారికి ఉద్ధరిణి ఉదకం మాత్రం బాలాత్రిపురసుందరీ అమ్మవారి మంత్రజపం తరువాత నివేదించేవారు. ఆ తల్లికి అవన్నీ తెలుసు. లక్ష్మీకటాక్షం కలిగించింది. పదిమందికి పిలిచి అన్నం పెట్టేలాగ, ఎందరికో వేదవిద్యనభ్యసింప జేశావిధంగా వారిని కరుణించింది. ఆతల్లికి వారింట్లోనే ఒక మందిరం ఏర్పాటు చేస్తే వారితోటే ఆ బాల ఉండేది. అమ్మా! అని పిలిస్తే *పిలిచావా బాబూ* అని ఆయనకు కనిపించేది. *నిన్నుకాదమ్మా* అనేవారు. *అయితే నన్ను పిలువవా* అనేది ఆ తల్లి. వారింట్లో పసిపిల్లగా తిరిగిన అనుభవం వారికుంది. వారి ఇంట్లో అందరిలో కలసిపోయి ఒకరోజున చేతికి గాజులు వేయించుకొని తాను వారితోటే ఉన్నానని దృష్టాంతం ఇచ్చిందంటే  *రాఘవనారాయణ శాస్త్రి* గారిని ఒక *మహర్షిగా* మలచిందంటే *బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం* ఎలాంటిదో మనం గ్రహించాలి. ఎలా చివరకు వారి చితిమంటల్లో ఎగిసిపడిన జ్వాలల్లో జ్వాలగా ఆ *బాల*  చూపరులకు సైతం కనబడింది. ఎన్నో కెమెరాలలో ఛాయాచిత్రంగా చోటుచేసుకున్నది. అంత ప్రభావం ఉంది బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం.

అంతటి మహాతల్లికి నమస్కరించునపుడు *ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***********************

కామెంట్‌లు లేవు: