25, ఆగస్టు 2020, మంగళవారం

శ్రీరాముడి మహత్వం-

 శ్రీ కొప్పరపు కవులు & విశ్వనాథ సత్యనారాయణ : తావక నామ సుధారస రుచి యెల్ల / వాణీశ వంద్య,శర్వాణి యెరుగు /భవదీయ పదరజోలవ మహత్వంబెల్ల / గౌతమ మౌనీంద్రుకాంత యెరుగు / త్వన్ మహాబాహు దర్ప ప్రభావంబెల్ల / జనకపూజిత శైవచాప మెరుగు / యుష్మత్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీల యెల్ల / భార్గవవు డెఱుంగు / స్రితజన ప్రీతియెల్ల / సుగ్రీవుడెఱుఁగు/ నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల/  ఆ విభీషణుడెఱుఁగు/ నీ అఖిల మహిమల్, యేమెరుంగుదుమ్ / ఏలుమో / రామదేవ : ఈ పై  పద్యం కొప్పరపు కవులు 1921లో పంగిడిగూడెం శతావధానంలో ఆశువుగా చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్ష కావ్య అవతారికలో ఒక పద్యం రాశారు. పావు నెఱుంగు బ్రహ్మ, సగపాలును మాత్ర మెఱుంగు పార్వతీ/ దేవియు, నీ వెఱుంగుదువు తెల్లము రామమహత్తు కృత్ స్న / మా దేవున కేను నీ యనుమతిం బడి నంకిత మిత్తు జానకీ/ దేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్. (1) మొదటి పద్యం తాత్పర్యం: నీ నామామృతం (శ్రీరామ నామామృతం)లోని  రుచి/వెలుగు బ్రహ్మదేవునితో  వందనాలు పొందే శర్వాణి/పార్వతీదేవికి మాత్రమే తెలుసు. నీ పాద ధూళి యొక్క గొప్పతనం అహల్యకు మాత్రమే తెలుసు. నీ బాహుబలం జనక మహారాజుతో పూజించబడిన శివధనుస్సుకు తెలుసు. అమోఘమైన నీ బాణ ప్రయోగంలో ఉండే వైభవం పరుశురాముడికి మాత్రమే తెలుసు. నిన్ను ఆశ్రయించినవారిని రక్షించే నీ ప్రేమతత్త్వం సుగ్రీవుడికి మాత్రమే తెలుసు. శరణుకోరి వచ్చినవారిని నిరంతరం కాపాడే  నీ శరణాగత వైభవం ఆ విభీషణుడికి మాత్రమే తెలుసు. నీ మహిమలన్నీ ఏమి తెలుస్తాయి?. అందరికీ తెలియవు కదా! అని తాత్పర్యం. ఇక్కడ ఏము ఎఱుంగుదుము, అనేది శ్లేష.నీ మహిమలన్నీ  మాకు తెలుసు అని అర్ధం. మేము నీకు పరమ భక్తులం కాబట్టి, మాకు తెలుస్తాయని, గర్వంగా చెప్పుకోవడం ఈ శ్లేషలోని విశేషం. కొప్పరపు కవులు అవధానంలో ఆశువుగా అలవోకగా చెప్పిన పద్యంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇది కొప్పరపువారి అసమాన ప్రతిభకు ఒక మెచ్చు తునక. విశ్వనాథ సత్యనారాయణకు కొప్పరపు కవులంటే విశేషమైన గౌరవం. గురుభావం. కొప్పరపువారి కంటే, విశ్వనాథ 8-10ఏళ్ళు చిన్నవాడు.కొప్పరపువారి అనేక అవధాన, ఆశుకవిత్వ సభలు స్వయంగా చూసినవాడు. శ్రీ రామాయణ కల్పవృక్షంలో రాసిన పై పద్యం తాత్పర్యం ఒకసారి చూద్దాం: నీ గురించి (రాముని) బ్రహ్మదేవుడికి పావువంతు మాత్రమే తెలుసు. పార్వతీదేవికి నీ గురించి సగం మాత్రమే తెలుసు.నీకొక్కడికే బాగా/సంపూర్ణంగా  తెలుసు.ఇక్కడ నీకు అంటే?  నందమూరులోని విశ్వేశ్వరుడికి  అని అర్ధం. నందమూరు విశ్వనాథ స్వగ్రామం. ఈయన ప్రియశిష్యుడు ఎన్టీఆర్ ఇంటిపేరు కూడా  నందమూరు కావడం విశేషం. ఇది ఇలా ఉంచుదాం. పద్యశిల్పంలో ఇద్దరు మహాకవుల ఎత్తుగడలో ఉన్న సారూప్యత వివరించడమే నా ఉద్దేశ్యం. కొప్పరపువారిది వచించిన పద్యం. విశ్వనాథది రచించిన పద్యం. మహాకవులు వచించినా? రచించినా, మహాకవిత్వమే వస్తుందని చెప్పడానికి ఈ పద్యాలు ఒక ఉదాహరణ. నమః -జయహో!తెలుగు పద్యం-మా
**********************

కామెంట్‌లు లేవు: