12, ఆగస్టు 2020, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదకొండవ అధ్యాయము

దేవాసుర సంగ్రామము సమాప్తమగుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

11.1 (ప్రథమ శ్లోకము)

అథో సురాః ప్రత్యుపలబ్ధచేతసః  పరస్య పుంసః పరయానుకంపయా |

జఘ్నుర్భృశం శక్రసమీరణాదయస్తాంస్తాన్ రణే యైరభిసంహతాః పురా॥6618॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! లోగడ ఇంద్రుడు, వాయువు మొదలగు దేవతలు రణరంగమున దైత్యులచే దెబ్బతినియుండిరి. ఇప్పుడు పరమపురుషుడైన శ్రీహరియొక్క అవ్యాజమైన కరుణవలన దేవతల ఆందోళన తొలగిపోయెను. వారు నూతనోత్సాహమును పొందిరి. అందువలన, తమ శక్తినంతయు కూడగట్టుకొని దైత్యులపై విజృంభించిరి.

11.2 (రెండవ శ్లోకము)

వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసనః|

ఉదయచ్ఛద్యదా వజ్రం ప్రజా హా హేతి చుక్రుశుః॥6619॥

పూజ్యుడైన ఇంద్రుడు బలి చక్రవర్తితో పోరాడుచు కోపావేశముతో అతనిని దెబ్బతీయుటకు వజ్రాయుధమును చేబూనెను. అప్పుడు ప్రజలందరును హాహాకారములను ఒనర్చిరి.

11.3 (మూడవ శ్లోకము)

వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురఃస్థితమ్|

మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే॥6620॥

బలిచక్రవర్తి, అస్త్రశస్త్రములను ధరించి, పరమోత్సాహముతో నిర్భయముగా యుద్దభూమియందు ఇంద్రుని సమక్షమున నిలిచెను. అంతట ఇంద్రుడు వజ్రాయుధమును చేబూని, తిరస్కార భావమున అతనితో (బలితో) ఇట్లనెను-

11.4 (నాలుగవ శ్లోకము)

నటవన్మూఢ మాయాభిర్మాయేశాన్ నో జిగీషసి|

జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనమ్॥6621॥

11.5 (ఐదవ శ్లోకము)

ఆరురుక్షంతి మాయాభిరుత్సిసృప్సంతి యే దివమ్|

తాన్ దస్యూన్ విధునోమ్యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదధః॥6622॥

11.6 (ఆరవ శ్లోకము)

సోఽహం దుర్మాయినస్తేఽద్య వజ్రేణ శతపర్వణా|

శిరో హరిష్యే మందాత్మన్ఘటస్వ జ్ఞాతిభిః సహ॥6623॥

"మూర్ఖుడా! నటుడు చిన్న పిల్లల కళ్ళు మూసి, వారి వస్తువులను దొంగిలించినట్లు నీవు నీ మాయను మాపై ప్రయోగించి, విజయమును పొందగోరుచున్నావు. మేము మాయకు ప్రభువులమని నీవు ఎరుగవు కాబోలు, నీవు మమ్ములను ఏమియును చేయజాలవు. మూర్ఖులు మాయద్వారా స్వర్గాధిపత్యమును పొందగోరుదురు. అంతేగాదు పైలోకముల యందు గూడ తమ అధికారమును పొందగోరుదురు. దోపిడి దొంగలైన అట్టి మూర్ఖులను నేను వారి మునుపటి స్థానముకంటెకూడ క్రిందికి పడద్రోయుదును. ఓయీ! బుద్ధిహీనుడా! నీవు పెక్కుమాయలను పన్నితివి. చూడుము. నేడు నేను నూరంచులుగల నా వజ్రాయుధముతో నీ శిరస్సును ఖండించెదను. నీవు బంధుమిత్రులకు చేయగల సహాయము పూర్తి చేయుము"

బలిరువాచ

11.7 (ఏడవ శ్లోకము)

సంగ్రామే వర్తమానానాం కాలచోదితకర్మణామ్|

కీర్తిర్జయోఽజయో మృత్యుః సర్వేషాం స్యురనుక్రమాత్॥6624॥

11.8 (ఎనిమిదవ శ్లోకము)

తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః|

న హృష్యంతి న శోచంతి తత్ర యూయమపండితాః॥6625॥

11.9 (తొమ్మిదవ శ్లోకము)

న వయం మన్యమానానామాత్మానం తత్ర సాధనమ్|

గిరో వః సాధుశోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః॥6626॥

బలి పలికెను ఇంద్రా! విధి చోదితుడై తమ కర్మానుసారము యుద్ధమున దిగినవారికి జయమో, అపజయమో, కీర్తియో, అపకీర్తియో, కడకు మృత్యువో కలుగుట తథ్యము. కనుక, జ్ఞానులు ఈ జగత్తు అంతయు విధికి వశమైయుండునని తెలిసి కొందరు. వారు విజయము ప్రాప్తించినపుడు పొంగిపోరు. అపజయమునకు క్రుంగిపోరు. బహుశ మీకు తెలియకపోవచ్చును. జయాపజయములకు మేమే కర్తలమని బహుశా మీరు తలంచుచుందురు. అందువలన మహాత్ములు మిమ్ములను జూచి జాలిపడెదరు. మేము మాత్రము మీ  పరుష  వచనములను లెక్కచేయుము. ఇంక మాకు దుఃఖమెట్లు కలుగును?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319

కామెంట్‌లు లేవు: