12, ఆగస్టు 2020, బుధవారం

*ఆధ్యాత్మిక సాధన*

దేహంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యం బావుంటుంది. దేశమంటే మనుషులు. మనుషులంతా సంఘటితంగా ఉంటేనే ఏ దేశానికైనా భవిష్యత్తు. దేహమైనా, దేశమైనా క్లిష్టపరిస్థితులు తప్పవు. వాటిని ఎదుర్కొనేందుకు సంకల్పబలం అవసరం. సంకల్పం అధినేతదైతే బలాన్ని అందించేది ప్రజలు. సంకల్పబలం గట్టిదైతే దైవబలం తప్పక తోడవుతుంది.

ఎందరో మహానుభావుల త్యాగాలు, మహర్షుల తపస్సుతో పునీతమైంది ఈ భూమి. వేదాలు, పురాణాలు ఈ దేశానికి దిక్సూచిగా నిలిచాయి. ఉన్నతమైన సంస్కృతీ సంప్రదాయాలు అబ్బురపరచే కళలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి.

నాగరికతతోపాటు మనుషుల్లో స్వార్థమూ పెరిగింది. అనేక సదాచారాలు మరుగున పడిపోయాయి. ఈ తరంవారు వాటిని మూఢవిశ్వాసం అని కొట్టిపారేసినా వాటిని కోరుకునేవారూ లేకపోలేదు. ప్రవచనకర్తలు ప్రస్తావిస్తే ఆశ్చర్యంగా వినేవారూ ఉన్నారు.

ఆధ్యాత్మిక సాధనలు ఎవరినైనా శుద్ధిచేస్తాయి. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక సాధన చేసిన గురువులు ఎంతో పవిత్రంగా తయారై భగవంతుడికి దగ్గరవుతారు. గులాబీ తోటలో ఎక్కువకాలం గడిపేవారు తమతో ఆ గులాబీ పరిమళాన్ని వెంటబెట్టుకుని వెడతారు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ, ఆ పరిమళానికి దగ్గరైనవారు ఆ గురువుకు శిష్యులుగా మారతారు.

ఉన్నత శిఖరాలకు చేరుకోవడం, చేరుకున్నాక అక్కడే ఉండగలగడం అంత తేలికైన విషయం కాదు. కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అవి మనిషికి బలాన్నీ ఇస్తాయి.

దక్షిణాఫ్రికాలో రైలు నుంచి నెట్టివేతకు గురైన మహాత్మాగాంధీ, అనంతరకాలంలో ఎన్నో క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. స్వాతంత్య్ర పోరాటం, జైలుశిక్షలు... ఎన్నో ఎదుర్కొన్నారు. అది ఆయనలో శక్తిని పెంచింది. అనేకం సాధ్యమయ్యేలా చేసింది. ఇరవై ఏడేళ్లపాటు జైలు జీవితం గడిపిన నెల్సన్‌ మండేలా ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు ఆయనను శక్తిమంతుణ్ని చేశాయి. నోబెల్‌ శాంతి పురస్కారం, దక్షిణాఫ్రికా అధ్యక్షపదవి కోరి వరించాయి.

మదర్‌ థెరెసా, రాక్‌ ఫెల్లర్‌, అంబేడ్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌, చార్లీచాప్లిన్‌... ఎవరిని తీసుకున్నా, జీవితంలో వారు ఆ స్థాయిని చేరడానికి కారణం- కఠిన పరిస్థితులు. అంతకుమించి- రాజీపడని మనస్తత్వం, పట్టుదల.వేగంగా పరుగులు తీసే ప్రపంచంలో మనిషి మనశ్శాంతికి ప్రార్థన, ధ్యానం అవసరం.ప్రార్థనలో అనంతశక్తితో సంభాషించవచ్ఛు ఆ అనంతశక్తి చెప్పేదేమిటో తెలుసుకోవడానికి ధ్యానం దోహదపడుతుంది.

వేరుపడటానికి, ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించాలి మనిషి. అంతర్ముఖంగా ప్రయాణించడానికి సమయం కావాలి. బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకుంటేగానీ అంతరంగంతో సంబంధం కలుపుకోవడం సాధ్యపడదు. ఒంటరితనంలోనే తెలుస్తుంది- మనిషికి తాను ఒంటరికాదనే సత్యం.

‘భగవంతుడా... నా జీవితం ఎందుకింత కఠినం’ అని రోజూ కుమిలిపోతుంటే, ఒక్కటే సమాధానం- ‘నీలో బలం పెరుగుతోంది గొప్పవాడివి కావడానికి... భరించు కొంతకాలం. బలమైనవారు గొప్ప పనులు సాధిస్తారు.

విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ఎవరికీ సౌకర్యంగా ఉండదు. ఎదురైన పరిస్థితిని ఒక సవాలుగా తీసుకుని, ఒక పథకం ప్రకారం ఎదుర్కొంటే విజయం తప్పక లభిస్తుంది!
****************

కామెంట్‌లు లేవు: