12, ఆగస్టు 2020, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము

దేవాసుర సంగ్రామము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

10.52 (ఏబది రెండవ శ్లోకము)

ఏవం దైత్యైర్మహామాయైరలక్ష్యగతిభీషణైః|

సృజ్యమానాసు మాయాసు విషేదుః సురసైనికాః॥6612॥

ఈ విధముగా భయంకరులైన రాక్షసులు గొప్ప మాయను సృష్టించిరి. దాని ప్రభావమున వారు శత్రు సైన్యములకు కనబడకుండిరి. ఆ కారణమున దేవతలు వారిని ఎదుర్కొనుట సాధ్యము కాకపోవుటచే మిగుల వగచుచుండిరి.

10.53 (ఏబది మూడవ శ్లోకము)

న తత్ప్రతివిధిం యత్ర విదురింద్రాదయో నృప|

ధ్యాతః ప్రాదురభూత్తత్ర భగవాన్ విశ్వభావనః॥6613॥

రాజా! ఇంద్రాది దేవతలు రాక్షసుల మాయలకు ప్రతీకారమొనర్చుటకు ఎంతగ ఆలోచించినను, వారికి ఎట్టి ఉపాయము తోచకుండెను. అప్పుడు వారు సకల ప్రాణుల జీవనదాతయైన శ్రీహరిని స్మరించిరి. వెంటనే ఆ ప్రభువు వారి ఎదుట నిలిచెను.

10.54 (ఏబది నాలుగవ శ్లోకము)

తతః సుపర్ణాంసకృతాంఘ్రిపల్లవః   పిశంగవాసా నవకంజలోచనః|

అదృశ్యతాష్టాయుధబాహురుల్లసచ్ఛ్రీకౌస్తుభానర్ఘ్యకిరీటకుండలః॥6614॥

ఆ స్వామి గరుత్మంతుని భుజస్కంధములపై ఆసీనుడైయుండెను. ఆయన పాదములు చిగురుటాకులవలె మిగుల సుకుమారములు. పీతాంబరధారియైన ఆ ప్రభువు యొక్క నేత్రములు అప్పుడే వికసించిన పద్మములవలె కోమలములై యుండెను. ఆ ప్రభువు యొక్క ఎనిమిది బాహువులయందును ఆయుధములు విలసిల్లుచుండెను. కంఠమున కౌస్తుభమణి, శిరమున అమూల్యమైన కిరీటము, చెవులయందు మణికుండలములు ధగధగలాడుచుండెను. ఆ పరమపురుషుని దివ్యస్వరూపమును దేవతలు గాంచిరి. ఆ పురుషోత్తముని వక్షఃస్థలమున లక్ష్మీదేవి అలరారుచుండెను.

10.55 (ఏబది ఐదవ శ్లొకము)

తస్మిన్ ప్రవిష్టేఽసురకూటకర్మజా  మాయా వినేశుర్మహినా మహీయసః|

స్వప్నో యథా హి ప్రతిబోధ ఆగతే హరిస్మృతిః సర్వవిపద్విమోక్షణం॥6615॥

మానవుడు నిద్రనుండి మేలుకొనిన వెంటనే స్వప్నములో కనబడిన వస్తువులు అదృశ్యమైనట్లు, పరమాత్మ ప్రత్యక్షము కాగానే అసురులు సృష్టించిన మాయలన్నియును అదృశ్యమయ్యెను. భగవంతుని స్మరించినంతనే ఆపదలు అన్నియు తొలగిపోవుట సహజముగదా!

10.56 (ఏబది ఆరవ శ్లోకము)

దృష్ట్వా మృధే గరుడవాహమిభారివాహః  ఆవిధ్య శూలమహినోదథ కాలనేమిః |

తల్లీలయా గరుడమూర్ధ్ని పతద్గృహీత్వా తేనాహనన్నృప సవాహమరిం త్ర్యధీశః॥6616॥

శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై రణరంగమున ప్రవేశించుట చూచి, సింహముపై ఆసీనుడైయున్న కాలనేమి అను రాక్షసుడు ఒక త్రిశూలము ఆ స్వామిపై ప్రయోగించెను. అది గరుత్మంతుని శిరస్సుపై పడకముందే శ్రీమన్నారాయణుడు దానిని అవలీలగా పట్టుకొని, ఆ శూలముతోనే కాలనేమిని, అతని వాహనమును పరిమార్చెను.

10.57 (ఏబది ఏడవ శ్లోకము)

మాలీ సుమాల్యతిబలౌ యుధి పేతతుర్యచ్చక్రేణ కృత్తశిరసావథ మాల్యవాంస్తమ్|

ఆహత్య తిగ్మగదయాహనదండజేంద్రం    తావచ్ఛిరోఽచ్ఛినదరేర్నదతోఽరిణాద్యః॥6617॥

మాలి, సుమాలి అను దైత్యులు మిగుల బలశాలులు. శ్రీమహావిష్ణువు యుద్ధమున చక్రముచే వారి శిరస్సులను ఖండించెను. అంతట వారు నిర్జీవులై నేలగూలిరి. పిదప మాల్యవంతుడు గర్జించుచు ప్రచండమైన తనగదను గరుడునిపై ప్రయోగించెను. ఇంతలోనే శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే దశమోఽధ్యాయః (10)

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: