5, సెప్టెంబర్ 2020, శనివారం

అతడు... అగ్రహారం ఆయుధం





‘‘ ఏరా... ఏవూరేటి మనది. గొబ్బరి కాయలు ఎన్నాళ్ల నించి సేతున్నారేటి వీ దొంగతనాలు.. మా తోటలోయేనా... ఇంకెవరి తోటలోయేనైనా అట్టుకుపోతున్నారా’’

‘‘ మీరేనా.. వింకా తొత్తు కొడుకులున్నారా... ’’

‘‘బామ్మర్ల తోట కదా.. ఎవడూ అట్టుకోరనుకున్నారా’’

‘‘ ఇన్ని అడుగుతూంటే మాటాడేరేటి’’

‘‘ఇలా కాదురా... నాలుగు తగిలించాలి. ఆనక పొలీసోళ్లకి వప్పగించాలి. మంచిగా అడిగితే మీరు సెప్పరు’’

అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలైంది. డిగ్రీ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిలు తప్ప మాలాంటి నిక్కరు బ్యాచీ ఇంకా పక్కల మీంచి లేవలేదు. ఐదుగురు జమాజెట్టీల్లాంటి మనుషుల్ని తలో కొబ్బరి చెట్టుకీ కట్టేసి...

చేయి చేసుకోవడం లేదు కాని... నిజం చెప్పించే పనిలో బెదిరిస్తున్నాడు ఆ తోట కాపాలాదారు మరిడయ్య. 

అది ప్లీడరు గిరి చేస్తున్న వాడ్రేవు రాజబాబు ఇల్లు. వాడ్రేవు మహదేవుడి గారి ఆఖరి కుమారుడు రాజబాబు. ఆ ఇల్లు పావు ఎకరంలో ఉండేది. దాని వెనుక ఓ రెండూ, రెండున్నర ఎకరాల కొబ్బరి తోట. అందులోనే అంతర పంటలాగా కొన్ని మామిడి చెట్లు, అరటి తోట ఉండేది. మొక్కజొన్న కూడా ఉండేది కాని అది సీజన్ లోనే. ఆ తోటకి కాపాలాదారు మరిడయ్య. వాడ్రేవు రాజబాబుగారి తండ్రి మహదేవుడు గారు ఉన్నప్పటి నుంచీ అతనే కాపలాదారు. కాదు... కాదు... ఆ ఇంటి మనిషి. నిజానికి మరిడయ్య ఆ ఇంటికే కాదు.... మొత్తం అగ్రహారానికి కాపాలాదారుడు.

మరిడయ్య... దేహమంతా నల్లగా... కళ్లు మాత్రం ఎర్రగా... కాసింత కాలిన బొగ్గు ముక్కలా ఉండేవాడు.

మరిడయ్య... పాదాలకు జోళ్లు కావాలంటే ప్రత్యేకంగా విజయవాడలో తయారయ్యే పాపులర్ షూ మార్టుకో.. ప్రజా షూ కంపెనీకో ఆది (సైజ్) పంపించి పురవాయించాలి. అదంతా చేయడం కష్టం కాబట్టి మరిడయ్య కాళ్లకి జోళ్లు ఎప్పుడూ వేసుకోలేదు.

మరిడయ్య.. పాదాల వేళ్లు వర్షాకాలంలో బయటకు వచ్చిన కొబ్బరి చెట్టు వేర్లలా అక్కడక్కడ వంకర్లు పోతూ ఉండేవి.

ముతక పంచె కట్టుకుని లోపలికి జేబున్న ముతక బనీను వేసుకునే వాడు. తలపాగా ఉండేది కాదు కాని భుజం మీద తువ్వాలు వేసుకునే వాడు. చేతిలో కర్ర కర్ణుడి కవచంలా నిరంతరం మరిడయ్యతోనే ఉండేది. కాసింత పెద్ద ఆనపకాయ మరిడయ్య అరిచేతిలో పెట్టుకుంటే పెద్ద పెద్ద బాహువుల మధ్య బందీ అయిన ఆడపిల్లలా కనిపించేది.

మరిడయ్య... నల్ల మేఘ శ్యాముడు...

* * *

అప్పటికి ఐదారు నెలలుగా కొబ్బరి తోటలో దొంగలు పడుతున్నారు. కొబ్బరి కాయల దింపు సమయంలో ఈ దొంగతనం తేలేది. దింపు తర్వాత పది, పదిహేను రోజులకి చెట్టుకు ఉన్న కాయల్లో వచ్చే నెల ఎన్ని దించాలో లెక్కలు కట్టడంలో మరిడయ్యది కొబ్బరి చెట్టుకు అంటుకట్టినంత సులభంగా తెలుసు. కాని ఆ లెక్క తప్పుతోంది.

తనదే తప్పు అనుకున్నాడు

తన లెక్క తప్పిందనుకున్నాడు

తనకు వయసు వచ్చేస్తోందేమోనని తల్లడిల్లాడు

తన పని అయిపోయిందా అని కూడా బెంగటిల్లాడు

ఒక నెల తప్పుతుంది... పోనీ రెండు నెలలు...

ప్రతీ నెలా ఇలా ఏమిటీ అనుకున్నాడు.

 ఏదో జరుగుతోందని పసి గట్టాడు.

ఇది దొంగల పనా అని సందేహించాడు.

 దింపు తీసే వాళ్లే చేయి చేసుకుంటున్నారా అని అనుమానించాడు.

బామ్మర్ల దొడ్డిలో ఎవరు పడతారు అని కాసింత సమాధాన పడ్డాడు.

కొబ్బరి దింపు లెక్క తప్పుతున్నందుకు కామందు ఏమనడం లేదు కాని మరిడయ్యేకే మనసు మనసులో లేదు.

కాపు కాసాడు.... తోటలో ఓ రోజు రాత్రి తూర్పు దిక్కుగా పడుకుని కాపలా కాశాడు... అబ్బే ఏ జరగలేదు...

మర్నాడు పడమర దిక్కున కూసున్నాడు... ఎవరూ కాన రాలేదు...

తాను కాపలా ఉన్నానని తెలిసిందేమోనని అనుమానించాడు.

పోనీ వోరం రోజులు ఆగుదామనుకున్నాడు. పది రోజులు ఆగాడు.

ఉత్తరం దిక్కున తొంగోకూడదని పెద్దలు సెపితే దక్షిణం దిక్కున కాపు కాశాడు. అలా మూడు రోజులు ఆగాడు. అబ్బే ఎవలూ రాలేదు.

‘‘లంజి కొడుకులకి తెలిసిపోయింది’’ అనుకున్నాడు.

‘‘ ఈల్లన్ని ఎలాగైనా పట్టుకోవాలి’’

‘‘ఈల్లకి సుక్కలు సూయించాలి’’

‘‘ఈల్లకి మరిడయ్యంటే ఏటో తెలియాలి’’ అనుకున్నాడు.

ఆలోచించాడు. వేదన పడ్డాడు. విసుగు, విరామం లేకుండా యోచించాడు.

‘‘ అమ్మ మరిడిగా... తొత్తుకొడకా... నువ్విలా సేత్తే ఆల్లేందుకు వత్తార్రా’’ అనుకున్నాడు.

తాను చేసిన తప్పు తెలుసుకుని జాగ్రత్త పడ్డాడు. తోటలో ఏ మూల కూసున్నా సుట్ట ఎలిగించకూడదకున్నాడు.

తన సుట్ట ఎలుగు ఆ తొత్తు కొడుకులకు తెలిసిపోతాంది అనుకున్నాడు.

అంతే వ్యూహం మార్చేశాడు...

సుట్టగిట్టా జాంతానై...

ఉత్తరం గిత్తరం లేనేలేదు....

నల్లటి మనిషి కదా సీకట్లో సీకటయ్యాడు.

వెలుగు శోధించలేని అంధకారమయ్యాడు

చీకటిని దేదీప్యమానంగా వెలిగించే దివిటీ అయ్యాడు.

* * *

ఉత్తరం వైపు ఉత్తినే కూర్చున్నాడు. ఎరువు తెచ్చుకున్న నల్ల సొక్కా ఏసుకున్నాడు. సేతిలో కర్రని పక్కనే అరటి తోపులో దాచేశాడు.

రాత్రి 12 గంటలయ్యింది. వాళ్లు అడుగులో అడుగేసుకుంటూ వచ్చారు.

నీడలు కదులుతున్నట్లుగా కదులుతున్నారు. వాళ్ల భుజం మీదున్న గొనె సంచులు విక్రమార్కుడి భుజం మీద భేతాళుడిలా కదలడం లేదు. కాలు తీసి మరో కాలు మెల్లగా వేస్తున్నారు. చుట్టూ పరికించి చూస్తున్నారు. అంతటా ఆవరించిన చీకటి.

ఎవరూ లేరనుకున్నారు... ఎవరూ రారనుకున్నారు...

ఒకళ్లకొకళ్లు కళ్లతోనే సైగలు చేసుకున్నారు.

అంతే ఐదుగురు కొబ్బరి చెట్లు ఎక్కేందుకు సన్నద్ధమయ్యారు. ఎక్కారు.

ఉత్తరం వైపు నుంచి ఈ తతంగమంతా గమనిస్తున్న మరిడయ్యకి విషయ అర్ధం అయ్యింది. ‘‘అమ్మా నా కొడకల్లారా. వైదుగురు వచ్చారా’’ అనుకున్నాడు.

వాళ్లు కొబ్బరి సెట్లు సివరి దాకా ఎక్కేదాకా వేచి చూశాడు.

పది నిమిషాలు అయ్యింది. ముందు ఓ చెట్టు నుంచి ఓ కొబ్బరి కాయ నేల మీద పడింది. కాయ పడిన శబ్దం సిన్నప్పుడే సెవుల్లో దాచేసుకున్న మరిడయ్యకి ఆళ్లు పని ప్రారంభించారని తెలిసిపోయింది. మళ్లీ మరో చెట్టు నుంచి... ఇంకో సెట్టు నుంచి.. మరింకో సెట్టు నుంచి... కాయలు పడుతున్నాయి.

అంతే... ఓ భీకర కేక...

‘‘ వురేయ్ ఆళ్లోచ్చార్రా’’ అన్నాడు మరిడయ్య. అక్కడక్కడే సీకట్లో దాక్కున్న మరిడయ్య కొడుకులు ఇద్దరూ, బావమరది, ఇద్దరు చెలికాళ్లు, మరి ఇద్దరు పాలిగాళ్లు అక్కడక్కడా దాక్కున్న వారంతా వచ్చేశారు.

‘‘దిగండి. కొడకల్లాలా... అయిపోయారివాళ’’ అంటూ అరిచాడు.

అంతే కొబ్బరి సెట్టు మీద ఉన్నోళ్ల ప్రాణాలు అక్కడే పోయాయి. దూకలేరు. దూకితే కాళ్లిరుగుతాయి. కిందకి వస్తే అంతే... ఇలా ఓ ఐదు నిమిషాలు.

మరిడయ్యే మళ్లీ ‘‘ వురేయ్. దూకేయకండి. సచ్చిపోతారు. కిందకి రండి. ఏం చేయను. నేనూ పాలేరునే. మర్యాదగా దిగితే ఏం కాదు. లేదనుకో నేనే పైకొత్తా’’ అని అరిచాడు.

కొంతసేపటికి వారంతా ఒక్కొక్కరే కొబ్బరి చెట్లు దిగారు. వారిని ఆ చెట్లకే కట్టేసి ప్లీడరు రాజబాబుని నిద్ర లేపాడు.

వాళ్లకి టీ ఇచ్చాడు. కట్టేసినా బీడీ కాల్చుకునే వెసులుబాటు కల్పించాడు. చెరువు గట్టు మీదున్న పుల్లయ్య వొటేల్ నుంచి మినప రొట్టెలు, బొంబాయి సెట్నీ తెప్పించాడు.

భోరున ఏడుస్తున్న వారిని ‘‘తినకపోతే తంతానొరే’’ అని గదమాయించాడు. అన్నట్లు ఒక్క దెబ్బ కూడా వేయలేదు.

వాడ్రేవు రాజబాబు... మరికొందరు అగ్రహారం పెద్దలూ వచ్చారు. ఏం చేద్దాం అన్నారు. ఏం చేయాలి అని కూడా అనుకున్నారు.

‘‘పోలీసులని పిలుద్దాం. మొన్నామధ్య మా బామ్మర్ది తోటలో కూడా కాయలు పోయాయి. ఈళ్లని వదలకూడదు’’ అని పెద్దాయన సలహా ఇచ్చారు.

‘‘బాబూ వదిలేయండి. పిల్లలున్నోళ్లం. వింకే దొడ్డిలోనూ దొంగతనం సేయలేదు. విక్కడ మూడుసార్లు కాయలెత్తుకుపోయాం. ఇంకెక్కడా ఏం సేయలేదు. ఎవుసాయం (వ్యవసాయం) పనుల్లేక పిల్లల్ని సాకేందుకు ఇలా సేసాం. వదిలేయండి. పెద్దోరు సమించండి’’ అని చెట్టుకి కట్టేసిన వారిలో అందరి కంటే పెద్దవాడు వేడుకున్నాడు.

అంతే కాదు...తనకి మూడు సెట్లు అవతల మరో సెట్టుకి కట్టేసిన ఓ 16 ఏళ్ల కుర్రాడ్ని చూపిస్తూ..

‘‘ అయ్యా.. ఆడు లేతోడు. విప్పుడే నోకం (లోకం) సూత్తున్నాడు. మీరు పోలీసోళ్లకి అప్పగిత్తే అన్నాయం అయిపోతాడు’’ అని కూడా అన్నాడు.

కామందు కలుగజేసుకున్నాడు..

‘‘వురేయ్... మరిడిగా నువ్వే ఏదోవోటి సేయి. నీ ఇష్టం’’ అన్నాడు.

అక్కడ ఐదు నిమిషాలు మౌనం...

అక్కడ ఐదు నిమిషాలు ఉత్కంఠ...

అక్కడ ఐదు నిమిషాలు తుపాను ముందు ప్రశాంతత

అక్కడ ఐదు నిమిషాలు శ్మశాన శూన్యం

చెట్టుకి కట్టేసిన వాళ్ల వైపే చూస్తున్నాడు మరిడయ్య

ఓ మాటు కొబ్బరి సెట్టు మీదకి చూశాడు... మళ్లీ నేల మీదకి చూశాడు...

పక్కనున్న కామందు వైపు చూశాడు. అగ్రహారం పెద్దలని పరికించాడు.

ఐదు నిమిషాల తర్వాత మౌనం బద్దలైంది...

‘‘ఇడిసేద్దామండి తొత్తు కొడుకుల్ని. పోలీసోళ్లకి వప్పగిస్తే ఈళ్ల పాణాలు తినేత్తారు. బక్క నా కొడుకులు. కూలోళ్లు. సెపుతున్నారు కదా... ఎవుసాయం పనుల్లేవని. ఈళ్లకి దొంగతనాలు కొత్త. తెలిసిపోతోంది’’ అన్నాడు.

సెట్లకి కట్టేసిన వాళ్ల వైపు చూస్తూ ‘‘ ఏరా... బుద్ధిగా ఉంటారా. నాలుగు తోటల్లో దింపు పని పురమాయిత్తా. సేసుకుంటారా... సెడ దెం...కుంటారా’’ అన్నాడు

‘‘మీరు సెప్పినట్లే ఇంటాం అయ్యా’’ అన్నారు చెట్టుకి కట్టేసిన వాళ్లలో ఇద్దరు.

కామందు వాడ్రేవు రాజబాబు చిరునవ్వు నవ్వారు. చుట్ట తిప్పుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు. అగ్రహారం పెద్దలు కూడా ఆయన వెనుకే వెళ్లిపోయారు.

చెట్టుకి కట్టేసిన వాళ్ల తాళ్లు తీసేశారు మరిడయ్య కొడుకులు, బావమరిది.

పంజరంలోంచి బయటపడ్డ పక్షుల్లా మరిడయ్యను వలవల చుట్టేశారు వాళ్లంతా.

‘‘ తొత్తుకొడుకుల్లారా... భూపయాగ్రహారంలోను, బుచ్చమ్మ అగ్రహారంలోను బామ్మర్ల దింపులు మాటాడతా. మీరంతా ఓ జట్టులా మారి దింపులు తీసుకోండి. పేరూరులోనూ, బోడసకుర్రులోనూ కూడా దింపులు సెప్తా. సుబ్బరంగా సేసుకోండి. ’’ అని హామీ ఇచ్చాడు.

ఆళ్లు కళ్లంట నీళ్లెట్టుకోలేదు కాని... కాళ్ల మీద పడ్డ పని చేశారు...

మళ్లీ మరిడయ్యే....

‘‘ఈడు కుర్రనాకొడుకు. ఈడ్ని సదివిద్దాం. పెద్దయ్యాక మనలా కాకూడదు. విందీ (హిందీ) మాస్టారు కనకరాజు గారు మంచోరు. దరమాత్ములు. అయ్యగారికి సెప్తా. స్కూల్ కి పంపండి’’ అన్నాడు. వాళ్లు సరే అంటూ కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారు. పదహారేళ్ల కుర్రాడు సంటిబాబు అక్కడే నిలబడిపోయాడు.

‘‘ఏరా.. నువ్వెల్లవా.. మీ అయ్యతో ఎల్లు’’ అన్నాడు.

‘‘ అంటే విందీ మాస్టారింటికి ఎల్దామనీ’’ అన్నాడు.

మరిడయ్య ఓ నవ్వు నవ్వేసి ‘‘ ఈడుంటాడు. మీరెల్లండి’’ అని వాళ్లని పంపేశాడు.

* * *

ఓ ఆదివారం అగ్రహారం ఆందోళనగా ఉంది.

అగ్రహారం ఆవేదనగా ఉంది.

అగ్రహారం ఆలోచనలో ఉంది.

అగ్రహారం ఆవేశంగా ఉంది.

కాలేజీలో గొడవలు. లెక్చరర్లలో సీనియర్, మృదు స్వభావి, ఎప్పుడూ పల్లెత్తు మాట ఎవరినీ అనని మనిషి. ఎస్ ఎస్ గారు... అదే శిష్టా సూర్యనారాయణ గారు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్ కావాలి. కాని కాలేజీ పాలక వర్గం తన అనుంగు లెక్చరర్ ని ప్రిన్సిపాల్ చేసే పనిలో ఉంది. ఆ విషయం ఎస్ ఎస్ గారి చెవిన పడింది. ఆయన ఎవరికీ చెప్పుకోలేదు. మనకి ప్రాప్తం లేదనుకున్నారు. ఏం చేస్తాం అని కూడా అనుకున్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని లోలోపలే చింతించారు. అన్నట్టు ఎస్ ఎస్ గారు అగ్రహారం మనిషి కాదు. ఆయన ఉండేది మొబర్లీపేట. కాని బ్రాహ్మలు. అంతే. సాటి బ్రాహ్మడిగా అన్యాయం జరగనివ్వ కూడదనుకుంది అగ్రహారం పెద్దరికం.

“ఏటి కొడతారా. నాలుగు తిందాం. మూడు ఏద్దాం. మరీ లోకువ అయిపోయింది బ్రాహ్మలంటే“ అని యువతరం ఆవేశంగా రంకె వేసింది.

అంతే వారం రోజులు కాలేజీ బంద్. నిరసనలు, నిరాహార దీక్షలు. అగ్రహారం అంతా కోలాహలం. అగ్రహారం తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కురుక్షేత్రం. అగ్రహారం తొడ కొట్టలేదు కాని కడుపు మీద కొట్టకుండా కాచుకోవాలనుకుంది.

అంతే వైరం పెరిగింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలుస్తోంది. ఏం జరగాలో కూడా నిర్ణయం అయిపోతోంది.

అదిగో అలాంటి వేళలో... ఓ సాయం సంధ్య వేళ... అగ్రహారంలో ఎక్కడికక్కడ అరుగుల మీద కూర్చుని చర్చిస్తున్న వేళ....

రెండు జీపులలో వచ్చారు. చేతిలో కర్రలు.... రాళ్లు... కొందరు కత్తులు కూడా వెంట తెచ్చుకున్నారు. భుజాల మీద సెగ్గెడ్డలు వేసినట్లుగా ఇంతింత లావు శరీరాలు. నవ్వుకి అర్ధం తెలియని ముఖాలు.

రావడమే పెద్ద పెద్ద అరుపులు...” ఎవర్రా.. సంపేత్తాం. సీల్చేస్తాం. ప్రిన్సిపాల్ కావాలా. రండి. బయటకు రండి“ అంటూ వీరంగం.

ఈ హఠాత్ సంఘటనకు అగ్రహారం మ్రాన్పడిపోయింది. అగ్రహారం భీతిల్లింది. అగ్రహారం కంగారు పడింది.

రోడ్డు మీద కనిపించిన వారిని కనిపించినట్లు కొడుతున్నారు. ఉరుకలు.. పరుగులు,... ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేదు. ఏం జరుగుతుందో... ఎవరి మీద దెబ్బలు పడతాయో అని కంగారు.

అగ్రహారం ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ ఆ రెండు జీపులు ఓ రౌండ్ వేశాయి. రెండో రౌండ్ మళ్లీ వచ్చారు.

అదిగో అప్పుడొచ్చాడు మరిడయ్య. చేతిలో కర్రతో. రాధా స్వామి సత్సంగ భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర చేతిలో కర్రని కుడి భుజం కింద పెట్టుకుని కుడి కాలుని ఎడమ కాలు పక్కన పాదం పైకి మడిచి నిలుచున్నాడు.

జీపు వచ్చి మరిడయ్య దగ్గర ఆగింది. పది మంది కుర్రాళ్లు దిగారు. “ఎవడ్రా నువ్వు” అన్నారు. “అందరూ పారిపోతే నువ్వేం సేత్తున్నావ్“ అన్నారు. నాలుగు తగిలించాలా అని కూడా అన్నారు.

మరిడయ్య ఏం మాట్లాడలేదు. విన్నాడు. వాళ్ల సేతుల్లో ఉన్న కర్రలు చూశాడు. జీపులోపలకి తొంగి చూశాడు. కత్తులు కనిపించాయి. 

“సంపేత్తారా...బామ్మర్లని సంపేత్తారా... సంపేయండి. మీరు పదిమందిని సంపేలోపు నేను నలుగుర్ని ఏసేత్తా. ఆ నలుగురిలో ఎవరిని ఏత్తానో తెలీదు. సంపేయండి “ అన్నాడు.

“అదేదో పెద్దోల్ల యవ్వారం. ఈ గొడవలేటి. బామ్మర్లు వెప్పుడైనా గొడవలకి వచ్చారా. సెప్పండి. ఎందుకివ్వన్నీ. నేను ఇక్కడ ఉంటా. నన్ను సంపేసి తర్వాత బామ్మర్లలో ఎవరినైనా సంపేయండి “ అన్నాడు.

అంతే ఆ జట్టు నాయకుడు మరిడయ్యని పైకి కిందకి చూశాడు.

తనకి నాలుగడుగుల ముందు పులి నుంచుందా అని కంగారు పడ్డాడు.

ఈడ్ని ఏదైనా సేత్తే మనొళ్లు ఇద్దరు ముగ్గురు లేచిపోతారు అని నిర్ణయించుకున్నాడు.

“సర్లే ఎల్తున్నాం. నువ్వు పెద్ద మనిషవని ఎల్లిపోతున్నాం. భయపడి కాదు” అన్నాడు.

మరిడయ్య నవ్వాడు. ఆ నవ్వులో నువు భయపడ్డావురా అని సందేశం ఉంది.

ఆ నవ్వులో నువ్వు ఓడిపోయావురా అని వెక్కిరింత ఉంది.

ఆ నవ్వులో అగ్రహారానికి నేనే పెద్ద ఆయుధంరా అనే ధీమా ఉంది.

*** *** ***

కాలం ప్రవాహంలా పయనించింది. అలా చూస్తూండగానే పుష్కరకాలం పరుగులు పెట్టింది.

మరిడయ్యను వృద్ధాప్యం వెంటాడింది. మరిడయ్యను అనారోగ్యం వేధించింది. మరిడయ్యను దీర్షరోగం కమ్ముకుంది.

హైస్కూల్ రోడ్డులో ఉన్న యునైటెడ్ నర్శింగ్ హోంలో చేర్పించారు. వైద్యలు చికిత్స చేస్తున్నారు. అగ్రహారంలో అందరూ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో మరిడయ్య ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.

అగ్రహారం పెద్ద మనుషులొచ్చారు. డాక్టర్ రామచంద్రరావుగారిని కలిసారు. పరిస్థితి తెలుసుకున్నారు.

“ ఆపరేషన్ చేయాలి. 50 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇందులో 20 వేల వరకూ ఆసుపత్రి వారే భరించాలనుకుంటున్నాం. మేం ఉండేది కూడా అగ్రహారంలోనే కదా.. మందులు, మిగిలిన ఖర్చులు ఓ 30 వేలు ఉంటే సరిపోతుంది “ అన్నారు డాక్టర్ రామచంద్రరావు గారు.

“ అలాగే... కానివ్వండి. ఆ 30 వేలు మేం సద్దుతాం. ముందు మీరు ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి “ అని పెద్దలు హామీ ఇచ్చారు. ఆసుపత్రి బయట ఉన్న గోపాల్ బిస్కట్ కంపెనీ దగ్గరు వచ్చి చర్చించుకున్నారు.

“ మరిడయ్య మనోడు. మనం తలా ఓ చేయి వేస్తే సరిపోతుంది. ఆ పని ఇవాళ, రేపట్లో అయిపోవాలి“ అనుకున్నారు.

అగ్రహారంలో అందరూ ఎవరికి తోచింది వాళ్లు ఇచ్చారు. కావాల్సిన దాని కంటే ఓ 18 వేలు ఎక్కువే వచ్చింది.

అవి తీసుకుని యునైటెడ్ నర్శింగ్ హోంకు వెళ్లారు అగ్రహారం పెద్దలు. ఆసుపత్రిలో రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా ఉన్న బెంచీ మీద 29 ఏళ్ల కుర్రాడు, ఓ అమ్మాయి, ఏడేళ్ల చిన్న పిల్లాడు కూర్చున్నారు.

రిసెప్షన్ కౌంటర్ పక్కనే ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గరు వెళ్లారు అగ్రహారం పెద్దలు. తాము తెచ్చిన డబ్బుని బ్యాగ్ లోంచి తీసి “ పేషెంట్ పేరు మరిడయ్య. డబ్బులు కట్టడానికి వచ్చాం“ అని కౌంటర్ లో ఉన్న అమ్మాయికి చెప్పారు.

కౌంటర్ లో ఉన్న అమ్మాయి “ ఇప్పుడే అరగంట క్రితం ఎవరో డబ్బులు కట్టేసారండి. డాక్టర్ గారు ఆపరేషన్ కు ఏర్పాట్లూ చేసేశారు“ అని చెప్పింది.

అగ్రహారం పెద్దలకి అర్ధం కాలేదు. “ ఎవరు కట్టారమ్మా ఆ డబ్బు. ఎక్కడున్నారు వాళ్లు “ అని అడిగారు.

“ అదిగో ఆ బెంచీ మీద కూర్చున్నారు చూడండి. భార్యభర్తలు. వాళ్లే కట్టేసారు “ అని సమాధానం చెప్పింది కౌంటర్ లో అమ్మాయి.

అగ్రహారం పెద్దలు ఆశ్చర్యపోతూ ఆ బెంచీ దగ్గరకొచ్చి “ ఎవరు బాబు నువ్వు. మరిడయ్య ఆపరేషన్ కి డబ్బులు కట్టావంటా“ అని అడిగారు.

పెద్దలని చూసిన ఆ కుర్రాడు, పక్కనున్న అమ్మాయి, చిన్న పిల్లాడు బెంచీ మీంచి లేచారు. 

 “నమస్కారమండి. నా పేరు సంటిబాబండి. ఆయ్. ఈ ఊరేనండి. నేనే కట్టానండి “

“ నువ్వేందుకు కట్టావు. మరిడయ్య నీకు ఎలా తెలుసు “ అని అడిగారు

“ మరిడయ్య గారు నాకు దేవుడండీ. పన్నెండేళ్ల కితం దొంగతనానికొచ్చిన నన్ను పట్టుకుని చదువు చెప్పించారండి. ఆయన దయ వల్ల నేను విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నానండి “ అని చెప్పాడు.

అంతే కాదు... “ మరిడయ్య బాబుకి బాగోలేదని మా మావయ్య కబురెట్టాడండి. ఈవాళ పొద్దున్నే వచ్చానండి. వచ్చి రావడమే ఆసుపత్రికి వచ్చాశానండి. మంచం మీదున్న మరిడయ్య బాబుని చూశావండి. డాక్టర్ గారిని అడిగితే ఇలా డబ్బులు అవీ చెప్పారండి. ఇప్పుడే పది నిమిషాలైందండి. డబ్బులు కట్టేశానండి “ అన్నాడు.

మళ్లీ సంటిబాబే “మీరు కడతానన్నారని డాక్టర్ గారు చెప్పారండి. కాని మా దేవుడికి మేమే ఇవ్వాలని కట్టేశానండి “ అన్నాడు.

అగ్రహారం పెద్దలకి ఆనాడు వాడ్రేవు రాజబాబు తోటలో దొంగతనానికి వచ్చిన వాళ్లు, వాళ్లలో సంటిబాబు అన్నీ కళ్ల ముందు కదలాడాయి.

“ బాగుంది బాబు. వృద్ధిలోకి రావడమే కాకుండా... అలా పైకి తీసుకొచ్చిన వారిని గుర్తు పెట్టుకున్నావు. ఆసుపత్రి నుంచి వచ్చాక మరిడయ్యకి ఈ డబ్బులు ఇచ్చేస్తాం. వాడిష్టం. మందులకో, మాకులకో వాడుకుంటాడు“ అన్నారు పెద్దల్లో ఒకరు.

మళ్లీ వారిలో ఒకరు “ వీళ్లు నీ కుటుంబమా “ అని అడిగారు.

“ నా భార్య సత్యవతి. వీడు నా కొడుకు “ అన్నాడు సంటిబాబు

 పిల్లోడు ముద్దుగా ఉన్నాడు అంటూ ఆ పిల్లాడి కేసి చూస్తూ ఒకరు.. “నీ పేరేంట్రా “ అని అడిగారు

ఆ పిల్లాడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ... “ మరిడయ్య “ అన్నాడు

*** *** ***

కామెంట్‌లు లేవు: