5, సెప్టెంబర్ 2020, శనివారం

*భాగవతామృతం*


శానకాదుల ప్రశ్నలు

1-40-క.కంద పద్యము

ఆ తాపసు లిట్లనిరి, వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హరి గుణ సం
ఘాతున్, సూతున్, నితాంత కరుణోపేతున్.
ఆ = ఆ; తాపసులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి; వినీతున్ = విశిష్టమైన నీతిగల వానిని; విజ్ఞాన = విజ్ఞాన మయ; ఫణిత = విధానంలో; నిఖిల = అన్ని; పురాణ = పురాణాల; వ్రాతున్ = సమూహము గలవానిని; నుత = స్త్రోత్రము చేయబడిన; హరి = విష్ణుని; గుణ = గుణముల; సంఘాతున్ = సమూహాలున్న వానిని; సూతున్ = సూతుని; నితాంత = ఎల్లప్పుడు; కరుణ = దయతో; ఉపేతున్ = కూడినవాని.
ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు
1-41-మ.మత్తేభ విక్రీడితము

"సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులున్ ధర్మ శా
స్త్రములుం నీవ యుపన్యసింపుదువు వేదవ్యాసముఖ్యుల్మునుల్
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం దత్ప్రసా
దమునం జేసి యెఱుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!
సమతన్ = సమబుద్ధితో; తొల్లి = ఇంతకు ముందు; పురాణ = పురాణముల; పంక్తులు = సమూహాలు; ఇతిహాస = ఇతిహాసాల; శ్రేణులున్ = సమూహాలను; ధర్మశాస్త్రములున్ = ధర్మశాస్త్రములను; నీవ = నీవు; ఉపన్యసింపుదువు = వివరించి చెప్పుదువు; వేదవ్యాస = వేదవ్యాసుడు; ముఖ్యుల్ = మొదలైన ముఖ్యమైనవారు; మునుల్ = మునులు; సుమతుల్ = మంచి మనసు గలవారు; సూచినవి = చూచినవి; ఎన్ని = ఎన్నున్నాయో; అన్నియును = అన్నీ; తోఁచున్ = స్పురించును; నీ = నీయొక్క; మదిన్ = మనసుకు; తత్ = వారియొక్క; ప్రసాదమునన్ = అనుగ్రహము; చేసి = వలన; ఎఱుంగనేర్తువు = గ్రహించగలవు; సమస్తంబున్ = సమస్తమును; బుధ = జ్ఞాన; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడా.
“సుధీమణులలో ప్రథమగణ్యుడ వైన సూతమునీంద్రా ! నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్ర్తాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల నీ బుద్ధికి అందని దంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు.
1-42-క.కంద పద్యము

గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
గురువులు = గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్టమైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.
గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
1-43-క.కంద పద్యము

మన్నాఁడవు చిరకాలము
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.
మన్నాఁడవు = బ్రతికితివి; చిర = చాలా; కాలము = కాలము; కన్నాఁడవు = దర్శించితివి; పెక్కులైన = అనేకమైన; గ్రంథ = గ్రంథముల; అర్థంబుల్ = సారములను; విన్నాఁడవు = విన్నావు; వినఁదగినవి = వినదగినవి; ఉన్నాఁడవు = ఉన్నావు; పెద్దలొద్దన్ = పెద్దల దగ్గర; ఉత్తమ = మంచి; గోష్ఠిన్ = చర్చలలో.
చక్కటి గోష్ఠులలో, మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు.
1-44-చ.చంపకమాల

అలసులు, మందబుద్ధియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ధి = బుద్ధి; యుతులు = కలిగినవారు; అల్పతర = చాలా తక్కువ {అల్ప - అల్పతర - అల్పతమ}; ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = భయంకరమైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడిన ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = భాగ్యము కలవారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్ = ఏవియును; చేయఁజాలరు = చేయలేరు; ఈ = ఈ; కలియుగము = కలియుగము; అందున్ = లో; మానవులు = మనుషులు; కావునన్ = అందువలన; ఎయ్యది = ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది; ఐ = అయి; అలవడున్ = సిద్ధించునో; ఏమిటన్ = దేనివలన; పొడమున్ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; చెప్పవే = చెప్పుము.
మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.
1-45-సీ.సీస పద్యము

ఎవ్వని యవతార మెల్ల భూతములకు;
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ;
సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ;
భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల;
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;
1-45.1-తే.
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత!
ఎవ్వని = ఎవని; అవతారము = జన్మ, అవతరించుట వలన; ఎల్ల = అన్ని; భూతముల = జీవుల; కున్ = కు; సుఖమును = సుఖమును; వృద్ధియు = అభ్యుదయము; సొరిదిన్ = క్రమముగ; చేయున్ = కలుగునో; ఎవ్వని = ఎవని; శుభ = శుభకరమైన; నామము = పేరు; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడును; నుడువంగ = ఉచ్చరింపగా; సంసార = సంసారము యొక్క; బంధంబు = బంధములు; సమసి = నాశనము; పోవున్ = అగునో; ఎవ్వని = ఎవని; చరితంబున్ = కథలను; హృదయంబున్ = హృదయంలో; చేర్పంగ = పెట్టుకొంటే; భయము = భయము; ఒంది = పొంది; మృత్యువు = మృత్యువు; పరువున్ = పరుగును; పెట్టున్ = పెట్టునో; ఎవ్వని = ఎవని; పద = పాదముల వద్ద పుట్టిన; నదిన్ = నది లోని (గంగానది); ఏపాఱు = అతిశయించిన; జలములన్ = నీటిని; సేవింపన్ = సేవించగా; నైర్మల్య = నిర్మలత్వము; సిద్ధి = సమకూరుట; కలుగున్ = కలుగుతుందో; తపసులు = తాపసులు; ఎవ్వాని = ఎవని;
పాదంబున్ = పాదమును; తగిలి = భక్తితో తగులుకొని; శాంతి = ప్రశాంతతకు; తెరువున్ = మార్గమును; కాంచిరి = దర్శించిరో; వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవిలు; కున్ = కు; ఎవ్వఁడు = ఎవడు; ఉదయించెన్ = జన్మించాడో; తత్ = ఆ; కథలు = కథలు; ఎల్ల = అన్నీ; వినఁగన్ = వినవలెనని; ఇచ్చ = కోరిక; పుట్టెడున్ = పుట్టినది; ఎఱిఁగింపుము = తెలియ చెప్పుము; ఇద్ధ = ప్రశస్తమైన; చరిత = నడవడిక కలవాడా.
ఏ మహానుభావుడు అవతారించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా! సూతా! అవన్నీ మాకు వినిపించు.
1-46-క.కంద పద్యము

భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.
భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఎండగొట్టునవి, పోగొట్టునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.
శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను ఎండగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.

1-47-క.కంద పద్యము

కలిదోషనివారకమై
యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని
ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు
వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా!
కలి = కలికాలములోని; దోష = దోషములను; నివారకము = నివారించునది; ఐ = అయి; అలఘు = తక్కువగాని (ఏవిధంగాను) / గొప్ప; యశుల్ = కీర్తి గలవారు; పొగడునట్టి = స్తోత్రము చేయునట్టి; హరి = హరియొక్క; కథనమున్ = కథలు; నిర్మల = నిర్మలమైన; గతిన్ = మార్గమును; కోరెడు = కోరుకొనే; పురుషుఁడు = మనిషి; వెలయఁగన్ = ప్రసన్నమైతే; ఎవ్వాఁడున్ = ఎవడు మాత్రం; తగిలి = కుతూహలముతో; వినఁడు = వినడు; మహా = గొప్ప; ఆత్మా = ఆత్మకలవాడా / సూతా.
మహాత్మా! సూత! కలికాల దోషాలను పారద్రోలుతు, ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంస లందుకొన్న గోవిందుని కథలను, పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు.
1-48-ఆ.ఆటవెలది

అనఘ! విను రసజ్ఞులై వినువారికి
మాటమాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ
దలఁపు గలదు మాకుఁ దనివి లేదు.
అనఘ = పాపము లేనివాడా; విను = వినుము; రసజ్ఞులు = రస జ్ఞానము కలవారు; ఐ = అయి; విను = వినే; వారి = వారి; కి = కి; మాటమాటకు =ప్రతిమాటలోను; అధిక = మిక్కిలి; మధురము = తీయనిది; ఐన = అయినది; అట్టి = అగు; కృష్ణు = కృష్ణుని గూర్చిన; కథనము = విషయములు; ఆకర్ణనము = వినుట; సేయన్ = చేయాలని; తలఁపు = కోరిక; కలదు = కలదు; మాకున్ = మాకు; తనివి = తృప్తి (ఎంతవిన్నా); లేదు = తీరదు.
పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు.
1-49-మ.మత్తేభ విక్రీడితము

వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి
స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే?
వర = శ్రేష్ఠుడైన; గోవింద = కృష్ణుని {గోవింద - గోవులకు ఒడయుడు}; కథా = కథలు అను; సుధారస = అమృతపు; మహావర్ష = గొప్ప వర్షము యొక్క; ఉరుధారా = పెద్ద ధారాపాతపు; పరంపరలన్ = తెరలు వలన; కాక = కాకుండా; బుధేంద్ర = జ్ఞానశ్రేష్ఠులలో; చంద్ర = చంద్రుని వంటివాడా; ఇతర = ఇతరమైన; ఉపాయ = ఉపాయాల మీది; అనురక్తిన్ = అనురాగం వలన; ప్రవిస్తర = మిక్కిలి విస్తరించిన; దుర్దాంత = అణచుటకురాని; దురంత = అంతము చేయుటకు రాని; దుస్సహ = సహింపరాని; జనుస్ = జన్మముల యందు; సంభావిత = సంభవించుచున్న; అనేక = అనేకమైన; దుస్తర = తరింపరాని; గంభీర = లోతైన; కఠోర = కఠినమైన; కల్మష = పాపములు అను; కనత్ = మండుచున్న; దావానలంబు = కారుచిచ్చు; ఆఱునే = చల్లారుతుందా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావా!
1-51-వ.వచనము
మఱియుఁ గపటమానవుండును గూఢుండు నైన మాధవుండు రామ సహితుం డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నఁట; వాని వివరింపుము; కలియుగంబు రాఁగల దని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున.
మఱియు = ఇంకనూ; కపట = మాయవలన; మానవుండును = మానవ రూపం ధరించినవాడు; గూఢుండును = మాయవలన తెలియరానివాడు; ఐన = అయిన; మాధవుండు = లక్ష్మీదేవి భర్త; రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; అతి = అతీతమైనవి; మానుషంబులు = మానవులు చేయుటకు; ఐన = అయినట్టి; పరాక్రమంబులు = సాహసములు; సేసెన్ = చేసెను; అట = అట; వాని = వాటిని; వివరింపుము = వివరముగా చెప్పుము; కలియుగంబు = కలియుగము; రాఁగలదని = రాబోవుచున్నదని; వైష్ణవ = విష్ణువునకు సంబంధించిన; క్షేత్రంబున = సిద్ధస్థలమున / నైమిశారణ్యమున; దీర్ఘ = పెద్దదైన; సత్ర = సత్రయను పేరుగల యాగము; నిమిత్తంబున = కారణముగా; హరి = విష్ణుని; కథలు = కథలు; వినన్ = వినుట; ఎడ = పట్ల; కలిగి = కలిగినందు వలన; నిలిచితిమి = ఉంటిమి; దైవ = దైవము; యోగంబున = కలిసివచ్చుటచేత.
అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో గూడి మానవాతీతాలైన మహా వీరకృత్యాలు ఎన్నో చేశాడని వింటాము. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిశారణ్యంలోదీర్ఘసత్ర" మనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది.
1-52-క.కంద పద్యము

జలరాశి దాఁటఁ గోరెడి
కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
గలి దోష హరణ వాంఛా
కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!
జలరాశిన్ = సముద్రము; దాఁటన్ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్ = జనము; కర్ణధారున్ = చుక్కాని పట్టి నడిపే వానిని {కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్థుడు}; కాంచిన = చూచిన; భంగిన్ = విదంగా; కలి = కలికాలపు; దోష = పాపాలు; హరణ = నాశనము చేసే; వాంఛా = కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = అయినటువంటి; మేము = మేము; నిన్నున్ = నిన్ను {నిన్ను – కలిదోష నివారక సమర్థుడైన వాని}; కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా.
ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
1-53-క.కంద పద్యము

చారుతర ధర్మరాశికి
భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్
భారకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!
చారుతర = అతి మనోహరమైన {చారు - చారుతర - చారుతమ}; ధర్మ = ధర్మముల; రాశి = సమూహము; కిన్ = నకు; భారకుఁడు = భరించు వాడు; అగు = అయినటువంటి; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆత్మ = తన; పదమునకు = లోకమునకు; ఏఁగన్ = వెళ్ళగా; భారకుఁడు = భర్త; లేక = లేకపోవుటచే; ఎవ్వనిన్ = ఎవనిని; చేరును = చేరును; ధర్మంబు = ధర్మము; బలుపు = పుష్టిని; సెడి = కోల్పోయి; ముని = ముని అయిన; నాథా = ప్రభువా.
ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.”

కామెంట్‌లు లేవు: