18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

జీవన్ముక్తుడు

 *మనిషి జీవన్ముక్తుడు కావాలన్నది మన రుషుల ఆకాంక్ష. ఎందుకంటే, మృత్యువు ‘చితి’ వంటిది. అది ఒక్కసారే దహిస్తుంది. మృత్యుభయం ‘చింత’ వంటిది. అది నిత్యం దహిస్తూనే ఉంటుంది. చివరకు మరణం తప్పదనే పరమ సత్యాన్ని జీర్ణించుకుంటూనే- దానికి సంబంధించిన చింతను, భయాన్ని మనిషి జయించాలి. అలా మృత్యుభయాన్ని జయించినవాణ్ని ‘మృత్యుంజయుడు’గా చెబుతారు. మృత్యువును జయించడమంటే, మృత్యుభయాన్ని జయించడమే. దాన్ని ‘ముక్తస్థితి’గా భావిస్తారు.* 

 *ముక్తస్థితి- భారతీయతకు జీవనాడి. అది గొప్ప సంస్కార విశేషం. ఏ విషయంలో అయినా ‘ఇక చాలు’ అనాలంటే, ఆ రకం సంస్కారం అవసరం. ప్రసిద్ధులైన కొందరు క్రీడాకారులు, నటీనటులు, రాజకీయ నాయకులు ఎవరైనాగాని- తమ తమ రంగాల నుంచి ‘అప్పుడేనా’ అని ప్రజలు ఆశ్చర్యపడే స్థితిలో తప్పుకోవడం చూస్తుంటాం. ‘ఇంకానా’ అని చీదరించుకునేదాకా పట్టుకుని వేలాడకూడదన్న జ్ఞానాన్ని వారికి ఆ సంస్కారమే ప్రసాదించిందని గ్రహించాలి. ఇక్కడితో ‘నా కర్తవ్యం ముగిసింది’ అని గ్రహించడమే జీవన్ముక్తుడి లక్షణం. హుందాగా తప్పుకోవడం అతడి సంస్కారం. నిత్యజీవితంలో ఆ సంస్కార విశేషాన్ని సాధన చేసినవారు క్రమంగా అంతర్ముఖులవుతారు. జీవిత నాటకరంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడూ దాన్ని తేలిగ్గా పాటించగలుగుతారు. మరణమంటే హడలిపోయే స్థితి నుంచి దాన్ని ఆహ్వానించగల స్థితికి ఎదగడమంటే అదే!*


🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: