6, నవంబర్ 2020, శుక్రవారం

*శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము

 


*శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*


*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*


*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*


*మొదటి అధ్యాయము - రెండవ భాగము*


*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*


*ఈ లోకమునందు గాజు తునక ఎక్కడ? అమూల్యమైన మణి ఎక్కడ? అలాగే అమృతము ఎక్కడ? శ్రీకృష్ణావతార విశేషభరిత శ్రీమద్భాగవతకథామృతము యెక్కడ? వీటి మధ్యన పొంతన ఏమిటి?* అని తలపోసిన శుకమహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు కథాశ్రవణమునకు అధికారులు కాని భక్తిశూన్యులు అని గ్రహించి,వారికి (దేవతలకు) శ్రీమద్భాగవత కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు దుర్లభమాయెను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతము సప్తాహ ప్రవచన రూపములో శ్రీశుకుని ముఖమనుండి వినుటచే పరీక్షిన్మహారాజునకు ముక్తి లభించినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న శ్రీమద్భాగవత సప్తాహమనెడి పుణ్యకర్మ నాటినుండియే ప్రారంభమైనది. ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవునకు కూడ ఆశ్చర్యము కలిగినది. ఆయన తన సత్యలోకమునందు ఒక ధర్మ కాటాను (త్రాసు) తెప్పించి దానియందు ఒక వైపు సమస్త సాధనములను మరియొక వైపు శ్రీమద్భాగవతమును ఉంచి పరిశీలించగా సమస్త సాధనములు ప్రక్క తేలికయై పైకిలేచెను. శ్రీమద్భాగవతకథామృతము ఉన్న దిశలో అత్యంత భారము కన్పట్టెను. అది గాంచిన ఋషులందరికిని మిక్కిలి అబ్బుర మాయెను. ఆ విధముగా కలియుగమునందు శ్రీమద్భాగవతము ఒక మోక్షశాస్త్రముగా, భక్తిశాస్త్రముగా, తత్త్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని స్వరూపముగా అవగతమయ్యెను. ఇట్టి శాస్త్రమును చదువుట వలన అప్పటికప్పుడే మోక్షార్హత, పుణ్యలోక  ప్రాప్త్యర్హత లభించగలదని విశ్వసించిరి. సప్తాహ విధానముగా ఏడురోజులు వినుట వలన పుత్రసంతానము లేనివారు, ఉండికూడ సత్కర్మలాచరించని  పుత్రులగుటచేతను, పుత్రులుండి కూడ అనాథలుగా  జీవనము సాగించువారికి బ్రతికినంత కాలము పవిత్రులుగాను, అంత్యకాలమందు భగవత్సానిధ్యము లభింపగలదనుట నిజమనియు పలికిరి. పూర్వము సనకాది ఋషులు దేవర్షియగు నారదునికి ఈ భాగవత శాస్త్ర ప్రవచనమను వినిపించిరి. అంతకు పూర్వమే నారదుడు బ్రహ్మముఖమునుండి కూడ వినియుండెను.  ఐనను దీనికి సప్తాహ శ్రవణ విధానమున్నదని దానిని గూర్చి సనకాది మహామునులు నారదునకు వివరించి చెప్పిరి.


శౌనక మహర్షి ఇలా అడిగెను: *ప్రాపంచిక వ్యవహారములనుండి విమక్తుడైన నారదమహర్షికి సనకాది మునీంద్రులు ఎచట కలిసిరి? భాగవత కథాశ్రవణమును గురించిన విధివిధానమును వినవలెననెడి శ్రద్ధ అతనికి ఎట్లు కలిగెను?*


అంత సూతముని ఇట్లు చెప్పెను: *ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించెదను. శ్రీశుక దేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసికొని, శ్రీమద్భాగవత కథను నాకు ఏకాంతమునందు వినిపించెను*


*శ్రీమద్భాగవత మహాత్మ్యము* తరువాయి భాగము రేపు మధ్యాహ్మము....


*🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏*


*వీలయినంత మందికి పంపండి*


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: