6, నవంబర్ 2020, శుక్రవారం

అమర చైతన్యం"*

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



*ప్రశ్న: 'దయ' గురువిచ్చే బహుమానమా...*


*జవాబు: భగవంతుడు, దయ, గురువు ఇవన్నీ సమానర్ధకములు. అసలు అది లోపలే వున్నది, మరియు సర్వవ్యాపకమైనది. ఆత్మ లోపల లేదా. గురువేమైనా తన చూపుతో దానిని (ఆత్మను) అనుగ్రహిస్తాడా.. అలా అనుకునే వ్యక్తి గురువు కాడు. దీక్షలు చాలా రకములు. హస్త దీక్ష, స్పర్శ దీక్ష, చక్షు దీక్ష.  గురువేదో మంత్రాలతో, నీళ్ళతో, అగ్నితో ఏదో తతంగం నిర్వహిస్తే దానిని దీక్ష అంటారు. ఆ దీక్షలతో శిష్యుడు పరిణితి చెందుతాడని భావిస్తారు. వ్యక్తిత్వమంటూ (అహం) ఏమీ లేని వ్యక్తియే గురువు. దక్షిణామూర్తి అలాంటి వాడే.. ఆయన ఏమి చేసాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. శిష్యులు ఆయన ముందు ఉండినారు. ఆయన మౌనాన్నే కొనసాగించినాడు. శిష్యులు సందేహాలు (సందేహించేవాడు - అహం) పోయినవి. నిజమైన గురువు ఆయనే. ఆయన చేసినదే దీక్ష (మౌన దీక్ష). అదియే జ్ఞానము. మాటలు సముదాయము కాదు. మౌనమే ఎక్కువ శక్తివంతమైనది. శాస్త్రాలు ఎంత విస్తారంగా ఉన్నా, ఎంత స్పష్టంగా చెప్పినా, అవి ఈ పని చేయలేవు. అంత సమర్థులూ గాదు. గురువు మౌనంగానే ఉంటాడు. ఆయన మౌనంలోనే ఎంతో శక్తి ప్రశాంతత వుంటుంది. అది శాస్త్రాలన్నింటికన్నా శక్తివంతమైనది. జ్ఞానులతో సహవాసమే జ్ఞానప్రాప్తికి దోహదం చేస్తుంది. ఎంతో దీర్ఘకాలం చేస్తేనే కాని, ఎంతో శ్రవణం చేస్తేనే గాని, ఎంతో కష్టపడితే గాని జ్ణానమును నేను పొందలేదు అనునటువంటి మాటలవల్ల ఇటువంటి సందేహాలు (ప్రశ్నను గమనించండి) వస్తాయి. లోపల జరిగేపని బయటకు కనిపించేది కాదు. నిజానికి గురువు లోపలనే ఉన్నాడు.* 


*తాయుమానవర్ ఇలా అన్నారు :*

*"ఓ భగవంతుడా.. నీవు అనేక జన్మలు నాతోనే వుండి, నన్ను వదలకుండా చివరకు నన్ను రక్షించావు. అదే సాక్షాత్కారము".*


*భాగవతంలో కూడా ఇలాగే వున్నది. మనమిద్దరమూ (భగవంతుడు, జీవుడు) ఇపుడే కాదు ఎపుడూ కలిసే వున్నాము. గురువు యొక్క అనుగ్రహము శాస్త్రాధ్యయనము, ధ్యానము కన్నా ఎక్కువ శక్తివంతమైనది. ఇదే ప్రధానమైనది. మిగిలినవన్నీ తరువాతవే.. తక్కువవే..*

కామెంట్‌లు లేవు: