6, నవంబర్ 2020, శుక్రవారం

ధర్మరాజు జూదమెందుకు

 ధర్మరాజు జూదమెందుకు ఆడాడు?


సమాధానం వ్యాస భారతం సభాపర్వం 46 వ అధ్యాయం

( వ్యాసుని భవిష్య వాణి - యుధిష్ఠిరుని ప్రతిజ్ఞ )

 ధర్మరాజు రాజసూయయాగం పూర్తి అయిన తరువాత వ్యాసుడు తన శిష్యులతో కలిసి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు.

ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాదులు సమర్పించి, పితామహా ! రాజసూయయాగం జరుగుతున్న సమయంలో శిశుపాల వధ జరిగింది. దాని వలన  ఏమైనా ఉత్పాతాలు జరుగుతాయా అని అడిగాడు.

వ్యాసుడు ధర్మనందనా ఈ మహోత్పాతాల ఫలితం పదమూడు సంవత్సరాలు ఉంటుంది. సర్వ క్షత్రియ నాశనం జరుగుతుంది. ( త్రయోదశ సమా రాజన్ ఉత్పాతానాం ఫలం మహత్.  సర్వ క్షత్రియ వినాశాయ భవిష్యతి విశాంపతే )

సమయం రాగానే నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం వలన, భీమార్జునుల పరాక్రమం వలన భూమి మీద రాజులందరూ యుద్ధం లో నాశనమౌతారు. కాలో హి దురతిక్రమః కాలం దాటరానిది. అని చెప్పి కైలాసానికి వెళ్ళాడు.


తాతగారు వెళ్ళాక ధర్మరాజు పౌరుషం తో దైవాన్ని అడ్డుకోవడం ఎలా శక్యము. మహర్షి చెప్పింది తప్పకుండా జరుగుతుంది. అనుకొని తమ్ములతో పురుష సింహాల్లారా ! వ్యాస మహర్షి చెప్పింది విన్నారుకదా!  సర్వ క్షత్రియ వినాశానికి విధి నన్నే కారణం చేయదలచుకొంటే  నేను జీవించటం వలన ప్రయోజనమేంటి? ధర్మరాజు మాటలు విని అర్జునుడు రాజా పాప భూయిష్టమైన మోహాన్న పొందకు. ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు అన్నాడు.

అర్జునుని మాటలు విని ధర్మరాజు ,

మీ అందరికి క్షేమం కలుగుగాక! నాయనలారా బ్రతికి ఉన్నా పదమూడేళ్ళ నా వలన ప్రయోజనమేముంటుంది. కనుక నేటి నుండి నేను చేసే ప్రతిఙ్ఞ వినండి

( న ప్రవక్ష్యామి పరుషం భ్రాతృనన్యాంశ్చ పార్ధివాన్

స్థితో నిదేశే ఙ్ఞాతీనాం యోక్ష్యే తత్

సముదాహరన్ )

సోదరులను గాని, ఇతర రాజులను గాని పరుషంగా మాట్లాడను. ఙ్ఞాతుల ( దుర్యోధనునాదుల ) ఆఙ్ఞను పాటిస్తూ, వారు అడిగినవన్ని ఇవ్వటంలో నిమగ్నమౌతాను.

వైర భావాన్ని దూరంగా ఉంచుతూ, అందరికీ ప్రియాన్ని  ఆచరిస్తూ ఉంటే నాకు లోకంలో నింద కలుగదు.

తమ అన్నగారి ప్రతిఙ్ఞ విని పాండవులందరూ అతనికి మేలు చేయటంలో తత్పరులై అన్నను అనుసరించసాగారు.

ఈ ప్రతిన కారణంగా ధర్మరాజు జూదానికి వెళ్ళాడు. అక్కడ అవమానాలు జరిగినా పంటి బిగువున భరించి వనవాసానికి బయలు దేరాడు.

( నేను సంక్షిప్తంగా చెప్పాను. ఔత్సాహికులు వ్యాస భారతం ( గీతా ప్రెస్. గోరక్‌పూర్ ) వారి సభా పర్వం 46 వ అధ్యాయం సంప్రతించగలరు. .... ఈ అధ్యాయాన్ని నన్నయభట్టు అనువదించలేదు. )

భవదీయుడు

శారదా ప్రసన్న -- కడప.

కామెంట్‌లు లేవు: