17, సెప్టెంబర్ 2023, ఆదివారం

హనుమంతుని సముద్ర లంఘనం

 హనుమంతుని  సముద్ర లంఘనం 

                       -------------------------------------------------- 


   ఉ: "  చువ్వన  మేనువంచి , రవి సోకుఁగఁ  దోకవిదిల్చి , పాదముల్


            వివ్వగఁబట్టి , బాహువులు  వీచి ,  మొగంబు బిగించి ,కొండ  జౌ


           జవ్వన  నూగి , ముందరికిఁ జాగి , పిరిందికిఁదూఁగి,   వార్ధిపైఁ


          రివ్వన  దాటె , వాయుజుఁడు  రెక్కలతోడి    సురాద్రియోయనన్!


                 రామాయణము- కిష్కింధ కాండ-కుమ్మరి మొల్ల; 


           మనం చాలా రామాయణాలు చూశాం చదివాం. కానీ  మొల్ల రామాయణ మంత సరళసుందరమైన  రామాయణ 

కావ్యాన్ని  మనంచూడబోము.అలతి యలతి తత్సమ పదాలతో  అతిసుందరంగా  ఆనీలమేఘశ్యాముని  రాముని సుందర

మందహాస వదనం మనముందుకు కదలి వస్తున్నాదా యనిపస్తుంది ఆమెకవిత్వం! 


        కం:  చెప్ప వలె కప్పురంబులుఁ

               గుప్పలుఁగాఁ బోసినట్లు  కుంకుమ  పై పై

                గుప్పిన గతి"- అనియామె కవిత్వ నిర్వచనం! అందుకు తగనట్లే భాసించింది. ఇక  ప్రస్తుతానికి వస్తా,


             ఈపద్యం హనుమ సముద్ర లంఘనానికి చేసేప్రయత్నం. దృశ్యాన్ని కన్నులకు గట్టించటం మొల్ల ప్రత్యేకత!

ఎంత  ప్రయత్నం లేకపోతే శత యోజన విస్తీర్ణమైన దుస్తరమైన  సాగరాన్ని  హనుమ ఒక్క గెంతులో దాటాడు? ఆ

మహా ప్రయత్నమిదో  చిత్తగించండి!


              చువ్వన  మేను వంచాడట! ఎగరాలి యంటే శరీరాన్ని అందుకు తగిన రీతిగా మలుచుకోవాలి.తొలిప్రయత్నంగా 

తన శరీరాన్ని యెగర టానికి కావలసినరీతిగా  వంచుకున్నాడు. తరువాత ఒక్కసారి తోక విదిలించాడు. అది సూర్యునకు తగి

లేంతగా  పైకి  లేపాడట. పాదాలను రెండిటిని దూరంగా ఉంచాడట. యెగిరేటప్పుడు పట్టుకోసం. చేతులు నిటారుగా చాపాడట

తన శరీరాన్నొక వ్యోమ నౌకగా మార్చి చేతులను చుక్కానుల వలెనుపయోగించుటకు చేసే ప్రయత్నమిది. మొగంబు బిగించాడట. అంటే పెదవుల బిగబట్టి బింకంగా చూస్తున్నాడని భావం. ఒక్కసారి కొండ బలమెంతో  తెలిసికొనుటకు కొండ జవజవలాడేలా  ఊపుతున్నాడట. ముందుకి పరుగెడుతున్నాడట.ప్రక్కలకు వంగుతున్నాడట.


                                 ఇంత బృహత్తర మైన ప్రయత్నం చేశాకే అన్నీ సరిగ్గా అమిరాయీ  అనుకున్నాకే  సమ్ముద్రంమీద  రివ్వుమని యెగిరి  రెక్కలు మొలచిన మేరు పర్వతమా యని చూచువారు అచ్చెరువొందు నట్లు సాగి పోతున్నాడట!


                       మొల్ల  యీదృశ్యాన్ని  యెంత సహజంగా  చిత్రించింది! మాటలతో  వర్ణించగలిగే  విషయమా  ఇది. మహనీయుడైన  హనుమంతునికే  దుస్తరమైన సాగరాన్ని దాటాలంటే  ఇంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

చూచారుగదా! ఇదిమనకుపదేశం; యేదైనా పనిచేసేముందు దానికి ప్రయత్నం  అవసరం. ప్రయత్న సిధ్ధుడైన వానికి

కార్యవిఘ్నంఉండదు.కార్య సిధ్ధితప్పదు అని.


                         బాగున్నది గదా! 


                                                              స్వస్తి!🙏🌷🌷🌷🌷💐💐🌷🌷💐💐💐🙏🙏🙏🙏🌷💐💐💐💐

కామెంట్‌లు లేవు: