17, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఆదిగణపతి

 తొలిదైవమైన ఆదిగణపతి గురించి చెప్పుకుంటే.. ఆయన ఎంతటి హేతుబద్ధమైన దైవమో తెలుస్తుంది. బొజ్జగణపయ్య.. బొజ్జ  దేనికి గుర్తు. ఆ తొండం, తల ఏ భావానికి ప్రతీకలు? ఆయన చేతిలోని ఆయుధాలకు అర్ధమేమిటీ.. పరమార్ధమేమిటీ? ఆయన దేహమే ఓ సామాజికి దేవాలయం అంటారు దాని అంతరార్ధమేమిటి? ఆయన ఇష్టపడే ప్రతిదీ ప్రాకృతమైనదే? వినాయకుడి ప్రస్తావన తీసుకురావడం అంటేనే ఈ అండపిండ బ్రంహ్మాండానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఒక్కసారిగా మాట్లాడుకున్నట్టే అంటారు. అదెంత వరకూ వాస్తవం?వినాయక చవితిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. అంటే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ మంచి ఊపు అందుకునే సమయం కూడా ఇదే. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనం చేసే ప్రతీ పనీ. జరిపే ప్రతి పండగ అన్నీ... వ్యవసాయానికి అనుసంధానించి వుంటాయి. వినాయక చవితి కూడా అంతే. సాధారణంగా నాట్లు వేయటంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయమిది. అందుకే ఆయనకు తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు కర్షక జీవులు. ఆయన శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థం. భౌతిక శాస్త్రపరిభాషలో చెప్పాలంటే మెటీరియల్‌. అసలు పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది.మట్టి నుంచే పంట పండుతుంది. అంటే ఆయన స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి సింబల్‌. ఆయనకు ఉండే ఏక దంతం.. రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను అణచివేయటానికి గుర్తు. బొజ్జగణపయ్య పొట్టను పాములతో బిగించి కట్టుకోవటం కూడా అందుకే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడని చెబుతారు. వినాయకుడిని పూజించటం అంటే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే.. అవుతుందని ఎంతో భక్తితో భావిస్తారు. ఇదీ సంగతి. ఇన్నేసి విషయాలు వినాయక రూపంలో ఇమిడి వున్నాయని అంటారు వినాయక భక్తులు.

కామెంట్‌లు లేవు: