12, అక్టోబర్ 2023, గురువారం

బృహస్పతిరువాచ

 ఓమ్

బృహస్పతిరువాచ

సౌవర్ణం రాజతం తామ్రం పితౄణాం పాత్రముచ్యతే | రజతం రజతాక్తం వా పితౄణాం పాత్రముచ్యతే || రజతస్య తథా చాపి దర్శనం దానమేవ చ | అనంతమక్షయం స్వర్గ్యం పితౄణాం దానముచ్యతే || పితౄనేతేన దానేన సత్పుత్రాస్తారయన్త్యుత | 

- బృహస్పతి పలికెను. సువర్ణము రజతము తామ్రము ఈ పాత్రలు పితృదేవతలకు మిక్కిలి ప్రియమైనవి. ఈ పాత్రములను శ్రాద్ధములో ఉపయోగించి దానము జేసినయెడల మహాఫలము ప్రాప్తించును. అనంతమూ అక్షయమూ అయిన స్వర్గాది మహాఫలము ప్రాప్తించును. సత్పుత్రులు ఇటువంటి ఉత్తమమైన దానమునుజేసి తమ పితృలకు ఉత్తమపదవిని దొరకింపజేతురు. నరకాద్యనర్థములు రాగొడక వాని తప్పింతురు. 


రాజతే హి స్వధా దుగ్ధా పాత్రేऽస్మిన్పితృభిః పురా || స్వధాదాయార్థిభిస్తాత తస్మిన్ దత్తే తదక్షయమ్ | 

- వత్స ! పూర్వమునందు సత్పుత్రులు రజతపాత్రమునందు పిండ తర్పణాది దానములొసగి తమ పితృలకు అక్షయమైన మహాఫలమును దొరకింపజేసినారు. స్వధాపేక్షులైన పితృదేవతలు ఇటువంటి మహాఫలమును పొందినారు.


కృష్ణాజినస్య సాన్నిధ్యం దర్శనం దానమేవ వా | రక్షోఘ్నం బ్రహ్మవర్చస్యం పితౄంస్తత్తద్వితారయేత్ || 

- శ్రాద్ధకాలమునందు కృష్ణాజినమునుపయోగించి, తద్దర్శనము, దానములతో భూతాదిపరిహారములూ, బ్రహ్మవర్చస్సూ కలుగును. పితృవులకు నరకాది విపత్తులు రాకుండగజేసి (శ్రాద్ధమునూ) రక్షించును. అతః కృష్ణాజినము అతిప్రియమైనదియని గ్రహించవలెను.


కాఞ్చనం రాజతం తామ్రం దౌహిత్రం కుతపస్తిలాః | వస్త్రం చ పావనీయాని త్రిదండో యోగమేవ చ || శ్రాద్ధకర్మణ్యయం శ్రేష్ఠో విధిర్బాహ్యః సనాతనః |  ఆయుః కీర్తిః ప్రజాశ్చైవ ప్రజ్ఞాసంతతివర్ద్ధనః ||

- సువర్ణ, రజత తామ్రపాత్రలు, దౌహిత్రుడు, కుతపకాలము, తిలలు, త్రిదండము (యోగదండము) ఇవి శ్రాద్ధమునందు పవిత్రములు ఉత్తముములైనవి. మరియు శాస్త్రవిహితములూ, బ్రహ్మజ్ఞానదాయకములూ, సనాతనములూ, ఆయుః కీర్తి సంతాన దివ్యజ్ఞాన ప్రజాదాయక-వర్ధనములైయున్నవి. (వాయుపురాణమ్).

కామెంట్‌లు లేవు: