7, మార్చి 2025, శుక్రవారం

భయము ను చంపిన వెంటనె

 *2036*

*కం*

భయము ను చంపిన వెంటనె

జయములు నీ వెంటబడును సతతము పుడమిన్.

భయమును మించిన శత్రువు

జయము ను మించెడి హితులును సాధ్యమ సుజనా?.

*భావం*:-- ఓ సుజనా! భయాన్ని చంపిన వెంటనే జయములు ఈ భూలోకంలో నీ వెంటబడతాయి. భయము కన్నా పెద్ద శత్రువు గానీ జయము కన్నా గొప్ప మిత్రము గానీ సాధ్యమవుతుందా!!??.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*2037*

*కం*

ఎవ్వారల పని కష్టము

లవ్వారలకే తెలియును నవనిన నెపుడున్.

ఎవ్వరి పనినైనను నట

రవ్వాడగనెంచబోకు రయమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎవరి పని లో కష్టం ఎల్లప్పుడూ వారి కే తెలుస్తుంది. ఎవరి పనినీ నీవు తొందరపడి (రయమున)నిందించడానికి(రవ్వాడు) ప్రయత్నించవద్దు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*2038*

*కం*

దానము జేసిన వారల

హీనముగా జూచుటెల్ల హేయంబెపుడున్.

దానము మించిన సుకృతము

లీ నరలోకంబునందు లేవుర(లేవిల) సుజనా.

*భావం*:-- ఓ సుజనా! దానం చేసి న వారి ని హీనంగా చూడటం ఎన్నడూ నీచ బుధ్ధి యే. దానము ను మించిన పుణ్యాలు ఈ నరలోకంలో ఉండవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


కామెంట్‌లు లేవు: