7, మార్చి 2025, శుక్రవారం

నీలమోహనం



నీలమోహనం! 

      

      బులుసు వారి నీలమోహనం

   చమత్కారభాసురం!  


(మరోమారు నెమరేసు కుందాం)


 భావుకుడైన ఒకమహాకవివ్రాసిన పద్యకృతి నీలమోహనం.ఆపేరుచదవగానే నీలమేఘశ్యాముడై భువనమోహనుడై

వెలుగొందే ఆనల్లనయ్యే మనకన్నులముందు సాక్షత్కరిస్తాడు.అవును. ఈకృతిలో అణువణువునా ఉన్నదాకృష్ణయ్యే!


యమునాతీరం,ఆసుందరబృందావనం,

ఆఆలమందలు,ఆసుందర,గో,గోపికాబృందాలు,ఆమధురమైనపిల్లనగ్రోవిగానం,

ఆగానానికి తన్మయమై (అచేతనప్రాయమై) చిత్తరువును దలపింపజేసే ప్రకృతి పరిసరాలు, నేపధ్యంగా

రచియింప బడిన యీపద్యాలు,అనవద్యహృద్యాలు,రసహృదయవేద్యాలు,భావుకతా నైవేద్యాలు,

ప్రతిపద్యం ఒకఅనర్ఘరత్నం.

ఆపదాలపోహళింపు,ఆభావాలమోహరింపు,ఆసమాసఘటన,ఆప్రకృతిచిత్రణలు,ఆరసపోషణావిధానము,

ఒకటేమిటి? సర్వం ,ఒకఅద్భుతం!

                  ఇలాంటి సర్వసంపన్నమైన

నీలమోహనం నేడు మనముందుకు రావడం మనసుకృతం.రసలోలుపులైన పండితప్రియంభావుకు లందరకు నేడు

 పసందైన సాహిత్యపు విందు.

ఇకసమాహితహృదయంతో కృతినిపర్యాలోకనమొనరింతుముగాక!

ముందుగా నేనొకపద్యమును చవిచూపి

ముగింతును .


"అళినీలాలకమై,కృపామధురహాసాంకూరమై,ఆవియ

త్తల సంపూరిత కేకిపింఛ ఘనరుక్ తారళ్యమై,నవ్యమై,

లలితోదార లలాటికా మృగమదాహ్లాద ప్రియంబైన,ని

ర్మల వంశీమదనాభిరామ,ముఖబింబం బాత్మనిండారెడిన్;

         

                 కవి తనయాత్మలో నిండిన నీలమోహనమూర్తిని యీపద్యంలో ఆవిష్కరిస్తున్నాడు.ఇందులోభౌతికమైనరూపం,ఆంతరమైనరూపం రెండురూపాలు ఆవిష్కరింపబడుతున్నాయి.

భౌతికంగా:తుమ్మెదలనుబోలిని ముంగురులు,దయామృతమొలికించే మందహాసాంకురములు,శిరసునఇంద్రచాపంలామెఱసే కేకిపింఛ నవతారుణ్యఛ్ఛాయలు,నవ నవోయమైననుదుటికస్తూరీతిలకపుపరీమళాలు,

పెదవులపై నడయాడుతూ,అల్లన మ్రోగే

పిల్లగ్రోవి రాగాల సరాగాలతో కూడిన ఆచల్లనయ్యనీలమోహనరూపం నాయాత్మలో నిండిపోయినదిఅనిబాహ్యార్ధం,

ఇది బాహ్యరూపం!


ఇకఆంతరం!

            నల్లనియాతనువు విశ్వాకారమై,గగనసదృశమైయొప్పారటం,అందుచేతనే చెంగట ఇంద్రచాపం(కేకిపింఛం)మందహాసాలమెరపులయొరపులు.వంశీరవసాదృశ్యంతో వేదనాదాలు,ఇత్యాదిగాఆయనవిశ్వాయతత్తత్వాన్ని స్ఫూర్తిమంతంచేయటం జరిగింది.


              ఇలా మనలోచనాలకు,సులోచనాలకూగూడా అందనియర్ధాలెన్నో,కన్నయ్య అందాలెన్నో,మన ఆలోచనాలోచనాలకు

అగుపిస్తాయి.అదే కవిరచనలోని భావుకత!

అందుకే బులుసు వేంకటేశ్వరులుగారు "మహాకవు"లయ్యారు.కనుకనేమహాకవిత్వతత్వాన్నిలాఆవిష్కరింపగలిగారు.

ఇలాప్రతీపద్యాన్ని ఆస్వాదింపగలిగితే

రసోవైసః మనముందే!!   

                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: