7, మార్చి 2025, శుక్రవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(69వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *యయాతి చరిత్ర*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*దేవయాని కోరిక మేరకు ఆమెను యయాతికి ఇచ్చి వివాహం చేశాడు శుక్రాచార్యుడు. అత్తారింటికి శర్మిష్ఠ, చెలికత్తెలతో సహా చేరుకుంది దేవయాని. అయితే శర్మిష్ఠ అందాన్ని చూస్తే ఆమెను యయాతి కావాలనుకుంటాడని గ్రహించి, శర్మిష్ఠను భర్త కన్నెత్తి చూడరాదనీ, పన్నెత్తి పలకరించరాదనీ ఒట్టు పెట్టింది దేవయాని. కట్టుబడ్డాడు యయాతి.*


*అంతఃపురంలో శర్మిష్ఠకు ప్రత్యేక మందిరాన్ని నిర్మించి, అందులో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. రోజు రోజుకీ దేవయానికీ, శర్మిష్ఠకీ స్పర్థలు ఏర్పడి, పంతాలు పెరిగిపోయాయి. రాకుమార్తె అయిన తాను, గురుపుత్రిక దేవయానికి దాసిగా ఉండడాన్ని శర్మిష్ఠ భరించలేకపోయింది. తన యౌవనం, చక్కదనం వ్యర్థమవుతున్నందుకు కుమిలిపోసాగింది. ఒకనాడు ఋతుస్నాతయై చక్కగా అలంకరించుకుని, ఏకాంతంగా ఉంది శర్మిష్ఠ. అప్పుడామెకు యయాతి కనిపించాడు. అతన్ని అడ్డుకున్నదామె. తన మనోవాంఛ తెలియజేసింది. పత్నిగా చేపట్టి, సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నదామె. వనిత తనంత తానుగా వలచి వచ్చినప్పుడు కాదనకూడదు. అది ధర్మం కూడా కాదు. ఆ కారణంగా శర్మిష్ఠ కోరికను తీర్చాడు యయాతి. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. శర్మిష్ఠ గర్భవతి అని తెలిసి భగ్గున మండిపడింది దేవయాని. ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన యయాతిని అసహ్యించుకుంది. అతనిపై కోపగించుకుంది. అలిగి పుట్టింటికి చేరుకుంది. జరిగిందంతా తండ్రి శుక్రాచార్యునికి చెప్పుకుని బాధపడింది.*


*దేవయానిని సమీపించాడు యయాతి. ఇంటికి రమ్మని ఎన్నో విధాల పార్థించాడు.*


*అనేక విధాల నచ్చజెప్పజూశాడు. లాభం లేకపోయింది. తన కుమార్తెకు తీరని అన్యాయం చేశావంటూ యయాతిపై అంత ఎత్తున లేచాడు శుక్రాచార్యుడు.‘‘కాముకుడివై, శర్మిష్ఠను కూడి నా కుమార్తెకు తీరని బాధ కలిగించావు. ఇందుకు ఫలితంగా నీకు దుర్భరమయిన ముసలితనం ప్రాప్తించుగాక.’’ అని శపించాడు. శుక్రాచార్యుని శాపానికి తిరుగులేదు. అనుభవించక తప్పదు అనుకుంటూ శాపవిమోచనను ప్రసాదించమన్నాడు యయాతి.‘*


*‘నీ వార్ధక్యాన్ని ఎవరికయినా ఇచ్చి, వారి యౌవనాన్ని స్వీకరించవచ్చు. ఇదొక్కటే నీకు మార్గం.’’ అన్నాడు శుక్రాచార్యుడు. ముదిమితో వజావజా వణికిపోసాగాడు యయాతి. అప్పటికే అతను తండ్రి. దేవయాని వలన అతనికి యదు, తుర్వసు అని ఇద్దరు కుమారులు జన్మించారు. శర్మిష్ఠ వలన ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అను ముగ్గురు కుమారులు జన్మించారు. ముసలితనం ప్రాప్తించినా యయాతికి స్త్రీ వ్యామోహం పోలేదు. యౌవనాన్ని కోరుకున్నాడతను. కొడుకులను పిలిచాడు. వార్ధక్యాన్ని స్వీకరించి, వారిలో ఎవరయినా తనకి యౌవనాన్ని ప్రసాదించడంటూ కోరాడు. పెద్దవాళ్ళు ఎవరూ తండ్రి కోరికను మన్నించలేదు. అందరిలోకి చిన్నవాడు, ఆఖరివాడు శర్మిష్ఠ కొడుకు పూరుడు, తండ్రి కోరికను అంగీకరించాడు. తండ్రిని సంతోషపరచడమే విధిగా భావించాడు. తన యౌవనాన్ని యయాతికి ఇచ్చి, అతని వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: