17-23-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - బ్రహ్మముయొక్క నామమును గుఱించి ఐదు శ్లోకములద్వారా తెలియజేయుచున్నారు–
ఓం తత్సదితి నిర్దేశో
బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణా స్తేన వేదాశ్చ
యజ్ఞాశ్చ విహితాః పురా ||
తాత్పర్యము:- పరబ్రహ్మమునకు “ఓమ్" అనియు, "తత్” అనియు, 'సత్' అనియు మూడు విధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలననే (దాని యుచ్చారణ చేతనే) పూర్వము బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానులు), వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి.
వ్యాఖ్య:- పరబ్రహ్మము వాస్తవముగ నామరూపరహితమైనను, భక్తులు ధ్యానించుటకు, చింతించుటకు అద్దానికి నామములు నిర్దేశింపబడెను. అవియే ‘ఓమ్' అనియు, ‘తత్' అనియు, 'సత్' అనియు చెప్పబడును. అట్టి మంత్రముల చింతనద్వారా, లక్ష్యమగు పరబ్రహ్మమును జనులు చింతనజేయుచున్నారు. సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు గనుక ఆ మూడునామములు మహత్తరమగుశక్తి, పవిత్రతగలిగి యున్నవి. వేదశాస్త్రాదులం దెల్లెడలను ఈ ప్రణవాది మంత్రములను గూర్చి విశేషముగ చెప్పబడియున్నది.
“తస్య వాచకః ప్రణవః” - ఆ పరమాత్మయొక్క నామము ఓంకారము.
"తజ్జపస్తదర్థభావనమ్" - " ఆ నామమును జపించుచు దానియర్థమును లెస్సగ భావించవలెను" - అని పతంజలి మహర్షియు ఓంకారమహిమనుగూర్చి శ్లాఘించియున్నారు. కర్మానుష్ఠానమందు ఏవైన లోపములు, విఘ్నములు, దోషములు మున్నగునవి యున్నచో అవియన్నియు పరమపవిత్రములగు ఆ మూడునామముల యొక్క ఉచ్చారణచే పటాపంచలైపోవును. కనుకనే ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు. మంత్రములన్నిటిలోను ప్రణవము శిరోమణియై యలరుచున్నది. కనుకనే ప్రతిమంత్రమునకును ఆదిలో ఓంకారము చేర్చబడుచుండును. అయితే " ఓం తత్ సత్” అను మంత్రము నుచ్చరించునపుడు అద్దాని అర్థమును భావించుచు దాని వాచ్యరూపమగు పరబ్రహ్మమును చింతన జేయవలెను. భావముతో గూడినపుడుమాత్రమే మంత్రము ఎక్కువగ శక్తివంతమగును.
మఱియు వేదములు, యజ్ఞములు మున్నగునవి ఆ ప్రణవమంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవని చెప్పుటవలన వేదములయొక్క మూలము, బీజము ఓంకారమే (పరబ్రహ్మమే) అయియున్నదని తేలుచున్నది. మఱియు వేదసారమంతయు ఆ ప్రణవమునందే యున్నటుల గోచరమగుచున్నది. కావున వేదసారమగు ఓంకారము నుచ్చరించి భావమును మననముచేసినపుడు సమస్త వేదములను ఉచ్చరించినట్లే యగుచున్నది.
“ఓమ్ తత్సత్” అనుదానికి మఱియొక అర్థమున్ను గలదు. ఓమ్ అనగా పరబ్రహ్మము, తత్ అనగా అది (ఆ పరబ్రహ్మము) ఒకటియే, సత్ = సద్వస్తువు, తక్కినదియగు దృశ్యజగత్తంతయు మిథ్యావస్తువు అని యర్థము. కావున ఈ “ఓమ్ తత్ సత్” అను మంత్రముయొక్క ఉచ్చారణచేత " బ్రహ్మసత్యం జగన్మిథ్యా" అను సర్వవేదాంతసిద్ధాంతసారసంగ్రహము ప్రస్ఫుటమగుచున్నది. అట్టి నామోచ్చారణ చేయుచు సద్వస్తువగు బ్రహ్మమును సత్యముగ భావించుచు, మిథ్యాభూతమగు దృశ్యజగత్తును అసత్యముగ తలంచుచు వైరాగ్యభావమును అభివృద్ధిపఱచుకొనవలెను. సద్రూపదైవభావనను, ఆత్మభావనను దృఢపఱచుకొనవలెను .
“ఓమ్ తత్సత్” అను మంత్రమునకు ఈ క్రింది రెండు అర్థములున్ను చెప్పవచ్చును.
(1) ఓమ్ = పరబ్రహ్మము (కలదు)
తత్ = ఆ పరబ్రహ్మము
సత్ = సద్రూపమైనది
~~~~
(2) తత్ = ఆ
సత్ = సద్వస్తువు
ఓమ్ = పరబ్రహ్మము
~~
ప్రశ్న:- పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? అవియేవి?
ఉత్తరము:- మూడుపేర్లు కలవు. అవి క్రమముగ (1) ఓమ్ (2) తత్ (3) సత్ అని చెప్పబడును.
ప్రశ్న:- వానియొక్క మహత్తు యెట్టిది?
ఉత్తరము: - వానినుండియే (లేక, వాని నామోచ్చారణచేతనే) పూర్వము (1) బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానులు) (2) వేదములు (3) యజ్ఞములు సృష్టింపబడినవి.
ప్రశ్న:- కావున బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు - వీనికి మూలమేమి?
ఉత్తరము:- ఓంకారమే. (తల్లక్ష్యమగు) పరబ్రహ్మమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి