27, మే 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం 252-*

 *తిరుమల సర్వస్వం 252-*

*ద్వాదశ ఆళ్వారులు-16*

🙏 *స్వప్న సాక్షాత్కారం* 🌈

💫 విష్ణువు కర్పించబోయే పూలమాలలను ముందుగా తాను ధరిస్తున్న విషయాన్ని గోదాదేవి అత్యంత గోప్యంగా ఉంచడం వల్ల, చాలాకాలం విష్ణుచిత్తునికా విషయం తెలియరాలేదు. కొంత కాలానికి శ్రీకృష్ణుని కర్పించిన పూలమాలలో నున్న రోమం (వెంట్రుక) కారణంగా ఆ విషయాన్ని తెలుసుకున్న విష్ణుచిత్తుడు ఉగ్రుడయ్యాడు. అల్లారుముద్దుగా సాకుతున్న గారాల పట్టిని తీవ్రంగా మందలించాడు. గోదాదేవి మాత్రం శ్రీమహావిష్ణువే తన భర్త యని, ఆ చనువుతో తాను మాలలను ముందుగానే ధరిస్తున్నానని నిష్కర్షగా సమాధానమిచ్చింది. విష్ణుచిత్తుని కేంచేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్ళుగా, వటపత్రశాయికి తాను ఉచ్ఛిష్టమాలలను ('ఉచ్ఛిష్టము' అనగా 'ఎంగిలి' లేదా 'వేరొకరు వాడినది' అని అర్థం) అర్పించాడన్న మాట. తనవల్ల ఎంతటి ఘోరాపరాధం జరిగిపోయింది? తనకు తెలియకుండా పొరబాటు జరిగినప్పటికీ, శాస్త్రానుసారం అవివాహిత యైన స్త్రీ చేసే తప్పొప్పులకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. దీని వల్ల ఎంతటి దుష్పరిణామం ఎదురుకానున్నదో? విష్ణుచిత్తుడు ఇవే ఆలోచనలతో చింతామగ్నుడై ఉండి, ఆరోజు దేవునికి పూలమాలలు సమర్పించనే లేదు. ఆ దినమంతా అన్నపానాలు లేకుండా కలతనిద్ర లోకి జారుకున్న విష్ణుచిత్తునికి స్వప్నంలో సాక్షాత్కరించిన వటపత్రశాయి తాను అనునిత్యం ఎంతో ప్రేమగా స్వీకరించే పూమాలల నెందుకు అర్పించలేదని చనువుగా ప్రశ్నించాడు. విష్ణుచిత్తుడు జరిగిన ఉదంతమంతా దేవదేవునికి వివరించి, తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. దానికా వటపత్రశాయి తన పరమ భక్తురాలైన గోదాదేవి ధరించుకొన్న మాలలే తనకత్యంత ప్రీతిపాత్రమని, మున్ముందు కూడా ఆమె అలంకరించుకున్న మాలలనే తన కర్పించాలని శెలవిచ్చాడు. శ్రీహరి సమాధానంతో విష్ణుచిత్తుని మనసు కుదుట పడింది. విష్ణుచిత్తునికి తన పుత్రిక సాధారణ యువతి కాదని, దైవాంశ తోనే ఉద్భవించిందని, ముందు ముందు గొప్ప భాగవతారిణిగా వెలుగొందబోతోందని తోచి పుత్రికాగర్వంతో ఉప్పొంగిపోయాడు. అప్పటినుండి ఆమెను మరింత వాత్సల్యభావంతో చూస్తూ, ఆమె ధరించిన మాలలనే వటపత్రశాయి కలంకరించ సాగాడు. శ్రీవిల్లిపుత్తూరులో అదే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో, ఆండాళ్ అమ్మవారు ధరించిన పూలమాలలను శ్రీవిల్లిపుత్తూరు నుండి వేడుకగా తెచ్చి శ్రీవేంకటేశ్వరునికి సమర్పిస్తారని ఇంతకు ముందే తెలుసుకున్నాం.


🙏 *శ్రీరంగనాథునిలో ఐక్యం* 🌈


💫 గోదాదేవి దైవాంశ సంభూతురాలైనప్పటికి తండ్రిగా తన బాధ్యత ననుసరించి, యుక్తవయస్కురాలైన ఆమెను తగిన వరునికిచ్చి వివాహం చేయాలి కదా! అని విష్ణుచిత్తుడు తలపోయసాగాడు. ఆమేమో భగవంతుడే తన భర్తయని భీష్మించుకుంది. చిత్రమైన సంకటంలో పడ్డ విష్ణుచిత్తుడు వివాహ విషయమై కూతుర్ని సంప్రదించగా అదే విషయం ఆమె ధృవీకరించి, విష్ణువును తప్ప వేరెవ్వరినీ వివాహమాడనని మరో సారి స్పష్టం చేసింది.


అంతే గాకుండా, నూట ఎనిమిదిగా గల దివ్యవైష్ణవక్షేత్రాలలో నున్న శ్రీమహావిష్ణువు అవతారాలన్నింటి మహిమలను విశద పరచవలసిందిగా తండ్రిని కోరింది. చివరికి శ్రీరంగక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడే తనకు కాబోయే భర్తయని, వారితోనే తన వివాహం జరిపించమని తండ్రిని వేడుకొంది. ఇప్పుడు విష్ణుచిత్తుని ముందున్న సమస్య మరింత జటిలమైంది. మానవమాత్రురాలిగా, భౌతికరూపంలో నున్న తన కుమార్తెకు అర్చామూర్తిగా నున్న శ్రీరంగనాథునితో వివాహమెలా సాధ్యం? అయినప్పటికీ శ్రీకృష్ణుణ్ణి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురి నిర్ణయం పట్ల నమ్మకంతో, భగవంతునిపై భారం వేసి, వివాహ ఏర్పాట్ల విషయంలో అప్పటి పాండ్యరాజు సహాయ మర్థించాడు. ఇదంతా భగవత్ప్రేరణ తోనే జరుగుతోందని విశ్వసించిన విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుణ్ణి వరునిగా, శ్రీరంగాలయాన్నే వివాహవేదికగా నిర్ణయించి, బంధుమిత్రు లందరిని వివాహాని కాహ్వానించాడు. పుత్రికను సర్వాంగ సుందరంగా అలంకరింప జేసి శ్రీరంగనాథాలయం లోని వివాహవేదిక వద్దకు తోడ్కొని వచ్చాడు. అయినప్పటికీ మదిలోని సంశయం పట్టిపీడిస్తూనే ఉంది. ఈ వివాహమెలా సంపన్నమవు తుందన్న ఉత్కంఠ పాండ్యరాజుతో సహా ఆహ్వానితు లందరి మదిలో మెదులుతోంది. ఏం జరుగ బోతోందోనని అతిథులందరూ ఆసక్తితో తిలకిస్తూ ఉండగా ఏదో అదృశ్యశక్తి తనను ప్రేరేపించినట్లు, గోదాదేవి శ్రీరంగనాథుని పాదపద్మాలపై సాగిలపడింది. మరుక్షణం గోదాదేవి ఆత్మ పరమాత్మలో లీనమవ్వడంతో, ఆమె తన భౌతికకాయాన్ని త్యజించింది. వివాహ సంరంభాన్ని తిలకించటానికి విచ్చేసిన వారందరూ నిశ్చేష్ఠులయ్యారు. ఆ విధంగా తనను తానుగా భగవంతుని కర్పించుకున్న గోదాదేవి


అనతికాలంలో 'ఆండాళ్' గా, 'ద్వాదశాళ్వారు' లలో ఒకరిగా వినుతి కెక్కింది. 'ఆండాళ్' అనే తమిళపదానికి 'రక్షించే తల్లి' అని అర్థం. కొంతకాలం క్రితం వరకూ తమిళనాడులోని శ్రీవైష్ణవులు తమ బాలికలను 'ఆండాళ్' అని పిలిచే సాంప్రదాయముండేది. ఎత్తైన కొప్పుముడితో, నిండైన చీరెకట్టుతో, ముంజేతిపై రామచిలుకతో విలక్షణంగా గోచరించే గోదాదేవిని 'ఆండాళ్ అమ్మవారి' గా దాదాపు ప్రతి వైష్ణవాలయంలో ఈనాటికీ మనం చూస్తుంటాం.


గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైన తరువాత, వారి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు తిరిగి శ్రీవిల్లిపుత్తూరు చేరుకుని, సుదీర్ఘకాలం వటపత్రశాయిని సేవించుకున్న అనంతరం పరమపదం చెందారు.


 *సాహిత్యసాధన* 


 గోదాదేవి *తిరుప్పావై* తో పాటుగా, *'నాచ్చియార్ తిరుమొళి'* అనే 140 పాశురాల సంకలనాన్ని కూడా రచించింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఎనిమిదవ రోజు సాయంత్రం జరిగే 'అశ్వవాహనోత్సవం' లో నాచ్చియార్ తిరుమొళి పారాయణం జరుగుతుంది.


[ రేపటి భాగంలో... *తిరుమంగై ఆళ్వార్* గురించి మరియు తదుపరి భాగాలలో ... *ద్వాదశ అళ్వారులలో మిగిలిన 3 మంది* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: