27, మే 2025, మంగళవారం

నైరుతి పలకరించే...!!*

 *నైరుతి పలకరించే...!!*


ఎండిన భూమాతను చల్లపరిచేందుకు 

మండించిన సూర్యున్ని మేఘం చుట్టుముట్టి 

అలసిన ఎన్నో హృదయాలకు 

దాహాన్ని తీర్చేందుకు నైరుతి పలకరించే...


వేడికి కందిన నేలకు ఔషధంలా 

ఉక్కపోతకు ఉడికిన మనిషికి చల్లదనంలా

చినుకు చినుకు మాట్లాడుతున్నట్లుగా

పసి హృదయంలా మబ్బులు పలకరించే...


ఎండిన మట్టిని పరమాన్నంగా మార్చుటకు

ఏరువాక వచ్చి వసంతం తెచ్చే 

జీవుల మనుగడ పునర్జీవం పోయుటకు

ఆహారాన్ని వండేందుకు నింగి పలకరించే...


ఆవిరైన నీరు ఆకాశపు కుండను నింపి 

మండే నేలను మురిపించేందుకు వ్యాపించే 

వేడిగాలుల పెత్తనాన్ని హరించి వేసేందుకు 

చల్లని కబురులు తో నైరుతి పలకరించే...


మంండిన భానుని జలఖడ్గం నివారించే 

నేలలో దాగిన విత్తును ఆశీర్వదించే 

ప్రకృతినంతా సస్యశ్యామలం చేసేందుకు 

వర్షపు చినుకులు సవ్వడితో పలకరించే..


సేదతీరుతున్న రైతన్నను మేల్కొల్పి 

నేలమ్మ పెదవులను నాగలితో మాట్లాడించి

ముద్దుల బంగారపు ఫలాల అందించేందుకు 

కర్తవ్యాన్ని బోధించేందుకు పలకరించే..


ఎండిన మట్టికి వసంతపు స్నానం 

మండిన మనిషికి చల్లని కబురు 

నింగి అంతా వ్యాపించిన నైరుతి సందేశం 

చినుకుల రూపంలో పరవశించి పలకరించే..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: