27, మే 2025, మంగళవారం

అన్నము

 అన్నము అంటే ఏమిటి ?


అన్నం పరబ్రహ్మ స్వరూపం !

మనలో చాలా మందికి ” అన్నము” అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు. .

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టం అయినది అన్నదానం.


శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నాన్ని గురించి ప్రస్తావించాడు. అన్నం భగవంతుని సొత్తు. మనది కాదు. పరమాత్మయే వర్షాల్ని కురిపించి ధాన్యం సృష్టిస్తున్నాడు. భోజనం లేనిదే మనం లేము. మన జీవనాధారం భోజనం పైనే ఆధారపడి వున్నది. ఆ భోజనాన్ని మనకు అందించే దేవునకు సదా కృతజ్ఞులమై వుండాలి. 

 మనం చూపే కృతజ్ఞతయే ఆ దేవునికి మూల్యం. అదే భక్తి. ఆ భక్తితో మనం తినే అన్నాన్ని భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి. లేదా దానిలో కొంత భాగాన్ని ప్రాణికోటికి సమర్పించాలి. ఈ శరీరం పంచకోశములతో ఆవృతమై వుంది. అవి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం. ఇవి ఉల్లిపొరల వలె ఒకదాని లోపల ఒకటి విలీనమై వుంటాయి. వీటిలో అన్నిటికంటే బయట వున్నది అన్నమయకోశం. లోపల వున్నది ఆనందమయకోశం. అందుకే అన్నమయకోశం శరీరంగాను, ప్రాణమయకోశం దీనికి ఆత్మగా చెప్పబడింది. 

 సద్గృహస్తులు అతిథులకు అన్నం సిద్దంగా వుందని చెప్తారు. అతిథులు ఏ సమయంలో వచ్చినా వారికి అన్నం పెడతారు. ఎవరు సిద్ధమైన అన్నాన్ని అత్యంత శ్రద్ధాభక్తితో అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారు జన్మాంతరంలో అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించబడిన అన్నాన్ని శ్రమపడక్కర లేకుండానే గౌరవంగా పొందుతారు. ఎవరు తక్కువ శ్రద్ధతో ఇక తప్పదని గ్రహించి ఈ సిద్ధమైన అన్నాన్ని అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారికి జన్మాంతరంలో అదేవిదంగా తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం, సామాన్య శ్రమతో దొరుకుతుంది. 


అన్నం గురించి కొంత మంది పెద్ద మనుషులు మంచి మనసుతో చెప్పిన గొప్ప మాటలు ఈ విధంగా...

 " నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు " అనేవారు... నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! 

( జంధ్యాల గారు ) . 

 మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .


 రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! ... వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .


 ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .


 ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా " అని బీదసాదల కి చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )


 అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !

అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటేశ్వరరావు గారు ) .

. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!

(గౌతమ బుద్దుడు )


 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారు కూడా అమృతంలా రుచిస్తుంది !

( మాతా అమృతానందమయి )


 మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు. మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..

సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

ఎవరు అత్యంత నిరసనతో అన్నంలేదు పో... అంటూ పరిభాషిస్తారో వారికి జన్మాంతరమందు అదేవిధంగా అత్యంత నిరసనతో అతికష్టం మీద అన్నం దొరుకుంది. కనుక ఆశ్రయించివచ్చిన వారికి అన్నం పెట్టాలి. ఎంతమంది వచ్చినా అన్నం సిద్ధపరుచుకోవాలి

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారు నివసించే ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చిట్టడవిలో ఉన్నాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. ఇదంతా చూసిన బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది.

అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

కామెంట్‌లు లేవు: