*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*
*389 వ రోజు*
*కురు పాండవయోధుల సమరం*-
అశ్వత్థామ పరాజయానికి పాండవయోధులు అర్జునుడిని కొనియాడారు. భేరీ మృదంగ నాదాలు మిన్నంటాయి. అది చూసి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. త్రిగర్తసేనలు అర్జునుడిని కవ్వించాయి. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తలు మనలను కవ్విస్తున్నారు ముందు వారి పని పడతాను. కర్ణుడి సంగతి తరువాత చూడచ్చు. కర్ణుని ఎదుర్కొన్న త్రిగర్తలకు ఓడిన వారిమి ఔతాము " అన్నాడు. కృష్ణుడు రధమును త్రిగర్తల వైపు పోనిచ్చాడు. అర్జునుడు త్రిగర్తసేనలను చీల్చిచెండాడుతున్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఇరువురికి నడుమ పోరు ఘోరంగా సాగుతుంది. కర్ణుడు పాండవసేన లోని ప్రముఖులను, రధాశ్వములను, సారధులను వధించి వారి రధములను, కేతనములను విరుస్తున్నాడు. నకులసహదేవులు, సాత్యకి, ఉపపాండవులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ఒక్కడే వారిని ఎదుర్కొని వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. సుయోధనుడు గజ సైన్యాలను యుద్ధానికి పంపాడు. అంగ, వంగ, పౌండ్రక, మగధ, సుష్మ దేశాలకు చెందిన గజ సైన్యములు పాండవసేనలపై పురికొల్పాడు. గజసైన్యము పాండవసేనలను కాళ్ళతో తొక్కి నాశనం చేయసాగింది. సాత్యకి అత్యంత సాహసంతో వంగరాజును అతడి గజసైన్యమును నాశనం చేసాడు. నకులుడు పౌండ్ర రాజును, సహదేవుడు సుష్మరాజును ససైన్యంగా వధించారు. రాజులు చనిపోగానే గజములు పాండసేనల మీద విజృంభించాయి. నకులుడు అత్యంత శక్తివంతమైన బాణములు వేసి గజసేనలను నిర్మూలిస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైన వారు ఏనుగుల గుంపులను హతమారుస్తున్నారు. యుద్ధము తీవ్రమైంది. రధములు విరుగుతున్నాయి. తలలు, కాళ్ళు, చేతులు తెగి పడుతున్నాయి. ఏనుగుల కళేబరాలు కొండల మాదిరి గుట్టలుగా పడ్డాయి. రక్తం ఏరులై పారింది. సుయోధనుడు ధర్మరాజును పట్టడానికి తన అనుయాయులతో వచ్చాడు. సాత్యకి భీమసేనుడు వారిని ఎదుర్కొని ధర్మరాజును కాపాడారు. కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడికి సాయంగా వచ్చారు. వారంతా భీముని మీద సాత్యకి మీద శరవర్షం గుప్పించి ధర్మరాజు కవచం ఖండించారు. కర్ణుడు పాండవ సేనలను దునుమాడుతూ అర్జునుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! కర్ణుడు నీ కొరకు వెతుకుతున్నాడు. వెళ్ళి అతడిని వధించి సుయోధనుడిని ఒంటరి వాడిని చేసి సామ్రాజ్యలక్ష్మిని వరించు " అన్నాడు. భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నులతో చేరి కౌరవ సేనలను తరిమి తరిమి కొడుతున్నాడు. భీముడు తనతో తలపడిన నిషాద రాజకుమారుని ఒకే బాణము వేసి అతడి తలను ఏనుగు తలను ఏక కాలంలో నరికాడు. అది చూసి నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది. ప్రళయకాల రుద్రుడి వలె ఉన్న భీముని ఎదిరించడానికి ఎవరికీ సాహసం లేక పోయింది. అది చూసిన దుర్యోధనుడు భీముని అడ్డగించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి