18-17-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అl అహంకారము, కర్తృత్వబుద్ధి లేనివాడు కర్మలచే నంటబడడని వచించుచున్నారు–
యస్య నాహంకృతో భావో
బుద్ధిర్యస్య న లిప్యతే
హత్వా౽పి స ఇమాన్ లోకాన్
న హన్తి న నిబధ్యతే.
తా:- ఎవనికి "నేను కర్తను' అను తలంపు లేదో, ఎవనియొక్క బుద్ధి విషయములను, కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మరియు నతడు (కర్మలచే, పాపముచే) బంధింపబడుటయు లేదు.
వ్యాఖ్య:- అహంకారముగాని, 'నేను కర్తను' అను తలంపుగాని లేనివానికి, బుద్ధి విషయములందుగాని , కర్మలందుగాని అంటనివానికి ఈ ప్రాణులన్నిటిని వధించినను, వధించనట్లేయనియు, పాపముచే నతడు చుట్టుకొనబడడనియు, ఆతడు బంధింపబడడనియు ఇచట తెలుపబడెను. ఈ శ్లోకార్థమును బహుజాగ్రత్తగ యోచన చేయవలయును. లేకున్న మనుజుడు అజ్ఞానమను అఖాతమున పడిపోవు ప్రమాదము గలదు.
కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వబుద్ధి గలిగియుండుట, బుద్ధి ఆ యా విషయములకు, కర్మలకు అంటుకొనుట (సంగము) అయియున్నది. కర్తృత్వబుద్ధి లేకుండ కర్మలు చేయువానికిగాని, విషయములందు బుద్ధి అంటకుండ (సంగములేకుండ) కర్మలు చేయువానికిగాని, ఆ కర్మజనిత సుఖదుఃఖములుగాని పుణ్యపాపములుగాని అంటవు. ఆ సత్యమే యిచట చెప్పబడినది. అంతియేకాని ప్రాణులను చంపుమనిగాని, చంపుట యుక్తమనిగాని యిచట బోధింపబడలేదు. పైగా సమస్తమును ఆత్మరూపముగ వీక్షించువాడు, కర్తృత్వములేనివాడు, అసంగుడై యుండువాడు, తాను మనస్సుగాదని తలంచువాడు, ఆత్మయందే స్థితిగలిగియుండును గావున అట్టివాడు సమస్తప్రాణులందును తన ఆత్మనే చూచుటవలన ఒక ప్రాణి కెట్లు బాధకలుగజేయగలడు? కాబట్టి అట్టి అసంగభావము గలవాడు, ఆత్మస్థితుడు జనులకు ఉపకారము చేయునేకాని, అపకారము చేయడు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ హింసించినచో ఆతని కింకను ఆత్మజ్ఞానము కలుగలేదనియే ఊహించవలసియుండును.
మనుజుడు వాస్తవముగ దేహముగాని, మనస్సుగాని కాదు - ఆత్మయే. కర్తృత్వము, అహంభావము లేనివాడు ఆత్మయందే స్థితి గల్గియుండును. అట్టివారు బుద్ధిచేగావింపబడు కర్మలతోగాని, తజ్జనిత బంధముతోగాని ఏ సంబంధమును లేకుండును. కాబట్టి యతడు ఒక ప్రాణినేకాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినను, బుద్ధితో సంగము లేకుండుటవలన, కర్తృత్వము లేకుండుటవలన, ఆత్మయందే యుండుటవలన ఆతడు చంపనట్లేయగుచున్నాడు. మరియు ఆ వధవలన కలుగు పాపముచే, బంధముచే అంటబడక నుండుచున్నాడు. ఇచట ఆత్మయొక్క ఆత్మస్థితునియొక్క నిర్లేపత్వమును గూర్చిన ఒకానొక సిద్దాంతము, సత్యము చెప్పబడినదేకాని హింసాప్రేరణము కాదు. వాస్తవముగ అట్టి నిర్లేపత్వమును బడసినవాడు, ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలుచేయునే కాని, వానిని ఏ మాత్రము బాధింపడు. ఈ విషయమును ముముక్షువులు ముఖ్యముగ జ్ఞప్తియందుంచుకొనవలెను.
పుణ్యపాపములకు కారణము కర్తృత్వము, సంగము, ఆసక్తి; అనగా జీవుడు తన ఆత్మస్థానమును వదలి, దిగివచ్చి దృశ్యముతో, బుద్ధితో జేరి "నేను చేయుచున్నాను" అని తలంచుటయే. కాని ఎపు డట్టి సంగము (ఆసక్తి), కర్తృత్వములేదో అత్తటి ఆ పుణ్యపాపములతోగాని, తజ్ఞనిత సుఖదుఃఖములచే గాని, బంధమోక్షములతోగాని మనుజునకు సంబంధము యుండదు. కావుననే అట్టివాడు అందరిని చంపినను, చంపనివాడే యని చెప్పబడుటకు కారణము. "ఎంతపాపమైనను అంటదు" - అనుదానికి ఒక తార్కాణముగ, " అతడొకవేళ అందరిని చంపినను చంపనివాడేయగునని వచింపబడినదేకాని వారిని చంపుమని బోధింపబడలేదు.
మరియు అర్జునుడు క్షత్రియుడు. దుష్టశిక్షణ ప్రభువుకు ధర్మము, కర్తవ్యము. కౌరవులు అధర్మమును జేబట్టి దుష్టులుగ తయారైరి. " కావున అట్టివారినందరిని ఓ అర్జునా! అసంగబుద్ధిగలిగి, నిరహంకారముతో నీవు వధించినను వధింపనట్లేయగు’ నని భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నాడనియు భావించవచ్చును. బుద్ధినిదాటి, అహంభావమును దాటి ఆత్మయందు నెలకొనియుండువానికి ఆ బుద్ధితో ఏది చేసినను చేయనట్లేయగునుగదా! అయితే అట్టి స్థితియందుండువారు అసభ్యమైన, అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైన క్రియలెవ్వియును జేయరు. " ఇమాన్ లోకాన్' అని అర్జునునకు చెప్పినందువలన “ ఈ యెదుటనున్న కౌరవరాజులు మున్నగువారు అనియు తలంచవచ్చును. ప్రభువులు దుష్టులకు, ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు. కావున అది వారిని బంధింపదు. పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో నాచరించునపుడు ఇంకను ఏ మాత్రము బంధప్రభావమును కలుగజేయదు.
కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందలి భావమును చాల లోతుగ విచారించి, పరప్రాణికి ఏమియు బాధ కలుగజేయక, ఆత్మయందు స్థితుడై అసంగబుద్ధితో ఆ యా కార్యముల నెరవేర్చుచు, బంధవిముక్తుడై వెలయవలెను.
ప్ర:- పాపమునకు, బంధమునకు కారణమేమి?
ఉ:- (1) అహంభావము ("నేను కర్తను' అనుభావము) (2) బుద్దియొక్క సంగము (విషయాదులతో, కర్మాదులతో అంటుకొనుట).
ప్ర:- పాపము, బంధము తొలగుటకు ఉపాయమేమి?
ఉ:- అట్టి సంగ కర్తృత్వాదులు లేకుండుట. అత్తటి కార్యములను జేసినను వానిచే నతడు బంధింపబడడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి