*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ప్రథమాశ్వాసము*
*409 వ రోజు*
*కురుపాండవ యుద్ధవ్యూహాలు*
పద్దెమిదవనాటి యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆజానుభాహుడైన శల్యుని ముందు నిలుపుకుని కౌరవ సైన్యాలు, పాండవులను ముందు నిలుపుకుని పాండవసైన్యాలు యుద్ధభూమికి చేరాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " ఇంకెందుకు సంశయం సంజయా ! పాండవులు శల్యుని నా కుమారుని ఎలా సంహరించారో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! ఇంకా నువ్వు ఇలాంటి మరణవార్తలు వినే స్థితిలో ఉన్నావా ! నేను చెప్పు యుద్ధ విశేషాలు మందుగా విను. మరణవార్తలు ఎలాగూ వినక తప్పదుగా ! " అన్నాడు. " నీ కుమారుడు సుయోధనుడు ఎలాగైనా పద్దెనిమిదవ రోజైనా యుద్ధంలో పాండవులను జయించి రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని పేరాశతో ఉన్నాడు. శల్యుడు కురుసైన్యాలను సర్వతోభద్రవ్యూహంలో నిలిపాడు. ముఖద్వారం వద్ద కర్ణుడి పుత్రులతో శల్యుడు నిలిచాడు, కుడి వైపున కృపాచార్యుడు, ఏడమవైపున త్రిగర్త వీరులతో కృతవర్మ నిలిచారు. వెనుకవైపు కాంభోజరాజ సైన్యాలతో కలిసి అశ్వత్థామ నిలిచాడు. మధ్యభాగాన సుయోధనుడు ససైన్యంగా నిలిచాడు. పాండవులు తమ సైన్యాలను త్రిముఖ వ్యూహంగా నిలిపారు. ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి మూడు ముఖద్వారాల వద్ద నిలిచారు. భీమార్జునులు ధర్మరాజుకు ముందు రక్షగా నిలిచారు " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! ఈ పదిహేడు రోజుల యుద్ధం తరువాత ఎవరెవరికి ఎంత సేనలు మిగిలాయో వివరించు " అని అడిగాడు. మహారాజా ! మనపక్షాన పదకొండు వేల రథములు, పదివేల ఏడు వందల గజములు, రెండు లక్షల హయములు, మూడు కోట్ల సైనికులు మిగిలారు. పాండవ పక్షాన ఆరువేల రథములు, మూడువేల ఏనుగులు, ఒక లక్ష గుర్రములు, ఒక కోటి కాల్బలమూ మిగిలాయి " అన్నాడు.
*యుద్ధారంభం*
మరునాడు యుద్ధం ప్రారంభం అయింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆఖరి రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షముల భేరి మృదంగనాదాలు మిన్నంటాయి. సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఆరోజు అటో ఇటో తేలాలని ఇరుపక్షములు యుద్ధం సాగిస్తున్నారు. రథములు విరిగి పడుతున్నాయి. కాళ్ళు చేతులు విరిగిన సైనికులు కింద పడి దొర్లుతున్నారు. కొంత మంది సైనికులు తలలు తెగి పడిపోయి ఉన్నారు.గజములు, హయములు కుప్పలుగా పడి ఉన్నాయి. రణభూమి అంతా రక్తసిక్తమై ఉంది. వాటి మధ్య రథములు తిరుగుతున్నాయి. వీరులు జంకక బీభత్స వాతావరణంలో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు.
*నకులుడి శౌర్యం*
కర్ణుడి మనుమడు చిత్రసేనుడు నకులుని ఎదుర్కొని అతడి విల్లు విరిచి, నుదుటన మూడు బాణములు నాటి, పతాకమును విరిచి, సారథిని చంపాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని చిత్రసేనుడు వేయు బాణములు తప్పించుకుంటూ చిత్రసేనుడి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా విజృంభించి రథము మీద లంఘించి చిత్రసేనుడి తలని కత్తితో ఖండించాడు. అది చూసిన చిత్రసేనుడి సోదరులు సత్యసేనుడు, సుషేణుడు నకులునితో కలియబడ్డారు. నకులుడు మరొక రథం ఎక్కాడు. సత్యసేనుడు, సుషేణుడు నకులుడి మీద బల్లెములు విసిరారు. నకులుడు అవలీలగా వారి రథాశ్వములను చంపాడు. సత్యసేనుడు మరొక రథం ఎక్కి నకులుడి విల్లు విరిచాడు. నకులుడు శక్తి ఆయుధమును వేసి సత్యసేనుడి మీద ప్రయోగించి అతడి తల తెంచాడు. అది చూసి సుషేణుడు నకులుడి మీద బాణములు గుప్పించాడు. నకులుడు భీముడి పుత్రుడైన శ్రుతసోముని రథం ఎక్కి మరొక విల్లందుకుని సుషేణుడి మీద శరవర్షం కురిపించి సుషేణుడి తలను ఒక అర్ధచంద్ర బాణంతో తుంచాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి