*తిరుమల సర్వస్వం -272*
*సుప్రభాత గానం 2*
సుప్రభాత అంతర్గతమైన ఒక్కొక్క విభాగంలో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
*శ్రీ వేంకటేశ సుప్రభాతం*
*'సుప్రభాతం'* అంటే మంగళకరమైన ఉదయపు వేళ అని అర్థం. వేంకటేశ సుప్రభాతం యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శ్రీవారి మేలుకొలుపు గానమే అయినప్పటికీ అందులో వారి అపురూప సౌందర్యం, మంగళకరమైన గుణగణాలు, మహిమలు యొక్క సంక్షిప్త వర్ణన కూడా కానవస్తుంది. శ్రీవారు ముల్లోకాలకు రాజాధిరాజు. రాజులను, మహారాజులను సర్వలాంఛనాలతో మేలుకొలుపే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ శ్రీవారికి, సతీ సమేతంగా, రాజోచిత సత్కారాలతో పాడే మేలుకొలుపే సుప్రభాతగానం. ప్రభాత సమయంలో ప్రకృతి శోభ; స్వామివారి తొలిదర్శనానికై వేచియుండే బ్రహ్మాదిదేవతల, నవగ్రహాల మరియు సప్తఋషుల కోలాహలం; రామచిలుకలు, తేనెటీగల వంటి అల్పప్రాణులు సైతం విభిన్నరీతుల్లో శ్రీవారికి తెలియజేసే అభినందనలు; శ్రీమహావిష్ణువు దశావతారాలు మున్నగు అంశాలు కూడా సుప్రభాతంలో మనోహరంగా వర్ణించబడ్డాయి.
*శ్రీ వేంకటేశ స్తోత్రం*
*'స్తోత్రం'* అంటే స్తుతి లేదా పొగడ్త అని అర్థం. శ్రీ వేంకటేశ స్తోత్రంలో శ్రీవారి దశావతారాల మహిమలు; వారి విశ్వవ్యాపకత్వం, సార్వభౌమత్వం, ఆశ్రితజన పక్షపాతం; శ్రీరామచంద్రుని విలువిద్యా కౌశలం మున్నగునవి విస్తారంగా వర్ణించబడ్డాయి.
┉┅━❀❀┉┅━
*శ్రీ వేంకటేశ ప్రపత్తి*
సాధారణంగా, భక్తి ప్రపత్తి అనే మాటలను ప్రత్యాయపదాలుగా ఉపయోగిస్తుంటాం. కానీ రెండింటికీ ఎంతో వ్యత్యాసముంది. భక్తిని 'మర్కటకిశోరన్యాయం' తో పోల్చవచ్చు. అంటే పిల్ల కోతి ఎల్లవేళలా తల్లి ఉదరాన్ని తన కాలి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ క్షణంలో నైనా పట్టు తప్పితే కోతిపిల్ల ప్రమాదానికి లోనవుతుంది. కోతిపిల్లను భక్తుని తోనూ, తల్లికోతిని భగవంతుని తోనూ పోల్చినప్పుడు, 'మర్కట కిశోర న్యాయం' లో భగవంతునిపై విశేషమైన భక్తిభావ మున్నప్పటికీ, వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే బాధ్యత మాత్రం భక్తునిదే.
కానీ 'ప్రపత్తి' విషయంలో అలా కాదు. ప్రపత్తిని 'మార్జాల కిశోర న్యాయం' తో పోల్చుతారు. తల్లిపిల్లి తన పిల్లను నోటితో కరుచుకుని ఒక చోటి నుండి మరో చోటికి క్షేమంగా చేర్చుతుంది. పిల్లిపిల్ల తన బాధ్యతను పూర్తిగా తల్లిపై వేసి, నిశ్చింతగా ఉంటుంది. అలాగే, భక్తుడు 'ప్రపత్తి' లేదా 'శరణాగతి' ని ఆశ్రయించినప్పుడు తన భారాన్నంతా దేవునిపై వేసి, ఐహిక చింతలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా గడప గలడన్న మాట.
సంక్షిప్తంగా చెప్పాలంటే 'భక్తి' అంటే భగవంతుణ్ణి ఆరాధించడం; 'ప్రపత్తి' అంటే దేవుని శరణు వేడి భారాన్నంతా వానిపై వేసి నిశ్చింతగా ఉండటమన్న మాట. 'భక్తి' కంటే 'ప్రపత్తి' ని ఉత్తమమైనదిగా భావించి, అణ్ణన్ స్వామి దానినే ఆశ్రయించారు.
శ్రీ వేంకటేశ ప్రపత్తిలో శ్రీనివాసుని పాదపద్మాలే ముల్లోకవాసులందరికి శరణ్యమని; వారి శరణువేడినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని; వారు ఈప్సితాలు ఈడేర్చే కల్పతరువని వర్ణించ బడింది. భక్తులకు శ్రీవారి పాదాలే శరణు కావున, వారి పాదారవిందాలను కూడా ప్రపత్తిలో అణ్ణన్ స్వామి విస్తారంగా వర్ణించారు.
*శ్రీ వేంకటేశ మంగళాశాసనం*
*'మంగళాశాసనం'* అంటే 'ఆశీర్వచనము'. శ్రీవేంకటేశ్వరుడు మానవమాత్రునిగా జన్మించి, అర్చారూపంలో వెలసియుండటం వల్ల వారు కూడా నరదృష్టికి అతీతులు కారు. కావున అతిలోక సౌందర్యంతో వర్థిల్లే వారి దివ్యమంగళ మూర్తికి దృష్టి (దిష్టి) సోకుతుందేమోననే బెంగతో, అణ్ణన్ స్వామి శ్రీవారికి ఆశీర్వచనం పలికారు. వారి శుభచింతనను విని, గగనాన విహరించే తథాస్తు దేవతలు 'తథాస్తు' పలికి, శ్రీవారిని దుష్టశక్తుల నుండి కాపాడతారని అణ్ణన్ స్వాముల ఆకాంక్ష. అందువల్ల ముల్లోకాలను ఏలే, భక్తజనుల పాలిట కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరుడు, శ్రీమహాలక్ష్మి కలకాలం వర్థిల్లాలనే ఆకాంక్షను 'మంగళాశాసనం' లో అణ్ణన్ స్వామి వెలిబుచ్చుతారు. 'శ్రీ వేంకటేశ మంగళాశాసనం' 'వరవరముని' అనే మరో భక్తుని ద్వారా రచించబడినదని కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. కానీ, అత్యధికులు మాత్రం దీనిని కూడా అణ్ణన్ స్వామివారే వ్రాశారని విశ్వసిస్తారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి