26, జూన్ 2025, గురువారం

18-28-గీతా మకరందము

 18-28-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఇక తామసకర్తయొక్క లక్షణములను వివరించుచున్నారు - 


అయుక్తః ప్రాకృతః స్తబ్ధః  

శఠో నైష్కృతికో౽లసః

విషాదీ దీర్ఘసూత్రీ చ 

కర్తా తామస ఉచ్యతే.


తా:- మనోనిగ్రహము (లేక చిత్తైకాగ్రత) లేనివాడును, పామర స్వభావము గల వాడును (అవివేకి), వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడుచేయువాడును, సోమరితనముగలవాడును, ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- అయుక్తః = మనస్సు బహిర్ముఖముగాను, చంచలముగాను నుండువాడు, ఆత్మయందు నిలుకడలేనివాడు, ఏకాగ్రత, నిగ్రహము లేకయుండువాడు అయుక్తుడనబడును. ఆత్మతో, భగవంతునితో గూడియుండనివాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహములేక బయటనే తిరుగాడుచుండును.


"ప్రాకృతః" - ప్రకృతిగుణములు కలవాడు ప్రాకృతుడు. సంస్కారము లేనివాడు పామరుడని అర్థము. ప్రతివాడును తనయందలి ప్రకృతిగుణములను తొలగించుకొని అప్రాకృతుడుగ, దైవస్వరూపుడుగ మారవలెను.


'నైష్కృతికః' = ఇతరుల కార్యములను చెడగొట్టువాడు. ఇతరులను వంచించువాడు. సామాన్యముగ జనులు నాలుగు రకములుగ నుందురు. (1) తన సుఖమునుగూడ చూడక ఇతరులకు మేలుచేయువాడు (2) తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమొనర్చువాడు (3) తనసుఖము కొఱకు పరులకు కీడుచేయువాడు (4) అనవసరముగా ఇతరులకు కీడుచేయువాడు. మొదటివాడు ఉత్తముడు. రెండవవాడు మధ్యముడు. మూడవవాడు అధముడు. నాల్గవవాడు అధమాధముడు. ఈశ్లోకమున తెలుపబడిన 'నైష్కృతికులు' చివరి రెండు తరగతులకు జెందినవారు.


"అలసః" - భగవానుడు సోమరితనమును తామసగుణముగజెప్పి దానిని పారద్రోలవలసినదిగా బోధించుచున్నారు. సోమరి ఏరంగమందును వృద్ధికి రానేరడు. అధ్యాత్మరంగమున సోమరులకు చోటేలేదు.


"విషాదీ" - తామసకర్త ప్రతికార్యమందును ఏడుపుమొగము పెట్టుకొని యుండును. వాస్తవముగ అనంతానందపరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానమువలననే యగును. కావున గంభీరమగు స్వస్వరూపము నెరింగి విషాదమును పారద్రోలవలెను.


"దీర్ఘసూత్రీ"– మందకొడిగ ప్రవర్తించువాడు. తాబేలు నడకవంటి గమనము గలిగి చిన్నపనిని కూడా గంటలతరబడి చేయుచు, లేక అసలేచేయక "వాయిదా వేయుచునుండును. తామసకర్త 'తరువాత చూచెదములే' అను ప్రమత్తతతో గూడిన భావము గలిగియుండును.

        మహాభారతములోని శాంతిపర్వమున భీష్ముడు ధర్మరాజునకు "దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి" అను మూడు చేపలను గూర్చి బోధించిన విషయమీసందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తము. ఆ మూడు చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచనగలది. ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్నలోపముగలది. దీర్ఘసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి. (కథలో అది బెస్తవాని వలలో పడి మరణించును). కాబట్టి ఇట్టి దీర్ఘసూత్రత్వమును, అలసత్వమును, సోమరితనమును ముముక్షువులు దరికిచేర్చరాదు. అమూల్యమగు మానవజన్మను బడసి భగవత్ప్రాప్తికై యత్నింపక సోమరిగ కాలము గడుపుట మహాప్రమాదకరమని యెరుంగవలెను.


ప్ర:- తామసకర్త ఎట్టివాడు?

ఉ:- (1) మనోనిగ్రహము (చిత్తైకాగ్రత) లేనివాడు (2) పామరుడు (3) మొద్ధు, వినయము లేనివాడు(4) మోసగాడు (5) ఇతరుల కార్యములను చెడగొట్టువాడు (6) సోమరి (7) ఎల్లప్పుడు ఏదియోచింతతో, దుఃఖముతో గూడియుండువాడు (8) పనులను తెమల్చక దీర్ఘకాలము కొనసాగించువాడు - తామసకర్త యనబడును.

కామెంట్‌లు లేవు: