26, జూన్ 2025, గురువారం

తిరుమల సర్వస్వం -282*

 *తిరుమల సర్వస్వం -282*

*సుప్రభాత గానం 12*

 *ఇరవై ఎనిమిదవ శ్లోకం* 


*"లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో* 

*సంసారసాగరసముత్తరణైక సేతో,* 

*వేదాంతవేద్యనిజవైభవ భక్తభోగ్య* 

*శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్."*


*శ్లోకార్థం:* 


 శ్రీమహాలక్ష్మికి నెలవైన వానివి; దోషరహితము, మంగళకరము అయినటువంటి గుణగణముల సాగరము వంటి వాడివి; సంసారమనే సాగరమును దాటించగల వారధి వంటి వానివి; వేదవేదాంతోపనిషత్తుల ద్వారా కీర్తించబడినట్టి వైభవమును కలిగినవాడివి యైనట్టి ఓ వేంకటాచలపతీ నీకు సుప్రభాతం.


 'సంసారం' అంటే సుఖ దుఃఖాలతో కూడుకున్న మానవజీవితం. సంక్లిష్టతతో కూడుకున్న ప్రాపంచిక జీవితాన్ని సాగరంతో పోల్చవచ్చు. సప్తసముద్రాలను దాటడానికి అనేక సాధనాలు ఉంటాయి. కానీ సప్తసాగరాల కంటే లోతైనది, ప్రమాదకరమైనది అయిన సంసారసాగరాన్ని దాటడానికి పరమాత్ముని పరిపూర్ణ కటాక్షం కావాలి.

 మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు ప్రళయకాలంలో ఒక నావను సృష్టించి, సృష్టిమూలాలను అందులో భద్రపరిచి, సృష్టి అంతరించకుండా కాపాడాడు. సకల చరాచర సృష్టినే ఒక నౌక సాయంతో ప్రళయాన్ని దాటించ గలిగిన శ్రీమహావిష్ణువును శరణు వేడితే సంసారసాగరాన్ని దాటడం దుర్లభం కాదు.


 ఈ శ్లోకంలో వేదాల ప్రస్తావన కుడా ఉంది. బ్రహ్మదేవుని వద్దనుండి వేదాలను తస్కరించి సాగరగర్భంలో నిక్షిప్తం చేసి; లోకాలను అజ్ఞానాంధకారంలో ముంచివేసే పన్నాగం పన్నిన సోమకాసురుడనే రాక్షసుణ్ణి మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు నిర్జించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించాడు. వేదాలు రక్షించబడిన చైత్రశుద్ధ తదియను మత్స్యజయంతిగా జరుపుకుంటారు. అందుచేతనే మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు వేదనారాయణస్వామిగా కూడా ప్రసిద్ధికెక్కాడు. తిరుపతికి 50 మైళ్ళ దూరం లోని నాగులాపురం అనే గ్రామంలో అత్యద్భుతమైన శిల్పకళతో, సమున్నతమైన ప్రాకారాలతో అలరారుతున్న ప్రాచీన వేదనారాయణస్వామి ఆలయాన్ని నేడు కూడా చూసి తరించవచ్చు.


 ఆ విధంగా శ్రీమహావిష్ణువు మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారపు ప్రాశస్త్యాన్ని స్మరణకు తేవడం ద్వారా వారి కృపకు పాత్రులు కావాలని అణ్ణన్ స్వామి అభిలషించారు.



 *ఇరవై తొమ్మిదవ శ్లోకం*


*"ఇతం వృషాచలపతే రిహ సుప్రభాతం* 

*యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః,* 

*తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం* 

*ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే."*


*శ్లోకార్థం:* 


 ఏ మానవులైతే ఈ సుప్రభాతాన్ని అనుదినము ప్రాతఃసంధ్యలో పఠిస్తారో, అటువంటి భౌతిక కాయాన్ని కలిగిన భక్తులందరూ మోక్షసిద్ధిని పొందడానికి అనువైన అత్యుత్తమ జ్ఞానాన్ని సాధించగలరు.


 అంతిమంగా మోక్షసిద్ధిని శ్రీమహావిష్ణువు కటాక్షం ద్వారానే పొందవచ్చునని, ఎవరైతే ప్రతిదినము ప్రాతఃసంధ్య వేళలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారో వారు శ్రీవారి కటాక్షాన్ని పొందగలరని ముక్తాయిస్తూ శ్రీవేంకటేశ్వరుని భక్తులందరినీ సుప్రభాత పఠనానికై అణ్ణన్ స్వామి ప్రేరేపిస్తున్నారు.



 *సుప్రభాత గానం సమాప్తం* 



[ రేపటి భాగంలో... *తిరుమల క్షేత్రంలో నిషిధ్ధకర్మలు* గురించి తెలుసుకుందాం...]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: