26, జూన్ 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*419 వ రోజు*

*సుయోధనుడిని మడుగు నుండి బయటకు తెచ్చే ప్రత్నం*


కృష్ణద్వైపాయన మడుగు వద్దకు వచ్చిన పాడవులతో కృష్ణుడు " ధర్మజా ! సుయోధనుడు నిశ్చయంగా ఈ మడుగులోనే ఉన్నాడు. అతడికి తెలిసిన జలస్థంభన విద్యతో మడుగు అడున దాక్కున్నాడు. అందుకే జలం నిశ్చలంగా ఉన్నది " అన్నాడు. ధర్మరాజు సుయోధనుడు స్వర్గాధిపతి వద్ద దాక్కున్నా నా వద్ద నుండి తప్పించుకొన లేడు " అన్నాడు. కృష్ణుడు " ధర్మరాజా ! ఇలాంటి మాయలు సుయోధనుడు తప్ప వేరెవరు పన్నగలరు. ఇప్పుడు దీనిని మనం వంచనతోనే జయించాలి. కనుక నీవు ఎలాగైనా సుయోధనుడు మడుగు నుండి వెలుపలికి వచ్చేలా చేయాలి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ కొరకు అనేక రాజులు మరణించారు. నీవు మాత్రం ప్రాణములు రక్షించుకోవడానికి ఇలా మడుగులో దాక్కొనడం భావ్యమా ? ఇది నీకు వీరమా ? నలుగురూ నవ్వరా ! నీ అభిమానం ఏమయ్యింది ఇలా యుద్ధంలో వెన్ను చూపడం నీకు తగునా ! క్షత్రియకులజుడవైన నీవు ఇలా నీచపు పనులు చేసిన ఇహము పరము రెండూ చెడవా ! నాడు శకుని, కర్ణుడు, దుశ్శాసనాదులను చూసి విర్రవీగావు నేడు ఇలా భీరువువై దాక్కున్నావు. నీ పిరికితనం వదిలి యుద్ధం చేసి మమ్ము జయించిన ఈ భూమండలాధిపత్యం పొందగలవు ఓడిన వీరస్వర్గం అలంకరించ గలవు. కనుక ప్రస్తుత నీ కర్తవ్యం మాతో యుద్ధం చేయటమే నీవు ఆడదానివి కాకున్న మాతో యుద్ధం చేయి " అని ఎత్తి పొడిచాడు.


*సుయోధనుడు మడుగు నుండి ధర్మజునితో మాటాడుట*


ఆ మాటలకు రోషపడిన సుయోధనుడు " ధర్మరాజా ! మానవులకు ప్రాణ భయం సహజము కాదా ! నా వద్ద ప్రస్తుతం రథము, సారథి, ఆయుధములు, చక్రరక్షకులు ఏమియును లేవు. నేను యుద్ధమున డస్సి ఉన్నాను. కనుక నేను ఇప్పుడు యుద్ధం చేయ లేను. మీరూ పద్దెనిమిది రోజుల యుద్ధమున అలసి ఉన్నారు కనుక మీరూ విశ్రాంతి తీసుకొని రండి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! మేము విశ్రాంతి తీసుకొని ఉన్నాము. నీవు మడుగులో విశ్రాంతి తీసుకున్నావు కదా ఇక వచ్చి యుద్ధం చేయి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నా తమ్ములు, బంధు మిత్రులు యుద్ధమున మరణించారు. ఎవరి కొరకు యుద్ధం తలపెట్టానో వారు లేరు కనుక ఎవరి కొరకు నేను యుద్ధం చేయాలి ? నేను గెలిచినా ఆనందించగల వారు ఎవరు. బంధు మిత్రులతో కూడి రాజ్యం చేసిన ఆనందమే కాని ఒంటరిగా రాజ్య పాలన చేయుటలో ఆనందం ఏమి ? నీకు నీ తమ్ములు అంతా ఉన్నారు కనుక నీవు ఇక ఈ రాజ్యాన్ని ఏలుకో. నేను ఈ రాజ్యాన్ని నీకు ధార పోసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. యుద్ధమున ఓడిన నాకు అభిమానం కోపం లేవు. గజ, తురగ, రథాధి సైన్య రహితమైన ఈ రాజ్యం నాకు వద్దు నీవే ఇక దీనిని నీ తలకు కట్టుకో " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ మిత్రుడు కర్ణుని మరణానంతరం శల్యుడిని సైన్యాధ్యక్షుని కావించి యుద్ధము చేసినది రాజ్యకాంక్షతో కాదా ! ఒట్టి మాటలు కట్టి పెట్టి యుద్ధముకు రా ! శత్రుశేషం ఉండగా రాజ్యాన్ని ఏలుకొనుట ధర్మం కాదు. కనుక నిన్ను గెలిచి రాజ్యాన్ని ఏలగలను. నీకు చేతనయితే నా తమ్ములతో నన్ను గెలిచి రాజ్యానికి పట్టభద్రుడివి కా ! అయిదూళ్ళు అడిగిన నిరాకరించిన నీవా నాకు రాజ్యాన్ని ధార పోసేది. రాయబారానికి వచ్చిన కృష్ణుడితో సూది మొన మోపినంత చోటు ఇవ్వనని ఇంత రక్తపాతానికి కారకుడవైన నీవు రాజ్యమును ధారపోస్తావా ! ఇక గెలుచుట అసాధ్యము అని తెలిసి ఇలా మాట్లాడుతున్నావు. నీ వద్ద రాజ్యం ఉంటే కదా నాకు ధార పోసేది. నీ దయా భిక్ష మీద వచ్చే రాజ్యాన్ని నేను స్వీకరించను. నిన్ను సంహరించి కాని రాజ్యభారం వహించను. మా ప్రాణములు నీ చేత ఉన్నాయి, నీ ప్రాణములు మా చేత ఉన్నాయి కనుక యుద్ధమున నిన్ను చంపక తప్పదు. మాకు విషము పెట్టించావు, నీళ్ళలో త్రోయించావు, లక్క ఇంట పెట్టి కాల్పించావు, మాయాజూదంతో రాజ్యమును అపహరించి మమ్ము అడవుల పాలు చేసావు ఇక నీ మత్సరమును సహించి నీ కుట్రలకు మేము బలి కాలేము. కనుక మారు మాటాడక వచ్చి యుద్ధం చెయ్యి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! మీరు అయిదుగురు నేను ఒక్కడిని, మీకు రథ, గజ, తురగ సమేత సైన్యము ఉంది. నేను ఇప్పుడు ఒంటరిని నిరాయుధుణ్ణి కనుక నేను నీకు కృష్ణుడికి వెరచి ఇక్కడ దాక్కున్నాను మీరు నాతో ఒక్కొక్కరుగా యుద్ధం చేసారంటే నేను మిమ్ము అందరిని యుద్ధమున హతమార్చి భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదుల ఋణం తీర్చుకొని రాజ్యాన్ని పొందగలను. నీకు యుద్ధ నీతి తెలియజేసాను " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మమ్ము అందరినీ ఒంటి చేత్తో సంహరించగనని అనుకోవడం సహజమే. కాని నేను అధర్మపరుడను కాను. నీకు అవసరమైన రథము, ఆయుధములు అన్నీ తీసుకో మాలో ఒక్కడితో యుద్ధం చేయి నీవు గెలిచిన రాజ్యాన్ని నీవే ఏలుకో బంధు మిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మయుద్ధం చేస్తాడు " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! రథములతో అస్త్రశస్త్రములతో యుద్ధం చేసి విసిగి ఉన్నాను ఇక నేను భూమి మీద నిలిచి మల్ల యుద్ధం చేస్తాను. గదతో నిన్ను నీ తమ్ములను తృటిలో ఓడిస్తాను " అన్నాడు. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అదే అదనుగా తీసుకొని సుయోధనుడు బుసలు కొడుతూ మడుగు నుండి బయటకు వచ్చాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: