1, జులై 2025, మంగళవారం

18-33-గీతా మకరందము

 18-33-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ || మూడు విధములగు ధైర్యమును గూర్చి చెప్పబోవుచు మొదట సాత్త్వికధైర్యమును వివరించుచున్నారు-


ధృత్యా యయా ధారయతే 

మనః ప్రాణేన్ద్రియ క్రియాః | 

యోగేనావ్యభిచారిణ్యా 

ధృతిస్సా పార్థ సాత్త్వికీ || 


తా:- ఓ అర్జునా! చలింపని (విషయములందు ప్రవర్తింపని) ఏ ధైర్యముతో గూడిన వాడై మనస్సు యొక్కయు, ప్రాణము యొక్కయు, ఇంద్రియములయొక్కయు క్రియలను యోగసాధనచేత (విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమున, లేక శాస్త్రోక్తమార్గమున) నిలబెట్టుచున్నాడో, అట్టి ధైర్యము సాత్త్వికమైనది.


వ్యాఖ్య:- ప్రపంచములో ధైర్యముగలవా రనేకులుందురు. కొందఱు యుద్ధమున ధైర్యముతో పోరాడుదురు. కొందఱు ధైర్యముతో నిశీధసమయమున భీకరారణ్యములలో సంచరించుదురు. కొందఱు ధైర్యముతో మహోన్నత పర్వతశిఖరముల నధిరోహించుదురు, సముద్రములను లంఘించుదురు. కాని ఆ ధైర్యములన్నిటికంటెను ఉపరిస్థానముననున్న ధైర్యమొకటి యిచ్చోట చెప్పబడినది. అదియే సాత్త్వికధైర్యము. అనగా ఏధైర్యముచే మనుజుడు తనమనస్సును, ఇంద్రియములను విషయభోగములనుండి నిరోధించునో, దృశ్యవ్యామోహమునుండి నివృత్తుడగునో, ఆదియే గొప్పధైర్యమని భగవానుడిచట సెలవిచ్చెను. కాబట్టి తక్కిన ధైర్యములు కలిగియున్నను, జన్మసాఫల్యకారణమగు ఈ పారమార్థిక ధైర్యమునుగూడ మనుజుడు తప్పక గలిగియుండవలెను.

అయితే ఆ ధైర్యము చపలముగ నుండరాదు. ఈ రోజున ఉండి రేపు అదృశ్యముకారాదు. కనుకనే "అవ్యభిచారిణ్యా” (నిశ్చలమైన) అని చెప్పబడినది. ఏలయనగా కొందఱు ముముక్షువులు ఏదియో యొక ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాదులను నిగ్రహించినవారై, మఱల పరిస్థితుల ప్రాబల్యముచే క్రమముగ ఆ ధైర్యమును సడలించి, విషయములందు ప్రవర్తించుట కానంబడుచున్నది. అది "అవ్యభిచారిణీ ధైర్యము" కాదు. కాబట్టి స్థిరముగ నుండునట్టి ధైర్యమునే అవలంబించవలెను.


ప్ర:- సాత్త్వికధైర్య మెట్టిది?

ఉ:- ఏ నిశ్చలధైర్యముతో గూడి యోగసాధనచే మనుజుడు ఇంద్రియాదులను విషయముల నుండి నిరోధింపగల్గునో అట్టిధైర్యము సాత్త్వికమని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: