శు భో ద యం 🙏
పార్వతీ నందను పసి చేష్టలు!
ఉ: " అంకముఁ జేరి, శైలతనయా స్తన దుగ్ధము లానువేళ, బా
ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్గబళిపఁబోయి, యా
వంకఁ గుచంబుఁ గాన కహి వల్లభ హారముఁగాంచి, వేమృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు, నభీష్ట సిధ్ధికిన్ ;
మనుచరిత్రము- అవతారిక- అల్లసాని పెద్దన !
రాయల కాలంలో భువన విజయ సభామండప సాహితీ గౌరవానికి మూలకారకుడు 'ఆంధ్ర కవితాపితామహుడు " అల్లసాని పెద్దన! తొలి ప్రబంధ నిర్మాత!
కం: పెద్దన వలెఁగృతి సెప్పిన
పెద్దనవలె, తక్కువాని పెద్దనవలెనా?
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్దనవలె, కుందవరపుఁ గవిచౌడప్పా! - అనిపెద్దన కవితకు ప్రశంస! అల్లిక జిగిబిగిలో మొనగాడు. అతని కవితా చాతుర్యమునకు అవతారికలో నీపద్యము మచ్చుతునక! చిత్తగించండి!
వినాయక ప్రార్ధనారూపమైన పద్యము. బాలగణేశ స్మరణము;
చిన్ని గణపయ్య తల్లి పార్వతీదేవి యొడిలో పాలుద్రాగు చున్నాడట; పార్వతి యర్ధనారీశ్వరి. ఆమెశరీరమందలి యర్ధభాగము పరమేశ్వరార్పిత మగుట నటువైపు పుస్త్వ లక్షణములేగాని స్త్రీత్వ సూచకమైన స్తన
సంపద యుండదు.
ఈమతలబులన్నీ బాలగణేశున కేమెరుక? అతడు యెడమ వైపుగా బాలుగుడుచుచు కుడిప్రక్కకు చేయిసాచి
దేనికో వెదకు లాట ప్రారంభించెను. బాలు రొక వైపు బాలుద్రావుచు మరియొక వైపున నున్న స్తనమును పుణుకు చుండుట
స్వభావము. అతడా కార్యమునే యొనర్పసాగెను. కాని , యేమిప్రయోజనము? ఆవైపున నట్టిదేమియు దొరుకక పోగా సర్పహారము
చేతికందినది. చేతికి దొరకిన దానినూరక పోనిచ్చునా? మెత్త మెత్తగ నున్నది .తామఱతూడేమో ననుకొని నోటఁ బెట్టుచున్నాడట!
ఇదిగూడ బాల స్వభావమే! పెద్దన యెంతచక్కగా వ్రాసినాడు. ఇంతవరకు నెంతో యేకాగ్రతతో చదువు పాఠకుడు
బాలగణేశుని ఈచర్య చదివి ఫక్కున నవ్వకమానడు. నిజమునకు బాలుర స్వభావమేయంత? ఈగణేశుడు యేనిక మోమువాడు.కావున
తత్స్వభావమగు మృణాళనాళ భక్షణము సేయుట విహితమే! పైగా బాలుడగుట నాతనికి పామును మృణాళనాళమని భ్రమించుట కవకాశము కలిగినది.
ఆబాల స్వభావమును ఆధారముగా గొని కవి యింత కథ నల్లినాడు.
ఇంతకూ ఈప్రార్ధనా పద్యము నిట్లేల చిత్రించె నందురా? దానికి కారణమున్నది. వినుడు.రాయలు హాస్య ప్రియుడు.
ఒక్క రాయలనే యననేల ? జనులందరూ శృంగారము తరువాత యిష్టపడునది హాస్యమునే! మనమాటలలో హాస్యము లాస్యము
చేయుచున్నంతవరకూ ,మన మాటలకు యెదురుండదు. ఎటుదిరిగీ అది అపహాస్యము కారాదు. హృదయమునకు ఉల్లాసమును
గల్గించు హాస్యమును కాదనువారెవరు?
అదిగో ఆహాస్యమునకు అధిష్ఠాన దేవత గణపతి.అతని కరుణ లేకున్న కార్యభంగ మగుటయేగాక, పోయిన చోటనెల్ల
విరసమే యెదురగును. దానిని తప్పించుటకై హాస్య మూర్తియగు బాలగణపతిని ప్రార్ధన మొనరించెను.చూచితిరా పెద్దనగారి యోచన!
హాస్యమునకు స్ధాయి ,వికృతమైన వేషభాషలు, వికృత కార్యములు.
ఇపుడు పెద్దన గారివర్ణనమునకు తగిన కారణములు కనబడుచున్నవిగదా!
బాల గణపతి గనుక దైవమైననూ హాస్యమాడుటలో(వేళాకోళం) తప్పుండదు!పైగానది స్వభావోచితమే!
పామును జూచి తామరతూడనుకొనుట భ్రమ! కావున నిందు భ్రాంతిమంత మను నలంకారము
కల్పింప బడినది. ఇదీ పెద్దన చతురత!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి