1, జులై 2025, మంగళవారం

ఇష్ట కామేశ్వరి అమ్మవారు*

 *ఇష్ట కామేశ్వరి అమ్మవారు* 


భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు సుమా. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. 


భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది.


ఇష్ట కామేశ్వరీ దేవాలయం అడవుల మధ్యలో పులుల సంచారం ఎక్కువ ఉన్న చోట ఉండడంతో అటవీశాఖ అనుమతి లేనిదే ఆ దేవాలయాన్ని సందర్శించలేము. నేను ఒక పదుహేను సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ప్రైవేటు జీపులలో వెళ్ళడానికి అనుమతించేవారు. ఇప్పుడైతే అటవీశాఖయే వారి వాహనాలలోనే రవాణా సౌకర్యం కల్పించిందని విన్నాను. ఎలా వెళ్ళినా ఆలయానికి ఒక కిలోమీటరు ముందుదాకే అన్ని వాహనాలు ఆగిపోతాయి. ఆ తరువాత వాహనాలు వెళ్ళడానికి దారి సరిగ్గా లేనందున ఇక కాలినడకనే. అయినా ఆ దారిలో రాళ్ళు రప్పలు విపరీతంగా ఉండడంతో యుక్త వయస్కులు సునాయాసంగా వెళ్ళగలరేమో కాని వయోవృద్ధులు నడవలేనివాళ్ళు ఒక్క అడుగు కూడా వేయలేరు. 


మేము వెళ్ళినప్పుడు మా కుటుంబీకులు ఎటువంటి ఇబ్బందులు లేక ఆ దారిని అధిగమించినా నన్నైతే జీపులో మాతోబాటు పయనించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి (ఒంగోలుకు చెందిన వ్యక్తి) తన భుజాలపై మోసుకెళ్ళడం, దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెనక్కు తీసుకొని రావడం ఎన్నటికీ మరువలేని సంఘటన. వారితో అడపాదడపా చరవాణిలో సంభాషించేవాణ్ణి. అప్పుడప్పుడు ఈ చరవాణులు మార్చడంతో వారి నెంబరును కోల్పోయాను. 


ఈ ఆలయం గురించి ఇప్పుడే విన్న కొత్త వార్త ఏంటంటే జులై 1 నుంచి శ్రీశైలంలోని ఈ ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్ పడినట్టు వింటున్నాను. జులై 1 వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ యాత్రను నిలిపి వేసారట అటవీశాఖ అధికారులు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు విరామం కల్పించారని వినికిడి. 


ఏది ఎలా ఉన్నా శ్రీశైల యాత్రతో బాటు ఇష్టకామేశ్వరీ దేవి ఆలయ సందర్శనం ఓ మరువలేని జ్ఞాపకంగా మదిలో చిరస్థాయిగా నిలిచి.నట్టే.

కామెంట్‌లు లేవు: