1, జులై 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*424 వ రోజు*


*సోమతీర్థం*


తరువాత బలరాముడు సోమతీర్ధముకు వెళ్ళాడు. అక్కడ సోముడు రాజసూయయాగం చేసాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుడు షణ్ముఖుని దేవసేనకు అధిపతిగా అభిషిక్తుడిని చేసాడు. ఆ తరువాత షణ్ముఖుడు తారకాసురుడిని సంహరించాడు. పరమేశ్వరుడు ఒకసారి తన రేతస్సును దేవతల కోరిక మీద అగ్ని ఆ తేజస్సును భరించ లేక బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రాహ్మ ఆ తేజస్సును గంగా నదిలో దాచమని చెప్పాడు. గంగానది కూడా ఆ తేజస్సును భరించలేక హిమాలయాల మీద ఒక తటాకంలో రెల్లు పొదలలో ఉంచింది. అప్పుడు కుమార జననం జరిగింది. అప్పుడు అతడికి కృత్తికలు ఆరుగురు తమ పాలు ఇచ్చి పోషించి కుమారుడికి తల్లులు అయ్యారు. బృహస్పతి స్వయంగా కుమారునికి జాతకకర్మలు గావించాడు. ఒక రోజు పరమశివుడు పార్వతి సమేతుడై, రుద్రగణాలతో అక్కడకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దిక్పాలకులు, మరుత్తులు, పితృగణాలు అక్కడకు వచ్చారు. అప్పుడు శివుడు అక్కడ తాను, పార్వతీ, గంగ, అగ్ని ఉన్నారు కదా కుమారుడు ముందు ఎవరికి ముఖ్యత్వం ఇస్తాడు అనుకున్నాడు. అలాగే మిగిలిన వారు అలాగే అనుకున్నారు. వారి మనోగతం తెలుసుకున్న కుమారుడు నాలుగు రూపాలతో వారి వద్దకు వెల్లాడు. పరమ శివుడు బ్రహ్మను చూసి " దేవా ! మహా తేజశ్వి అయిన ఈ కుమారునికి తగిన పదవిని మీరే నిర్ణయించండి " అన్నాడు. బ్రహ్మ " మహాదేవా ! ఇతడు దేవతల హితం కోరే వాడు కనుక ఇతడికి దేవ సైన్యాధిపత్యం ఇవ్వండి " అన్నాడు. అక్కడి వారంతా బ్రహ్మదేవుడి మాటకు ఆమోదం తెలిపారు. అందరూ సరస్వతీనదీ తీరం చేరి షన్ముఖుడిని బంగారు సింహాసనం మీద కూర్చుండ పెట్టి బృహస్పతి హోమ కార్యం నిర్వహిస్తుండగా దేవసేనకు అభిషిక్తుడిని చేసాడు. ఈశానుడు, విష్ణువు అభిషేకద్రవ్యాలను పూర్ణకలశాలను పట్టుకున్నారు. గంధర్వులు, అప్సరసలు మంగళ గీతాలు ఆలపించారు. మహామునులు పుణ్యాహవాచనములు నిర్వర్తించారు. లక్ష్మీదేవి, సరస్వతి, శచీదేవుల ఆశీర్వాదంతో షణుముఖునికి ఇక్కడ అభిషేకం జరిగింది. శంకరుడు , విష్ణువు, దేవతలు తమ బలంలో కొంత భాగాన్ని అతడికి కానుకగా ఇచ్చారు. శంకరుడు ఉదయభాస్కరునితో సమానమైన పతకాన్ని, బ్రహ్మదేవుడు రాక్షస సంహారానికి అవసరమైన శక్తిని, విష్ణువు వనమాలను ఇచ్చాడు. పార్వతీ దేవి మాయని పట్టుబట్టలను ఇవ్వగా, గంగాదేవి ఉజ్వలమైన అమృతమయమైన కమండలం ఇచ్చింది, గురువు దండమును, గరుడుడు నెమలిని, వరుణుడు తామర తూడులను, కుబేరుడు మేకలను, బ్రహ్మ కృషాజినం బహూకరించాడు. అతడి వైభవమును చూసిన ఈశ్వరుడు " ఇతడు తప్పక రాక్షసులను సంహరిస్తాడు " అని అతడికి భూతమయమైన సైన్యాన్ని ఇచ్చాడు. అప్పుడు అందరూ భేరీ నాదం చేస్తూ శంఖనాదం చేసారు. కుమారుడు " మీరు చంపమన్న శత్రువును చంపుతాను " అని వారితో పలికాడు. ఆ తరువాత కుమారుడు దేవతలను తారకాసురుడు బాధించడం తెలుసుకొని తారకారురుడిని శక్తిఆయుధ ప్రయోగంతో ససైన్యంగా సంహరించాడు. ఆ తరువాత లోక కంటకుడైన బలిచక్రవర్తి కుమారుడైన బాణుడిని తన శక్తిఆయుధముతో సంహరించి ముల్లోకాలకు శాంతి కలిగించాడు.


*అగ్ని తీర్థం*


సోమతీర్థం నుండి బలరాముడు అగ్ని తీర్థం వద్దకు వెళ్ళాడు. ఇక్కడ " భృగు శాపానికి గురి అయిన అగ్నిదేవుడు అలిగి ఇక్కడ ఉండగా దేవతలు అతడిని బుజ్జగించి సర్వ భక్షకుడివి కమ్మని భృగువు ఇచ్చిన శాపం జరిగినా ఏది భక్షించినా అగ్ని పవిత్రత చెడదని వరమిచ్చారు. అగ్ని సంతసించి తిరిగి తన విధి నిర్వహణకు పూనుకున్న ప్రదేశం ఇదే. అందు వలన ఈ ప్రదేశానికి అగ్నితీర్థం అనే పేరు వచ్చింది. బలరాముడు ఆ తరువాత కుబేర తీర్ధానికి వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: