1, జులై 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -287*

 *తిరుమల సర్వస్వం -287*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-2


చరిత్ర లభ్యమైనంత వరకూ - వేంకటేశుణ్ణి తమ ఇలవేల్పుగా భావించి, అనేక కానుకలు సమర్పించి, తిరుమల ఆలయ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన హైందవ పాలకులు, భక్తులలో బాణులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ, సాళువ, తుళువ, అరవీడు వంశీయులు; యాదవరాజులు, మరాఠా ప్రభువులు, కర్నాటకాన్ని పాలించిన హోయసలులు, మైసూరు ఒడయార్లు; ఉత్తరభారతావనికి చెందిన మహంతులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ హైందవ రాజవంశీయులే కాకుండా - అన్య మతస్తులైన గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబులు, మొగలుల వంటి మహమ్మదీయ పాలకుల; ఈస్టిండియా కంపెనీ, బ్రిటీషు ప్రభుత్వం, ఫ్రెంచి వారు వంటి క్రైస్తవ పాలకుల ప్రత్యక్ష, పరోక్ష ఏలుబడిలో కూడా తిరుపతి - తిరుమల ప్రాంతాలు, ఆలయం చాలాకాలం మనుగడ సాగించాయి. అయినప్పటికీ, ఆ స్వామి కృప వల్ల, తిరుమల - అనేక ఇతర హైందవాలయాల వలె - మతఛాందస ముష్కరమూకల దాడికి గురి కాలేదు. శిల్పసంపద చెక్కు చెదరలేదు. దేవాలయాల విధ్వంసమే జీవితధ్యేయంగా పెట్టుకున్న ఔరంగజేబు లాంటి మతోన్మాది కూడా ఈ ఆలయం జోలికి వచ్చే సాహసం చేయలేదు. అడపా దడపా చిన్నా, చితకా దాడులు జరిగినా - స్థానిక పాలకుల, అర్చకుల, భక్తుల తెగువ, సమయస్ఫూర్తి వల్ల ఆలయం, ఆనందనిలయుడు - ఇరువురూ పదిలం గానే ఉన్నారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప - భక్తజనసందోహం, వార్షికాదాయం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 


పరాయి పాలకులు హుండీ ఆదాయం పైనే ప్రముఖంగా దృష్టి సారించారు కానీ; భక్తజనాగ్రహానికి వెరచి స్వామివారి స్థిర చరాస్తులను, ఆలయ మర్యాదలను మాత్రం భద్రంగానే ఉంచారు. తిరుమల - తిరుపతి క్షేత్రాలలో మతమార్పిడులను ప్రోత్సహించ లేదు. అప్పట్లోనే ఆలయానికి ఉన్న విశేష జనాదరణే దీనికి కారణం. ఎవరి పాలనలో ఉన్నా - వారు హైందవులైనా, ఇతరులయినా - స్వామివారి వైదిక కైంకర్యాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘనత శ్రీవారికే గాక, వారి కైంకర్యపరులు, భక్తబృందం మొదలైన వారందరికీ దక్కుతుంది. ఇన్ని వందల ఏళ్ళ పాటు నిర్విరామంగా, ఆగమశాస్త్ర బద్ధంగా సేవలు కొనసాగిన మరో హైందవాలయం బహుశా చరిత్రలో లేదేమో! అయితే, కొందరు హైందవేతర పాలకులు మిగులు ఆదాయాన్ని పెంచుకునే నిమిత్తం క్షేత్రంలో అనాదిగా జరుగుతున్న ఉత్సవాల పరిధిని, ప్రాభవాన్ని; అన్నప్రసాదాల పరిమాణాన్ని; భక్తులకు ఉచితంగా కల్పించే అనేక సౌకర్యాలను కుదించడం మాత్రం విస్మరించలేని వాస్తవం. 


తిరుమల ఆలయం అన్యమతస్తుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా, ఇతర దేవాలయాల మూర్తులను కూడా సంరక్షించింది. ఆ వివరాలు మున్ముందు శ్రీవారి ఆలయం వైశిష్ట్యం అనే అధ్యాయంలో తెలుసుకుందాం.


వికటగిరీం

➖➖➖➖


చరిత్రకు అందనట్టి ప్రాచీనకాలం నుండి తిరుమల క్షేత్రం వివిధ నామాంతరాలతో పిలువబడుతూ, ప్రఖ్యాత వైష్ణవక్షేత్రంగా రాణిస్తోంది. చతుర్వేదాల్లో కెల్లా ప్రాచీనమైన ఋగ్వేదం లో తిరుమల క్షేత్రం వికటగిరీం అని సంస్కృతభాషలో ప్రస్తావించ బడింది. వేదాలు అపౌరుషేయాలు కావున ఋగ్వేదం ఏనాటిదో నిర్థారించలేము కానీ, సుమారు పదివేల సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనదని చరిత్రకారులు భావిస్తారు. తిరుమల క్షేత్రం అత్యంత (పదివేల సంవత్సరాలకు పైగా) పురాతనమైనదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇక, పురాణేతిహాసాలను ప్రాతిపదికగా తీసుకుంటే - అనేక పూర్వయుగాలు, కల్పాలు, మన్వంతరాల నుండి కూడా తిరుమలక్షేత్రం జగజ్జేగీయమానంగా వెలుగొందుతూ, మానవాళితో బాటు దేవతలు, దానవులు, యక్షకిన్నెర కింపురుషులు సహిత సమస్త చరాచరజీవులకు ఐహికాముష్మికానందాలను ప్రసాదిస్తోంది.


వేదాలతో బాటుగా, హైందవసంస్కృతికి ఆలంబనగా నిలిచే అష్టాదశ పురాణాలలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన కానవస్తుంది. ఇంతే కాక - కొన్ని రామాయణ, మహాభారత గ్రంథాలలో కూడా తిరుమలక్షేత్రం ఉటంకించబడినట్లుగా కొందరు చెబుతారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: