26, నవంబర్ 2025, బుధవారం

సంపూర్ణ మహాభారతము

 🔯

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            5️⃣6️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


*సంపూర్ణ మహాభారతము*        

            *56 వ రోజు*

                   

   *నకులుని జైత్రయాత్ర*```


నకులుడు పశ్చిమదిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాద పూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు.```


*రాజసూయ యాగం ఏర్పాట్లు* ```


భీమసేనుడు,అర్జునుడు,సహదేవుడు,నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు,వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయయాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో “కృష్ణా! నీ దయ వలన సార్వభౌమత్వం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు” అన్నాడు.  


శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “ధర్మరాజా! నీవు రాజసూయయాగం ప్రారంభించు, అందుకు నీ ఇష్టమైన పనికి నన్ను,నీ ప్రియంకోరే ఇతరులను అనుమతించు” అన్నాడు. 


శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు  రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేసాడు. నానా దేశాధీశులకు ఆహ్వానం పంపాడు. ఆహారధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయయాగానికి విచ్చేసారు. వచ్చినవారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేసాడు. అందరికి దానధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, 

సకల వస్తు వ్యయమునకు విదురుని, నానాదేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యోధనుడిని నియోగించాడు. శుభముహూర్తములో ధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగానూ, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగానూ, సుసాముడు సామవేదఋత్విక్కుగానూ, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగానూ నారదాది మహర్షులు సదస్యులుగానూ భీష్ముడు సహాయకుడుగానూ ఉండగా యాగం మొదలైంది.```


           

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: