గీతా మకరందమ్
ఓం శ్రీ మాత్రేనమః
1-12-25
గీతా శాస్త్రము విశ్వశాంతి పథమౌ కీర్తి ప్రధానమ్ముగా
గీతాచార్యుని వాక్కు ధర్మయుతమై గీర్వాణికిన్మోదమై
చేతో మోదము నంది సద్గతుల సౌశీల్యార్థ శ్రేయస్కర
ఖ్యాతిం గూర్చుచు నుండు ధర్మ హితమై కర్మ ప్రధానార్థమై
గీతా తత్త్వము విశ్వమార్గ గమన క్షేమంపు మూలమ్ము సం
ప్రీతిన్ గూర్చుచు నుండు నధ్యయన సంవేద్యంపు సంస్కారముల్
చేతమ్మందున నిల్వ చేతలవి సౌశీల్య ప్రధానమ్ములై
ఖ్యాతింగూర్చును జన్మసార్థకముగా కల్మిన్ ప్రసాదించుచున్
శ్రీ కృష్ణుండు జగద్గురుండు జనులన్ శిష్ట ప్రధానమ్ములౌ
ధీకృత్యమ్ముల సారముం దెలియ నుద్దీపించె ధర్మంపుదౌ
ఆకారమ్మును గాంచ గల్గుటకు నయ్యైరీతులన్ కర్మలున్
సాకల్యమ్ముగ నందజేయు ఫలముల్ స్వాంతమ్ము గాంచం గనన్
గీతాపఠనము జనులకు
గీతామృత ధారలరసి క్షేమమ్మొందన్
చేతములందున ధర్మపు
చాతుర్యము గల్గ జేయు సంపత్కరమై
ప్రణుత గీతయే చక్కని పాడి యావు
పార్థుడను వత్స నాశించి వాసుదేవు
డరసి పితుకగ భక్తుల కమృత ధార
లొరసి వెలసెను ఉపనిషద్వర సువిద్య
మిత్రులందరికీ గీతా జయంతి సందర్భంగా
శుభాకాంక్షలూ నమస్సు లతో
మీ
డా.రఘుపతి శాస్త్రుల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి