*గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు*
*గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్*
*గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*
*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||*
మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు.
శ్లో𝕝𝕝 సర్వోపనిషదో గావో
దోగ్ధా గోపాలనందనఃl
పార్థో వత్సః సుధీర్భోక్తా
దుగ్ధం గీతామృతం మహత్ ||
తా𝕝𝕝 సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాడు.
అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు.
సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత.
పుట్టుక నుంచి మరణం వరకూ జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత. భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న ఉండదు.
కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం ద్రవించి...కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞాన బోధ భగవద్గీత.
మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని అంటారు.
మహా భారతంలో భగవద్గీత ఓ భాగమైననప్పటికీ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో పురాణేతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు ..జీవితానికి అర్థం, పరమార్థం అర్థమవుతుంది.
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’ క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు కృష్ణ పరమాత్ముడు.
త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది.
భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్లే
మోక్ష పధానికి 18 మెట్లు, వాటికి 18 పేర్లున్నాయి.
అవి…
1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.
ఎవరైతే మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.
ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు.
శ్లో𝕝𝕝 భారతామృత సర్వస్వం
విష్ణువక్త్రాద్వినిస్సృతం
గీతా గంగోదకం పీత్వా
పునర్జన్మ న విద్యతే ||
తా𝕝𝕝 గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండగా భారతమునందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? గంగానది విష్ణుపాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి. అందువలన ఈ రెండూ ప్రతి మానవునకు పవిత్రములే.
గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి.
గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
నిష్కామ కర్మ, స్థితప్రజ్ఞత, స్వధర్మాచరణ, కర్తవ్య పాలన—
స్థూలంగా భగవానుడు కురుక్షేత్రం లో అర్జునునకు "భగవద్గీత" గా బోధించినది ఇదే. ప్రతి మానవుడు ఆచరించవలసిన ఉత్తమ సూత్రాలు ఇవి.
కష్టములకు కృంగిపోక, సుఖములు బడయునపుడు పొంగిపోక, నేను చేయు కర్మలకు నేను నిమ్మిత్త మాత్రుడను, సర్వం భగవదర్పణం అని భావించాలి. దీనివల్ల చిత్తశాంతి లభిస్తుంది. ఇదే స్థితప్రజ్ఞత అంటే.
గుణరహితమైనను స్వధర్మమునే ఆచరించవలెను. పరధర్మమును ఆశ్రయించ రాదు అని భగవద్గీత చెప్తుంది.
సమాజంలో ఎవరికి నిర్దేశించిన కర్మలు వారు నిష్టతో చెయాలి. ధర్మ మార్గంలో చిత్తశుధ్ధితో చేసే కర్మలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. నిర్వర్తించే కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా, కేవలం నిమిత్తమాత్రుడనని తలిచి చేసే కర్మలు చిత్తశాంతిని కలిగిస్తాయి. ఫలితం ఆశించనప్పుడు ఆశాభంగం కలిగే అవకాశమే ఉండదు. ఇదే నిష్కామ కర్మ అంటే. దీనివల్ల వ్యక్తులు, సమాజం, పూర్తిస్థాయిలో కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు.
శ్లో𝕝𝕝 మలినే మోచనం పుంసాం
జలస్నానం దినే దినేl
సకృద్ గీతామృతస్నానం
సంసారమలనాశనమ్ ||
తా𝕝𝕝 ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును.
కానీ పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసినవాడు సంసారమాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు. అని గీతామహాత్మ్యము తెలిపినది.
స్నానం చెయ్యడం వల్ల శరీరం పైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది.
విజ్ఞులు, బుధజనులు పెద్దలు ఏది చేస్తే అందరూ దానినే పాటిస్తారు. అందుకే మానవుడు ఎప్పుడూ ఆదర్శప్రాయమైన సత్కర్మలనే ఆచరించాలి.
ఇవన్నీ పాటిస్తే జీవితం సుఖమయం అవుతుంది. జీవితం ఆదర్శప్రాయం అవుతుంది. ఒడిదుడుకులు లెకుండా ప్రశాంతమైన జీవన గమనం సాధ్యం అవుతుంది. అరిషడ్వర్గాలను జయించే శక్తి లభిస్తుంది. అరిషడ్వర్గాలను జయిస్తే, చక్కని జీవన విధానం సొంతం అవుతుంది. భగవానుడు తన భక్తుల నుండి ఆశించినది ఇదే.
శ్లో𝕝𝕝 గీతా సుగీతా కర్తవ్యా
కిం అన్యైః శాస్త్ర విస్తరైఃl
యా స్వయం పద్మనాభస్య
ముఖపద్మాద్ వినిర్గతాll
తా𝕝𝕝 భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున, మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన, స్మరణముల ద్వారా సాధన చేసిన చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుట వలన వేదవాజ్ఞ్మయమును పఠింపలేరు. వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును.
"గీతా” శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను” అని భగవానుడు అర్జునుడితో చెప్పినదాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.
ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది "శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం.
కృష్ణం వందే జగద్గురుమ్...🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి