*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*షష్టాశ్వాసం ప్రధమ భాగం*
*577 వ రోజు*
*పరిక్షార్ధం సులభ వాదన పొడిగించడం*
సులభ " మహారాజా ! నీకు నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావు. అది ఒక మానసికరుగ్మత కనుక నీ బంధువులకు చెప్పి వైద్యం చేయించు. లేకున్న నాకిలా నీతులు చెప్పవు. ఇవన్నీ విన్న తరువాత కూడా నీవు నేను ఎందుకు ముక్తుడను కాను అని అడిగిన నేను చెప్పే సమాధానము విను. రాజువైన నీవు సదా ధర్మార్ధ కామాల గురించి ఆలోచిస్తూ రాజ్య తంత్రముల గురించి ఆలోచిస్తూ ఉంటావు. మేలుకొనమని, స్నానాదులు చెయ్యమని, భోజనం చెయ్యమని సేవకులు చెప్పిన కాని వినవు. నీ చుట్టూ ఉన్న మంత్రులు, సామంతులు, సుందరీ మణులు నీ మెప్పును ఆశిస్తూ నీ పనులను నిన్ను చేసుకోనివ్వరు. నీకు ఏ పని చెయ్యడానికి స్వతంత్రం ఉండదు నీకు నచ్చిన భోజనం కూడా నీ అంతట నిన్ను తిననివ్వరు. నీవు అర్హత అనర్హత తెలుసుకుని దానం చెయ్యాలి. కనుక ధనం ఎలా కూడబెట్టాలో ఆలోచన చేస్తూ ఉండాలి. నీ పక్కనే ఉంటూ గోతులు తవ్వే వారిని సదా ఒక కంట కనిపెట్టే ఉండాలి. కనుక రాజా ! రాజులకు సుఖాలు తక్కువ దుఃఖాలు తక్కువ. అలాంటి రాజులు ముక్తి మార్గంలో ఎలా ప్రయణించగలరు. కనుక నువ్వు ముక్తి మార్గంలో పయనిస్తున్నానని చెప్పడం అబద్ధం. రాజా ! పంఛశిఖ మహర్షి వద్ద ఉపదేశం పొందిన నీవు నేను నీ దగ్గరకు రాగానే అసహ్యించుకున్నావు. ఇదేనా ద్వందమును వదిలి ముక్తి మార్గంలో ప్రవర్తించే యోగులు ఆచరించే విధానం. మోక్షాసక్తుడు ద్వందమును వదలాలి, దేనియందు ఆపేక్ష లేక నిర్వికారంగా, చెలించని మనసుతో ఉండాలి. యతులు జనావాసాలను వదిలి అరణ్యవాసం చేయాలి. నీవు ముక్తుడవని పొరపాటు పడి నిర్వికారుడవని అనుకుని నీ మనస్సులో ప్రవేశించాను. నేను నిన్ను నా అవయములతో ముట్టుకోలేదు అయినా నీవు నన్ను చూసి భయపడి దూషించావు. అలా ఎందుకు చేసావు ? రాజా ఈ సభలోని పెద్దలు వింటూ ఉండగా నీవిలా మాట్లాడడం న్యాయమా ! ఎదుటి వారిని ఇలా కించపరచడం ధర్మమా ! అత్యంత గోప్యమైన స్త్రీ పురుష సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడటం మీ కీర్తికి, గొప్పతనానికి హాని కదా ! ఇది ధూర్తలక్షణం కాదా ! మహారాజువైన నీకు ఇలాంటి నికృష్టులకు కూడా తగని మాటలు తగునా ! తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తున్న నా వంటి యోగిని గురించి తెలుసుకోలేని నువ్వు పంఛశిఖమహర్షి శిస్యుడని చెప్పుకోవడం అబద్ధం కాదా ! రాజా ! నీవు గృహస్థ ధర్మానికి, మోక్షమార్గానికి కూడా దూరం అయ్యి రెండింటికి చెడిన రేవడివి అయ్యావు. అన్ని తెలుసును అనుకుని భ్రమలో పడి బ్రతుకుతూ ఉన్నావు. ముక్తులు ముక్తులు కలవడం సాధారణం. ఆకాశంలో ఆకాశం కలిసినట్లు శూన్యంలో శూన్యం కలిసినట్లు ముక్తి మార్గంలో ఉన్న వారిని చూసినప్పుడు ముక్తిమార్గులు కలిసి పోతారు. యోగినిని అయిన నన్ను నీవు చూసినప్పుడు చలించావు కనుక నీవు ముక్తి మార్గమున చరించడం అబద్ధము. మనము ముక్తులము కాదని అనుకున్నా మన కలయిక అధర్మం కాదు. నేను ప్రశస్తమైన చరిత్ర కలిగిన ప్రధన మహారాజు వంశ సంజాతని. నేను క్షత్రియ కాంతను. నా పేరు సులభ. నా పూర్వీకులు శతశృంగ పర్వతముల మీద ఎన్నో యజ్ఞ యాగములు చేసారు. సాక్షాత్తు దేవేంద్రుడే వారి వద్దకు వచ్చి పరమార్ధము గురించి సద్గోష్ఠి చేసేవాడు. నాకు వివాహం చేసుకోదగ్గ పురుషుడు లభించక మోక్షమార్గంలో పయనిస్తున్నాను. నాను క్షత్రియ వనితను కనుక మన కలయిక అధర్మం కాదు. ఇక దాపరికం ఎందుకు నేను నిన్ను పరీక్షించ వచ్చాను. కాని నీవు ముక్తి మార్గంలో పయనించడం లేదని తెలుసుకున్నాను " అని అనర్గళంగా చెప్పిన సులభ జనకుడి ముఖం చూసి నవ్వుతూ " జనక మహారాజా ! నీవు ముక్తి మార్గంలో పయనిస్తున్నావా లేదా అని పరీక్షించడం అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని పరీక్షించడం వంటిది. నేను కేవలం అజ్ఞానంతో ఇలా ప్రవర్తించానని అనుకో ! జనకమహారాజా ! నీ మాటలలో ఇసుమంతైనా అసత్యం, దోషము లేదు. మునులతో కూడా కీర్తింపతగిన నీకు మోక్షము కరతలామలకం. నేను రాగానే మీరు నన్ను ఎంతో గౌరవించారు. అందుకని మీతో ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో అని హాస్యముకు ఇలామాట్లాడాను. నేను చెప్పినవన్నీ అబద్ధములు నేను నిన్ను పరీక్షించడానికి వచ్చానన్నది మాత్రమే నిజం. సౌజన్య మూర్తులైన మీరంతా నన్ను మన్నించండి " అన్నది సులభ. ఆ మాటలకు జనకుడు మంత్రులు ఇతర సభికులు తేకగా ఊపిరి తీసుకున్నారు. సులభ వాఖ్చాతుర్యానికి అభినందించారు. ఆరోజుకు సులభ అక్కడే ఉండి మరునాటికి తన దోవన తాను పోయింది " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! జనక సులభల సంవాదనతో నీ సందేహం తీరింది కదా ! " అని అడిగాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి