1, డిసెంబర్ 2025, సోమవారం

వజ్రాన్ని ఎలా

  కళ్ళు లేని గ్రుడ్డి వాడు ధగ ధగ మెరుస్తున్న వజ్రాన్ని ఎలా చూస్తున్నాడు?

చేతికి వేళ్ళు లేని వాడు ఆ వజ్రపుటుంగరాన్ని ఎలా ధరిస్తున్నాడు. 

మెడ (neck) భాగము లేని వాడు మాలలను ఎలా ధరిస్తున్నాడు. 

నాలుక లేనివాడు ఆ మణిని ఎలా ప్రశంసించుకున్నాడు.  


ఇది సాధ్యమా?


*అంధో మణిమ విందత్ |

తమనంగులి రావయత్ |

అగ్రీవః ప్రత్యముంచత్ |

తమజిహ్వా అశశ్చత |* (అరుణ ప్రశ్న 1–11[52])


అవును ఇది ఆ పరమాత్మ కే సాధ్యం. 


ఆ పరమాత్మ 


*అజాయమానో బహుధా విజాయతే*

పుట్టుకే లేని ఆ పరమాత్మ అనేక జన్మలను ఎత్తెను.


*సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షస్సహస్ర పాద్*

సర్వ ప్రాణుల శిరస్సులు, కళ్ళు, కాళ్ళు తన దేహమునందు అంతర్భూతము లగుటచే విశ్వరూపుడగుచున్నాడు. 



*విశ్వతశ్చక్షు రుత విశ్వతో ముఖో 

విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్*


సర్వవ్యాపక బ్రహ్మస్వరూపాన్ని, అంటే అన్ని దిక్కులలో కళ్లుగా, ముఖాలుగా, చేతులుగా, పాదాలుగా ఉన్న పరమాత్మను సూచిస్తున్నాయి. పరమాత్మ సర్వ వ్యాపి. 


అదే విధంగా అశరీరుడయిన ఆ పరమాత్మ సర్వ ప్రాణుల కళ్ళ ద్వారా తనకు కళ్ళు లేకపోయినా (అంధుడయినా) చూడగలుగుతున్నాడు. పరమాత్మకు శరీర అవయములు లేకపోయినా సర్వ ప్రాణుల శరీర అవయవముల ద్వారా ఉంగరములు, మాలలు మొదలయైన ఆభరణములను ధరిస్తున్నాడు. ఆ పరమాత్మకు నోరు లేకపోయినా సర్వ ప్రాణుల నోటి ద్వారా మాట్లాడుతున్నాడు.


అచేతా యశ్చ చేతనః 

సతం మణిమ విందత్

సోనంగులి రావయత్

సోగ్రీవః ప్రత్యముంచత్

సో జిహ్వో అశశ్చత (అరుణం 1–11[53])


సః – ఆ పరమాత్మ (తనకు కళ్ళు లేకపోయినా) సర్వ ప్రాణుల కళ్ళ ద్వారా మణిని చూచెను. ఆ పరమాత్మ (తనకు అవయవాలు లేకపోయినా) సర్వ ప్రాణుల శరీర అవయవాల ద్వారా ఆభరణాలు ధరించెను. ఆ పరమాత్మకు వాక్కు లేకపోయినా సర్వ మానవుల నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు.

కామెంట్‌లు లేవు: