1, డిసెంబర్ 2025, సోమవారం

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

  🌹అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 


అళికము అంటే నుదురు.


అమ్మ నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నదట.

నెలలో రెండు పక్షాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని. ఒక్కొక్క పక్షానికి పదిహేను తిథులు. వాటిని మనం వరుసగా వ్రాస్తే ఇలా ఉంటాయి.

శుక్లపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి

అష్టమి

నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి.

అలాగే కృష్ణపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి

అష్టమి

నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య

రెండుపక్షాల్లోనూ కూడా అష్టమి మధ్యన వస్తుంది. అటు ఏడు తిధులు, ఇటు ఏడు తిధులు.

కళాతు శోడశో భాగః అని నిర్వచనం ప్రకారం కళ అంటే పదహారవ వంతు.

మరి తిథులు పదిహేనే కదా అనవచ్చును మీరు.

పౌర్ణమి చంద్రుణ్ణి షోడశకళా ప్రపూర్ణుడు అంటారు. అంటే నిండా పదహారు కళలూ ఉన్నవాడు అని. పౌర్ణమి నుండి ఒక్కొక్క తిథినాడూ ఒక్కొక్క కళ తగ్గుతుంది. అమావాస్య నాటికి ఒక్క కళ మిగులు తుంది. లేకపోతే కళలన్నీ నశించటం అంటే చంద్రుడే లేక పోవటం కదా! అందుకని అమావాస్యకు సున్నా కాదు ఒక్క కళ అన్నమాట. ఆనాటి నుండి ప్రతి తిథికి ఒక్కొక్క్ కళ చొప్పున పెరిగి మరలా పౌర్ణమి నాటికి పదహారుకళలూ పూర్తిగా సంతరించుకుంటాడు చంద్రుడు.

ఈ కళలకు విడివిడిగా పేర్లూ ఉన్నాయి. వాటికి అధిష్ఠాన దేవతలూ ఉన్నారు!


ఈ కళాదేవతలకు నిత్యలు అని పేరు. ఈ షోడశ నిత్యల నామధేయాలూ చూదాం.


కామేశ్వరి

భగమాలిని

నిత్యక్లిన్న

భేరుండ

వహ్నివాసిని

మహావజ్రేశ్వరి

శివదూతి

త్వరిత

కులసుందరి

నిత్య

నీలపతాక

విజయ

సర్వమంగళ

జ్వాలామాలిని

చిత్ర

శుక్లపక్షంలో పాడ్యమి నుండి ఆరోహణ క్రమంలో కామేశ్వరి నుండి చిత్రవరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అవరోహణ క్రమంలో చిత్ర నుండి కామేశ్వరి వరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

రెండు పక్షాల్లోనూ కూడా అష్టమి నాటి నిత్యాదేవత పేరు త్వరిత.

పదహారు కళలూ అని చెప్పి నిత్యాదేవతలను పదిహేను మందినే చెప్పారేం అని మీరు ప్రశ్న వేయవచ్చును. పదహారవది ఐన కళ పేరు మహానిత్య. ఇది సర్వకాలమూ ఉండే కళ. ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతను చెప్పలేదు.

అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిని పోలి ఉంది అని చెప్పారు కదా. ఇందులో విశేషం ఏమన్నా ఉందా అని అలోచిద్దాం.

వికాసదశ ఐన శుక్లపక్షంలోనూ క్షీణదశ ఐన కృష్ణపక్షంలోనూ కూడా అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు. అధిష్ఠాత్రి త్వరితా నిత్య. 

సంతోషమూ వ్యసనమూ వలన బేధం లేని లలాటం అమ్మది అని అర్థం. ఏవిధమైన పరిణామబేధమూ లేనిది అన్నమాట.

అమ్మ ముఖం పూర్ణచంద్ర బింబం.

అమ్మ లలాటం అర్థం చంద్రబింబం.

తిథులలో ప్రతి పగటికీ రాత్రికీ కూడా విడివిడిగా సంకేత నామాలున్నాయి. శుక్లపక్షం అష్టమి రాత్రికి పేరు ఆప్యాయ. అంటే శ్రీదేవీ అమ్మవారి లలాటం ఆప్యాయత కురిపించేదిగా ఉన్నదని భావం.

ఇక్కడ ఒక సమయమత రహస్యం ఉంది. అమ్మముఖం పూర్ణచంద్ర బింబం. శరీరాంతర్గత పూర్ణచంద్రస్థానం సహస్రారం. అక్కడ సాధకుడికి అమృతసిధ్ధి.

అమ్మవారి లలాటం పైన అంతర్దృష్టి నిలిపి ధ్యానం చేస్తే అష్టమీ చంద్రదర్శనం. అంటే సగం దూరం అతిక్రమించి వచ్చేయటమే యోగంలో అన్నమాట.

ఇది సులభోపాయం. ఇదే రహస్యం

సామాన్యులకు ఐనా సరే అమ్మ ముఖదర్శనమే త్వరితఫలదాయక మని గ్రహించాలి. సమస్త కామితములూ అమ్మ ముఖాన్ని మానసికంగా ధ్యానంలో దర్శించితే చాలు అవి వెంటనే ఫలిస్తాయని ఆశీః పూర్వకమైన సందేశం.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

కామెంట్‌లు లేవు: