*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*షష్టాశ్వాసం ప్రధమ భాగం*
*580 వ రోజు*
*ఆశ్రమధర్మాల అవసరం*
శుకుడు " జనకమహారాజా ! మీరు చెప్పినది సాధారణ బ్రాహ్మణుడికి వర్తిస్తుంది. ప్రజ్ఞకలిగి జ్ఞానోదయమైన వాడికి ఈ మూడు ఆశ్రమములతో పని ఏమిటి ? జ్ఞానదృష్టితో బ్రహ్మపదము గురంచి ఎరిగిన వానికి ఈ మూడు ఆశ్రమధర్మాచరణ అవసరమా ! ఈ విషయమై వేదములు ఏమి వివరిస్తున్నాయి ! " అని అడిగాడు. జనకుడు " నీవన్నట్లు జ్ఞానము విజ్ఞానము మోక్షసాధనములు. వాట్ని గురుముఖతః నేర్చుకోవాలి. వాటి వలన ముక్తి పొంద వచ్చు. జీవుడు చివరిగా జ్ఞానవిజ్ఞానాలను కూడా వదిలి వేస్తాడు. పూర్వము ఋషులు, మనుజులు, ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవడానికే ఈ నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆశ్రమాలు సక్రమంగా పాటించిన వాడు ముక్తి పొందడం తధ్యం. అలా కాకుండా పూర్వజన్మ పుణ్యము వలన జ్ఞానోదయమైన వాడు ఈ మూడు ఆశ్రమాలు వదిలి బ్రహ్మచర్యం వలన ముక్తిని పొంద వచ్చు. అతడు త్రిగుణాతీతుడై కలిగి బ్రహ్మచర్యంలో ముక్తి పొందకలిగిన వాడికి ఈ మూడు ఆశ్రమాలతో పని లేదు. మానవుడు ముక్తి పొందాలంటే సత్వమార్గము అవలంబించాలి. లేకున్న అది అసాధ్యము. ఈ విశ్వం తన అందు ఉన్నట్లు తాను విశ్వం అందు ఉన్నట్లు తలచిన వాడు ముక్తి పొందుతాడు. యయాతిమహారాజు " జ్యోతిస్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు అని తెలుసుకుని ముక్తిని పొందాడు. ఇది తెలుసుకున్న మునులు తమవలన పరులకు పరుల వలన తమకు భయంలేకుండా బ్రతకగలడు. అప్పుడతడు ముక్తి పొందగలడు. నాకు అది కావాలి, ఇది వద్దు అని తలపక సకల ప్రాణుల అందు సమదృష్టి కలిగి, కోరికలను వదిలి పెట్టి, పరులకు కీడు తల పెట్టని మానవుడు ముక్తి పొందగలడు. దృశ్యములందు, శబ్ధములందు సమదృష్టి కలిగి విషయములలో లీనం కాకుండా, రాగద్వేషములు, సుఖ దుఃఖముల అందు ప్రభావితం కాకుండా జీవించ కలిగిన మానవుడు ముక్తిని పొందగలడు. ఇనుమును, బంగారమును, నిందను, స్తుతిని సమంగా భావించేవాడికి తాబేలు తన డిప్పలోకి తాను ముడుచుకున్నట్లు ఇంద్రియములను తనలోనికి లాగగలిగిన వాడికి ముక్తి తప్పక లభిస్తుంది. నేను చెప్పిన విషయాలు నీ తండ్రి దయవలన నీకు ప్రాప్తించాయి. నేను చెప్పినదాని కంటే నీకు తెలిసినది ఎక్కువ. బాల్యచాపల్యము వలన, నీ భావనలో సందేహములు, భయములు ఉండటం వలన నీవు సర్వజ్ఞుడన్న విషయము నీవు ఎరుగక ఉన్నావు. జ్ఞానము స్మగ్ర రూపం తాల్చినప్పుడే మోక్షము సిద్ధించగలదు. కనుక నీవు దృఢసంకల్పంతో పరిపూర్ణత సాధించు. నీకిక కొరత లేదు. మోక్షం తప్పక సిద్ధిస్తుంది. నీ సంశయములు వదిలి పెట్టు. పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో అదే నీ శాశ్వత స్థానం " అని జనకుడు శుకుడికి జ్ఞానబోధ చేసాడు. జనకుడి జ్ఞాన బోధలతో శుకుడు సంశయములు తీరి తానెవరో తెలుసుకుని తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడు.
*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*
సంశయరహితుడై శుకుడు వాయువేగ మనోవేగాలతో తండ్రి అయిన వ్యాసుని చేరడానికి హిమాలయాల వైపు బయలు దేరాడు. వ్యాసుడు తన శిష్యులైన సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అనే వారితో వేదాధ్యాయనం చేయిస్తున్నాడు. శుకుని చూసిన వ్యాసుడు సంతోషించాడు. శుకుడు తండ్రి పాదములకు నమస్కరించి కూర్చున్నాడు. తనకు జనకుడికి జరిగిన సంభాషణ సారమును వివరించాడు. వ్యాసుడు శుకుని కూడా తన శిష్యులతో చేర్చి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఒక రోజు వ్యాసుడి శిష్యులు వ్యాసుడితో " గురువర్యా ! వేదాధ్యయనంలో మేము అయిదుగురిమే ఈ లోకంలో అందరికన్నా మిన్నగా ముందుండాలి. మమ్మల్ని మించి ఇంకెవరికి వేదం చెప్పకూడదు. ఇలా మాకు వరం ప్రసాదించండి " అని కోరాడు. వ్యాసుడు " ఆసక్తి కలిగిన బ్రాహ్మణ కుమారులకు వేదవిద్య నేర్పిన వాడికి బ్రహ్మపదము కరతలామలకము. ఈ మాట మీరు వినలేదా ! ప్రతివాడు కష్టములు అనుభవించిన తరువాత సుఖము అనుభవిస్తాడు. మానవుడు ఎన్నటికీ స్వార్ధపూరితుడు కాకూడదు. కనుక ఇటువంటి కోరిక మీకు ధర్మంకాదు " అన్నాడు. ఆ మాటలు విన్న శిష్యులు ఒకరిని ఒకరు చూసుకుని " గురువర్యా ! మీరు మమ్ము ఇక్కడే ఉంచితే అది ఎలా సాధ్యం ఔతుంది. మేము పర్వతశిఖరం దిగి ఆసక్తులైన వారిని వెతికి పట్టుకుని వారితో వేదాధ్యయనం చేయించమంటారా ! వారితో యజ్ఞయాగములు చేయించమంటారా " అని అడిగారు. వ్యాసుడు " శిష్యులారా ! మీరు ఇది చెప్పడానికి ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం అవసరమా ! మీరు పర్వతశిఖరములు దిగి జనావాసాలకు వెళ్ళి విద్యాదానం చేస్తానంటే నేను కాదనగలనా ! " అని వాత్సల్యంగా అన్నాడు. శిష్యులు వ్యాసుడి కాళ్ళ మీద సాంష్టాంగ పడ్డారు. వ్యాసుడు వారిని లేవనెత్తి దీవించి " ఈ మూడు లోకాలలో మీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా ఉంటూ వేదములను ప్రచారం చెయ్యండి " అన్నాడు. వ్యాసుడి నలుగురు శిష్యులు వెళ్ళగానే వ్యాసుడు తన కుమారుడితో ఆశ్రమంలో ఒంటరిగా మిగిలి పోయాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి