17, సెప్టెంబర్ 2020, గురువారం

*42) కఠోపనిషత్తు*

ఓం నమః శివాయ:

🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

ఇప్పుడు ఆత్మను తెలుసుకొను విధము చెప్పబడుచున్నది.

        పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కలి సూక్ష్మమైనది. మహత్‌ పరిమాణము గల ఆకాశాదికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వవ్యాపకమగుట చేత పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నది. అందుచేత అణువుకంటే అణువుగాను, మహత్తుకంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసికొనటకు ఆ క్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు. ఎందుచేత ననగా వేద విహిత కర్మలను ఫలాపేక్షలేక, ఆచరించువాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు, మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియూ ప్రసన్నముగా నుండును. బాహ్యవిషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలిసికొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందము అనుభవించును.


        ఆత్మ యొక్క విధానమును తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకొనే విధానాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. ‘శ్యామాదికము’ - అనే ఉపమానము వేశారు ఇక్కడ. ‘శ్యామాకాశ్చమే’ - అని నమకం, చమకం అనే రుద్రంలో వస్తుంది. అంటే, అర్థం ఏమిటంటే జడ చేతన సృష్టిలో, జడ సృష్టి అయినటువంటి వృక్షములు ప్రథమ విత్తనము. దాని పేరు శ్యామకము అని పేరు, శ్యామాకాశ్చమే.. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే ‘చామదుంపలు’ అని కూడా అర్థం. అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఉందో, ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. మర్రి విత్తనంలో మర్రిచెట్టు దాగి వుంది. మర్రి విత్తనం ఆవగింజ అంత వుంది. కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగంజంత ఉన్నటువంటి విత్తనం లోపల, అంత పెద్ద మర్రి చెట్టు ప్రావిర్భవింప చేయగలిగేటటువంటి శక్తి ఆ విత్తనంలో ఇమడ్చబడివుంది.


        కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైనది. శక్తి కంటే ఆధారభూతమైనటువంటి చైతన్యము సూక్ష్మము. చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మము. ఆత్మ కంటే పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైనది.
కాబట్టి, ఈ రకంగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయీ భేదములతో... ఇది వివరించ పూన బడుతుంది. ఎంత సూక్ష్మ తరమైతే, అంత వ్యాపక ధర్మాన్ని కలిగి వుంటుంది. ఈ అంశాన్ని మనము వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాము.


        ఉదాహరణ: ఎక్స్‌ రే కిరణాలు మన కంటికి కపపడవు. సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్లుగా తోస్తున్నది. కానీ ఎక్స్‌ రే కిరణాలు కనపడవు. అందువలననే మనిషి ద్వారా అవి ప్రసరింపబడి ఆ ఎక్స్‌ రే ఫిల్మ్‌ తయారౌతుంది. అంటే, కంటికి కనపడనటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ... ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు వున్నాయి. చాలా వలయాలు కూడా వున్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా వున్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపుణ్యము [frequency] వలన మనము ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మం కూడా వుంది.


కాబట్టి ఎలక్ట్రో మేగ్నటిక్‌ ఫీల్డు ని గనక మనం అంటే విద్యుదైస్కాంత తరంగ దైర్ఘ్యములను కనుక మనం ఫ్రీక్వెన్సీ ని గనక మనం డీ-కోడ్‌ చేసినట్లయితే, ఈ సృష్టి యందంతటా వ్యాపకమైనటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఎంతగా స్థూలమైతే, అంతగా పరిమితించబడిపోతున్నావు. ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతూ ఉంటావో అంతగా వ్యాపకత్వాన్ని కలిగివుంటావు.


 “తనను అన్నిటి యందునూ, అన్నిటిని యందునూ తనను దర్శించగలగినటువంటి ధీరుడు ఎవడో వాడు ఆత్మ నిష్ఠుడు” మరియు ప్రాణుల బుద్ధి గుహ
యందు లేక హృదయాకాశము
నందు ఇది వున్నది.
ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయ స్థానము.


అట్టి హృదయము నందు మరల ఆకాశ స్థానము వున్నది. అనాహత శబ్దము నీ యందు ఓంకార శబ్దము, ప్రణవ నాదము, నీ హృదయస్థానము నుంచి ఉత్పన్నమై, నీ శరీరమంతా వ్యాపించి 72 వేల నాడులను శక్తి వంతం చేస్తున్నది. ఏ చోటైతే నాదము యొక్క ఆద్య స్థానము ఉన్నదో, నాదము యొక్క పుట్టుక స్థానము ఉన్నదో అదే హృదయాకాశము. ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొన గలుగుతారో సాధన పూర్వకంగా అనగా అర్థమేమిటి?


        ప్రస్తుతము మనలో ఉన్నటు వంటి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి బహిర్ముఖముగా చైతన్యవంతమై చేతనవంతమై పనిచేస్తున్నవి. అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపముగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నిటినీ ఈ నాడులన్నిటినీ, ఈ అవయవము లన్నిటినీ చేతన వంతముగా చేస్తుంది. ఇవి బహిర్ముఖముగా వ్యవహరిస్తువున్నాయి. ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా విరమించగా... ఎక్కడికి విరమించాలట? తన లోపలికే విరమించాలట. తన లోపలికి అంటే ఎక్కడికి విరమించాలట?

అవి పుట్టేటటువంటి, అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపును మరలించినట్లయితే, నీ దృష్టిని మరలించినట్లయితే, కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రాణమనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, అంటే అర్థం ఏమిటంటే? వీటి యొక్క కదలికలను తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా అవి హృదయస్థానము నుండి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించ గలుగుతావు. అటువంటి గుర్తింపును సాధించడము చాలా ముఖ్యము. దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి. ఆటువంటి ఆత్మను హృదయాకాశంలో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నావట అక్కడ నువ్వు.


 ఆ క్రతువు, ఇది ప్రతి రోజూ చేయవలసినటువంటి క్రతువు. మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము హృదయస్థానములో చేయాలి. తన ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటివిషయములను, తన శబ్దాది విషయములను అన్నిటినీ ఈ క్రతువు నందు హవిస్సులుగా సమర్పించాలి. అనగా అర్థమేమిటి? వాటిని లేకుండా చేయాలి. విరమించాలి. అవి అందులో వ్యవహరించకుండా చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని, విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవరైతే హృదయస్థానంలో చేసి, హృదయాకాశ స్థితిని గ్రహించ గలుగుతాడో అనుభూతం అవ్వాలట.


        నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో, నామరూపాత్మకమైనటువంటి ఏ నేనైతే వుందో ఆ నేను హృదయాకాశ స్థానము నందు లేదు. యథార్థ నేను ఒక్కటే ఉన్నది. అసత్యనేను లేదక్కడ.


ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానంలో చేయగలుగుతారో, ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా చేయగలుగుతారో, ప్రవృత్తి నుండి నివృత్తి దశగా మార్చుకోగలుగుతారో, భయం దిశ నుంచీ, అభయం దిశగా మార్చుకోగలుగుతారో, బంధం నుంచీ మోక్షం దిశగా మార్చుకోగలుగుతారో, ఈ రకంగా ఒక్కొక్కదానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఈ అంతఃక్రతువు, ఈ క్రతువు ఎటువంటిదంటే అంతః క్రతువు, ఇది చేయడం వలన ఫలితం ఏమటండీ? బాహ్యముగా ఏ ఫలితమూ రాదు. బహిర్ వ్యవహారమునందు ఏ ఫలితములు రావు. కాకపోతే ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన నైపుణ్యం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిర్విషయపద్ధతి ఏర్పడుతుంది.


 ఉత్తమమైనటువంటి నిష్కామకర్మ పద్ధతి ఏర్పడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడుతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా. తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికినీ ఉత్తమమే. అంటే ఫుల్‌గా వైబ్రంట్‌ గా వుండడు అన్నమాట. విపరీతంగా వ్యవహార స్థితిలో మునిగి పోయిన స్థితిలో వుండడు వీడు.

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: