17, సెప్టెంబర్ 2020, గురువారం

*మాఊళ్ళో మహాశివుడు*

ఏళ్ల క్రితం బెజవాడ గుళ్లో మొదలుపెట్టిన అర్చకజీవితం పలు ఆలయాలు మారుతూ పదిహేడేళ్ళ క్రితం ఈ అరికమొగల ఊళ్ళోకొచ్చినప్పుడు శివాలయం కమిటీ వాళ్లిచ్చిన జీతం ఐదొందలు మహేశ్వరరావుగారికి..*

*గ్రామస్థులు మర్యాదస్తులు కావడంతోన్నూ, అడపాదడపా పలకరించేవాళ్ళతోన్నూ ఊరితో విడదీయరాని అనుబంధంగా మారింది అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు..*

*ప్రత్యేకంగా యే మాన్యాలంటూ లేని ఆ పాతకాలంనాటి చిన్న శివాలయానికి నిత్య కైంకర్యాల నిమిత్తం ధూపదీపనైవేద్య పథకం కింద ప్రభుత్వం ఇచ్చే అయిదువేల రూపాయలే శరణ్యం గుళ్లో మహేశ్వరుడికి, ఆయన్నే నమ్ముకున్న మహేశ్వరరావుగారికిన్నూ..!!*

*రెండుపూటలా దీపం పెట్టి, అభిషేకం చేసి, స్వహస్తాలతో చేసిన తేలికపాటి నైవేద్యం తృప్తిగా నివేదించి, దర్శనానికొచ్చిన భక్తులకి అర్చనలు చేయిస్తూ కొనసాగిస్తోన్న సామాన్యజీవనమే పరమేశ్వర ప్రసాదితమని మనసారా నమ్మిన అమాయకుడాయన.. ఉన్నంతలో ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిళ్లయ్యాయి.. గొప్పగా కాకపోయినా వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు..*

*బియ్యప్పిండితో గీసిన నిలువుగీతలా పోతున్న అరికమొగల ఊరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో ఏడొందల జనాభాలో 274 కేసులొచ్చాయి..*

*గుడి మూతపడింది.. భక్తులు రావడం మానేశారు..!!*

*ప్రభుత్వం నుంచొచ్చే అయిదువేల రూపాయల నిధులు ఆగిపోయాయి.. కారణమడిగితే తిరుపతి దేవస్థానానికి భక్తులు రాక ఇట్లాంటి చిన్నగుళ్ళకి నిధులు ఆపమన్నారని కబురొచ్చిందట..!!*

*మహేశ్వరరావుగారు నవ్వుకున్నారు.. భక్తితో మారేడుదళం సమర్పించినా చాలంటారుగానీ తన స్వహస్తాలతో ఏదొకటి వండిపెడితేనే తప్ప నైవేద్యం కూడా ముట్టడు ఆ మహాశివుడు..!!*

*ఇంకెక్కడి భుక్తి..??*

*గుడికి జనాలెవరూ రాకపోయినా లోపలున్న లింగానికి ఏకాంతంగానైనా విధిగా నిర్వహించాల్సిన నిత్యపూజలకి లోటు లేకుండా నెట్టుకొస్తున్నాడు..*

*వాటికోసమని వయస్సులో ఉండగా వేలుమీదకొచ్చిన ఉంగరానికి ఇప్పుడు విడుదలొచ్చింది.. కాకుంటే బ్యాంకుకెళ్లింది..!!*

*భార్య ఉండగా బతుకు బాగుండిన రోజుల్లో ముచ్చటపడి చేయించిన గొలుసు కూడా ఉంగరం బాటే పట్టింది..!! భార్యే బ్యాంకుతాకట్టుకి పోతున్నట్టు తను గురైన ఆవేదన గురించి రోజూ పూజలందుకునే శివుడికైనా తెలుసో లేదో..!!*

*ఆ డబ్బులు ఉన్నంత వరకూ సాగాడు.. తర్వాత కమిటీ పెద్దని కలిశాడు..*

*"రాష్ట్రంలో సంవత్సరాదాయం కనీసం 50వేలు కూడా లేకుండా 6(సీ) కేటగిరీలో ఉన్న 6709 చిన్న ఆలయాల్లో మనదొకటి..!!! ఏం చేస్తాం చెప్పండి..?? ఊ ఊ..!!"*

*"శివుడికి, నాకూ కూడా జరుగుబాటు కష్టంగా ఉందండీ.. పెద్దలేమైనా దయతలిస్తే.. "*

*"హమ్మమ్మా అపచారం అపచారం.. మీబోటివారికి గౌరవభత్యం ఇచ్చేంతవాళ్ళమా.. మా దగ్గరేముంటాయండీ పంతులుగారూ.. అసలే కరోనాకాలం.. ఇన్నాళ్లనుంచీ ఆరొందలడబ్భై జనాభా ఉన్న ఈ అరమొదల గ్రామంలో తమతమ శక్తి కొద్దీ సమర్పించుకోగా పళ్లెంలో పడిన చిల్లరంతా మీకేగా..!! కానివ్వండి కానివ్వండి.. ఆ.. ఆ..!!* వాటి గురించి *మేమేనాడైనా అడిగామా..??"*
 
*కమిటీపెద్దగారి మాటల్లో శ్లేష అర్ధమైంది మహేశ్వరరావుగారికి.. గుడికొచ్చే బీదాబిక్కి జనం కార్తీకమాసాల్లో కాకుండా ప్రతీ సోమవారం పళ్లెంలో విదిల్చే చిల్లర ఎంతనేది చెప్పడానికి సిగ్గుపడేంత మొత్తాన్ని ఇట్లా అపార్ధం చేసుకుంటున్నందుకు లోతైన కళ్ళతో అంతకంటే లోతుగా నవ్వారు..*

*మహేశ్వరరావుగారికి ఇంకేం అడగాలనిపించలేదు.. ఏవన్నా ఉంటే గింటే శివుడ్ని తప్ప మనుషుడ్ని అడగటానికి సంకోచించే తత్వం మరీ ఎక్కువైపోయింది ఈ మధ్య..!!!*

*ఆ మధ్య నోరు విడిచి ప్రెసిడెంటుని ఇలాగే ఇళ్లపట్టాల గురించి అడగబోయారు..*

*"ఇళ్లేవో రాస్తున్నారంటున్నారు.. శిథిలావస్థకి చేరుకున్న ఆ రెండుగదుల ఇంట్లో ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంటోంది.. మరీ ముఖ్యంగా వర్షాలప్పుడు.. గుడినానుకుని ఉండటంతో కోతుల బెడద కూడా ఎక్కువయ్యింది..!!"*

*"65 ఏళ్లొచ్చిన మీకు ఇప్పుడు ఇల్లు అవసరమా.. మీ తర్వాత ఎవరికిస్తారు..?? పైగా మీ ఇంట్లో మీదొక్కటే కదా ఓటు..!!" అని తుపాకీ పేలినట్టు నవ్వి హాస్యం చేసిన ప్రెసిడెంటు ఈ మధ్యే కరోనా సోకి ముదరబెట్టి 43 ఏళ్ళకే కాలం చేశాడు పాపం..!!*

*"ఏంటో.. విధి విచిత్రం.. అంతా పరమశివుడి లీల..!!" అని సరిపెట్టుకున్నారు మహేశ్వరరావుగారు..*

*ఎందుకో ఆ మర్నాడు పొద్దున్న లేచాకా గొంతులో చేదుగా ఉండి, మర్నాటికి గరగరలాడి, వాసన తెలీనివ్వకుండా జలుబు, పట్టు విడవనంతగా జ్వరం వచ్చేసేసరికి టెస్టులక్కర్లేకుండానే కరోనాగా తేలింది..!!*

*నీరసంగా ఉన్న మహేశ్వరరావుగార్ని ఆ వార్డు వాలంటీరొచ్చి అంబులెన్సుని పిలిపించి ఎక్కించాడు..*

*హాస్పిటల్లో జరుగుబాటు బాగానే అయ్యి, దురలవాట్లు లేని క్రమశిక్షణా శరీరం కాబట్టి తొందరగానే కోలుకున్నారు..* *పదిహేనురోజుల తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపించి రెండువేల రూపాయల రొక్కం చేతిలో పెట్టాడు వాలంటీర్..*

*మరో పదిరోజుల పథ్యం తిరిగి గుడి తెరవడం ప్రారంభించి, బావినీటితో నిస్సత్తువగానే అభిషేకం జరిపి కాసేపు తువ్వాలు విసురుకుంటూ ఆ శివుడినే చూస్తూ కూర్చుని వచ్చేస్తున్నారీ మధ్యన.*

*పదిరోజులయ్యింది..*

*ఎవరి దాతృత్వం చేతనో కూరగాయల కవర్ అందివ్వడానికి ఇంటి గుమ్మం దగ్గరికొచ్చిన వాలంటీరుకి కళ్లతోనే కృతజ్ఞత చెప్పారు ముక్కుకి, మూతికి ఎర్రతుండు కట్టుకున్న మహేశ్వరరావుగారు..*

*నమస్కారం చెప్పి వెనుదిరగబోతోన్న వాలంటీరును ఆగమన్నారు మహేశ్వరరావు పంతులుగారు..*

*"మన ఊరిగుడికి ఆదాయం టీటీడీ దేవస్థానం నుంచి వస్తోందట.. ఇప్పుడు కొండకొచ్చే భక్తులు లేక ఆదాయం తగ్గి తిరుపతి వెంకన్న బీదవాడయ్యాడుట..* *అంచేత గత ఐదునెలలుగా మా భృతి నిలిపివేశారు..!!"*

*గుమ్మానికి పదడుగుల దూరంలో నిలబడ్డ వాలంటీరు అలానే చూస్తున్నాడు విషయం అర్ధంగాక..*

*ఎర్రతుండు చాటు దాగిన వణుకుతోన్న పెదవులతో మెల్లగా గొణిగారు పంతులుగారు..!!*

*"ఆ కరోనా వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉందా నాయనా..? వస్తే రెండువేలు మళ్లీ ఇస్తారా..?"*
_*రచయిత:-Haribabu Maddukuri*_
*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, జిహెచ్ఎం, గంటి, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి, 9492146689.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఇది కథ అయినా ప్రస్తుత పరిస్థితి కి నిలువుటద్దం.*

_*మనం అనుసరించేది ఏ ధర్మమైనా ఆ ధర్మం కోసం జీవించే వారిని గౌరవిద్దాం*_

_*హైందవ ధర్మాన్ని ఆచరించే మిత్రులకు విజ్ఞప్తి*_

_*అన్ని ఆలయాలూ తిరుపతులు కావు. అందరు అర్చకులూ స్థితిమంతులు కాదు‌. నేను సాధ్యమైనంత వరకూ చిన్న ఆలయాలకే వెళతాను మంచి దక్షిణ వేస్తాను. హుండీలో కాదు సుమా...మీకూ నచ్చితే ఆచరిస్తారు కదూ*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: