17, సెప్టెంబర్ 2020, గురువారం

*నవరసభరితం నరుడి జీవితం*



అద్దపునీడ అంటే అందరికీ తెలుసు. అద్దాన్ని ఎండలో పెట్టి గోడవైపు చూపిస్తే గోడమీద రకరకాల బొమ్మలు కనిపిస్తాయి, కదులుతాయి. అద్దంతీసి చూస్తే గోడమీద ఏమీఉండదు. అంతా భ్రాంతి. మానవజీవితమూ అంతే. అంతా మాయ. జగన్నాటక సూత్రధారి క్రీడలో జీవులన్నీ పావులే!
మనిషి కాలంతోపాటు ఎదుగుతాడు. ఆస్తులు సంపాదిస్తాడు. తనకంటూ నివాసం ఏర్పరచుకుని అది తన శాశ్వత నివాసమని పేర్కొంటాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. శృంగారంతో సృష్టికార్యం సాగిస్తాడు. వినోదిస్తాడు. రౌద్రం ప్రకటిస్తాడు. శాంతిమంత్రం పఠిస్తాడు. భయపడుతూంటాడు. వీరత్వం ప్రదర్శిస్తూ ఇతరులను భయపెడుతూంటాడు, భీభత్సం సృష్టిస్తూంటాడు. కరుణరసం కురిపిస్తాడు. ఎన్నో ప్రదర్శనలు... నవరసాలు అవలీలగా పోషిస్తాడు. తన పాత్ర పూర్తవగానే ప్రపంచమనే నాటకరంగం నుంచి నిష్క్రమిస్తాడు. ఏదీ శాశ్వతం కాదు. అంతా అశాశ్వతం అని గ్రహించేలోపు జరగాల్సిన తతంగం జరిగిపోతుంది.
మనిషి జీవితంలో నాలుగు అంకాలుంటాయి. ఇహలోకంలో మొదటి క్షణం నిజంగా అద్భుతమే. మొదటి శ్వాస పీల్చగానే బిడ్డ కేర్‌కేర్‌ మంటాడు. బిడ్డఏడుపు తల్లికి మధురస్వరమై మాతృహృదయం వాత్సల్యంతో ఉప్పొంగుతుంది. తండ్రిగర్వంగా ఛాతీ విరుచుకుంటాడు. నెలలు గడుస్తాయి. తల్లి చేయి పట్టుకు నడిపిస్తుంది. ఏళ్లు గడుస్తాయి. బాలుడు ఎదుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు.
యౌవనం ఆనందమయం. భార్య, భర్త, పిల్లలతో కూడిన సంసార బంధం ఏర్పడుతుంది. కుటుంబపోషణకు ఉద్యోగమో, వ్యాపారమో చేసి డబ్బు సంపాదించక తప్పదు. దృష్టి సంపాదనవైపు మళ్లుతుంది. ఈ వయసులో నాది నాది అనే భావన బలపడుతుంది. ఈ ఘట్టంలో సుఖదుఃఖాలు, ఆనందోత్సాహాలు, కలహాలు-కలతలు, ఈర్ష్యాసూయలు మొదలైన నవరసాల ప్రదర్శన రసపట్టుకు చేరుతుంది.
మధ్యవయసు బాధ్యతల పర్వం. బంధుమిత్రులు చేరువవుతారు. మనుషుల మధ్య మమతానురాగాలు ప్రభవిల్లుతాయి. ఆవేశం అదుపులోకి వస్తుంది. నిదానమే ప్రధానమవుతుంది. ఏళ్లు గడుస్తుంటే భగవంతుడి వైపు దృష్టిమళ్లుతుంది. భగవదారాధన నిత్యకృత్యమవుతుంది. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయాక దిగులు మొదలవుతుంది.
జీవిత చరమాంకంలో ఆరోగ్యం క్షీణస్తుంటే భయం మొదలవుతుంది. యౌవనతనంలో ప్రదర్శించిన ధైర్యం సన్నగిల్లుతుంది.
మరణ శయ్యపై చివరిక్షణం భయానకం. మమకారం పెంచుకున్న సన్నిహితులను, కష్టపడి సమకూర్చుకున్న ఆస్తిని వదిలి వెళ్లిపోవలసిన క్షణం దుఃఖ భరితం...
అందరి జీవితాలూ ఒకేలా నడవవు. ఒకేలా ముగియవు. మనిషి తత్వం వైవిధ్యభరితం. కష్టపడే తత్వమే విజయరహస్యం. పరమేశ్వరుడి సృష్టిలో రకరకాల పాత్రలు... ఎవరిపాత్ర వారిది... ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి...
భగవంతుడు ప్రసాదించిన మేధను సక్రమంగా వినియోగించగలవారు మేధావులవుతారు. అద్భుతాలు సృష్టిస్తారు. సోమరితనంతో కాలంగడిపేవారు అనామకులుగా మిగిలిపోతారు.
తమ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూ భగవంతుడి ఆరాధనలో తరించేవారు సుఖ దుఃఖాలను సమంగా స్వీకరిస్తారు. ధర్మ పథంలో పయనిస్తారు. తోటివారి మన్ననలు పొందుతారు. మరణించాక కూడా సన్నిహితుల హృదయాల్లో జీవిస్తారు.

కామెంట్‌లు లేవు: