17, సెప్టెంబర్ 2020, గురువారం

🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌻 వేదము సర్వాంతర్యామి. అది సృష్టి ఘనము. (అనగా సృష్టి అంతయు జరుగునట్టి విజ్ఞాన ప్రణాళికతో నిండి ఉండును.) వేదమతి విస్తారమైనది. (విత్తనము నుండి వృక్షము వలె సృష్టి విప్పారునట్టి ప్రణాళిక దాని యందు ఉన్నది). వేదమునకు పారము లేదు. (సృష్టికి ఆద్యంతములు లేవు.) వేదము అద్వితీయము (సృష్టిలో ఒకరినొకరు ద్వితీయములుగా కనిపింతురు. కాని అందలి మొత్తము ప్రణాళిక‌ అఖండము). అట్టి వేదమునే నిత్యము వల్లె వేయుచు, దాని మంత్రములచే ఉపాసించు వేదవాదులైన మహనీయులు కలరు. వారు ఆ మంత్ర ప్రయోగ కుశలతచే వివిధ గుణసముదాయమును దేవతలుగా ప్రత్యక్షము చేసికొనగలుగుచున్నారు. తమ ఉపాసన సామర్థ్యముచే ఇంద్రాది దేవతలను అర్చించుచున్నారు. ఈ‌ దేవతలు వారికి ఇష్ట దైవములు. వారెవ్వరును ఈశ్వరుని చూడలేకున్నారు.

(ఈశ్వరుడు అనగా వెలుపలి అంతర్యామి కాదు. సర్వజీవుల హృదయమునందును చూడబడవలసిన అంతర్యామి. వేద దేవతలను వేరుగా ఉపాసించి‌ ప్రత్యక్షము చేసికొనగల సమర్థులున్నారు. ప్రత్యక్షము చేసికొనుట అనగా తన కన్నా వేరుగా మాత్రమే చూడగలుగుట. తమ భావముల రూపములనే వారు దేవతలుగా ఆరాధించుచున్నారు. కనుకనే ఎవరి దేవుడు వారికి ఎక్కువ. ఎవరిమతము వారిది. ఎందరు ఉపాసకులు ఉందురో అందరు ఇష్టదైవతములు ఉందురు గదా! ఒకే దేవత విషయమున ఇద్దరు సాధకులు వేరు వేరు రూపములను కల్పించుకొనుచున్నారు. మార్కండేయుడు చూచిన శివుడు వేరు, రావణాసురుడు చూచిన శివుడు వేరు. ఇద్దరు విష్ణు భక్తులు నారాయణ మంత్రమును ఉపాసించినను ఎవరి విష్ణువు వారికి ప్రత్యక్షమగును. ఒకరి విష్ణువు శత్రువులను చంపును. ఇంకొకరి విష్ణువు లోకములను కాపాడును. అదితికి ప్రత్యక్షమైన విష్ణువు వామనుడై, దితికొడుకుల నుండి రాజ్యమును హరించి అదితి కొడుకులకు ఈయవలెను. ఈ విధమైన మార్గము పేరు భక్తియైనను, పూజయైనను, వ్రతమైనను, యజ్ఞమైనను, మంత్రోపాసనమైనను అంతర్యామిదర్శనము ఈయదు. శివమంత్రము చేసినను, విష్ణుమంత్రము చేసినను అంతర్యామి కనబడడు. అంతర్యామిని సాధించుటకై ఇంకను పెద్దమంత్రము ఎచ్చట ఉండునో వెదకుచుండును. ఇంకను పెద్దలు దాచిపెట్టిన తంత్ర రహస్యములు ఉన్నవని సాధించుటకై తిరిగి త్రిప్పలు పడుచుందురు.

ఒక వాణిజ్య సంస్థలో అనేకులు పని చేయుచుందురు. వాణిజ్యము వారిలో ఎవ్వరికిని చెందదు. తమ జీతము మాత్రమే తమకు చెందును. అందొక్కడు పని ఎక్కువగుట వలన ఎవనినో పెట్టి పని చేయించుకొని జీతము ఇచ్చును. అతని దగ్గర పని చేయుచున్న వానికి అతడే యజమాని గాని వాణిజ్యమునకు యజమాని ఎట్లుండునో వాడెరుగడు. అట్లే వేదములు చదువువారు వేదము ఎట్లుండునో ఎరుగకపోవచ్చును. వేదమంత్రముల ప్రయోగము చేయువారు ఫలసిద్ధిని పొందుచున్నను ఆ మంత్రములు ఎందులకో తెలిసి ఉండకపోవచ్చును. తాము ఆ ఫలసిద్ధిని ఎందులకు కోరిరో తమకే తెలియదు గదా? లక్ష్మిని పూజించి లక్ష్మీ మంత్రము జపించి ఒకడు ధన ధాన్య వస్తుసంపదలను, గృహములను, భార్యను, బిడ్డలను కోరి పొందవచ్చును‌. కాని తాను అట్లు ఏల కోరెనో తనకే తెలియదు కనుక లక్ష్మీదేవి అంతర్యామి అని తెలియుట సాధ్యము కాదు. ఎవరైనను చెప్పినను నమ్ముటలో గూడ అంతర్యామిత్వముండదు.
తాను పూజించు లక్ష్మి అంతర్యామి అనియును, తక్కినవారు పూజించు లక్ష్మి అంతర్యామి కాదనియు కూడ నమ్మవచ్చును.

ఈ విధముగనే యజ్ఞయాగాది క్రతువులలో దేవతలను అర్చించు వేదవాదులున్నారు‌ "ఈ వేదవాదులు తాము ఎరిగిన దానిని అంగీకరింపనివారు, కామాత్ములు, స్వర్గపరులు" అని కృష్ణుడు గీతలో హెచ్చరిక చేసెను. "వేదములు త్రిగుణములు లక్ష్యములుగా గలవి. నీవు త్రిగుణములను విడిచిపెట్టుము" అని కూడ హెచ్చరిక చేసెను. విడిచిపెట్టవలసినది త్రిగుణములనే గాని వేదములను కాదు. త్రిగుణములు లేకుండా వేదములు లభింపవు. "పొట్టు లేకుండ ధాన్యము లభింపదు. దంచి పొట్టును తొలగించి గింజలను స్వీకరింపవలెను" అని ఆముక్తమాల్యదలో కృష్ణరాయలు హెచ్చరిక చేసెను.).......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 873,874(For more Information about Master EK Lectures please visit www.masterek.org).

కామెంట్‌లు లేవు: