17, సెప్టెంబర్ 2020, గురువారం

తాడిని తన్నే వాడు

తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యము చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ

ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు

దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత

స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?


ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !

సేకరణ.శ్రీనివాస్

కామెంట్‌లు లేవు: