17, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్. 65


...
దశరథుడి ఆజ్ఞలు వింటూ కైక భయపడిపోయింది !
.
ఖాళీ అయిన బొక్కసము,సైన్యము లేని రాజసము ,నిర్జన నగరము ఉండీ భరతుడికేం ఉపయోగము .
.
తను ఇంత చేసి అంతా వృధా అయిపోతుందేమో అనే వ్యధ ఒక్కసారిగా ఆవిడ హృదయాన్ని పట్టిపీడించింది.
.
అక్కరలేదు ! సారహీనమైన రాజ్యమక్కరలేదు ! అని నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా అందరి ఎదుటా గర్జించినట్లుగా పలికింది కైక ! .
.
ఓసీ ! దురాత్మురాలా నీకోరిక రాముడిని అడవికి పంపమనే ! అంతేకానీ వైభవశూన్యుడైన రాముని పంపమని కాదు.అని దశరథుడు గద్దించాడు కైకను .
.
తోకతొక్కిన త్రాచులాగా లేచింది ,మీదకురికే రేచులాగా నిలుచుంది !
.
నేనన్నది మీ వంశంలో అసమంజసుని సగరుడు ఎలా పంపాడో అలాగ పంపమని ! అంతేకానీ ధనధాన్యాలతో,చతురంగబలాలతో ,దాసదాసీజనంతో విహారయాత్రకెళ్ళినట్లుకాదు.
.
ఈ విధంగా మాట్లాడుతున్న కైకను చూసి సిద్ధార్దుడనే మంత్రి...
.
అసమంజసుడితో రాముడికి పోలికా !
. సకలసుగుణాభిరాముడు,సర్వలోకమనోహరుడు ,సకలజీవసంరక్షకుడమ్మా రాముడు !
.
వాడు ! అసమంజసుడు,
పసిపిల్లల పీకలునొక్కి వారి ఏడుపులు విని ఆస్వాదించి ఆనందించేవాడు . వారిని గిరగిర త్రిప్పి సరయూనదిలో బంతులు విసిరినట్లు విసిరే వాడు ,లోకంలోని అసమంజసమైన పనులన్నీ చేసే వాడు !
.
వాడికీ ,రామునికీ పోలికా ! నీవు మాట లాడే దానిలో ఏమైనా ఔచిత్యమున్నదా .
.
వాడి బాధలు తట్టుకోలేక జనం మొరపెట్టుకొంటే భార్యతోసహా రాజ్యబహిష్కరణ శిక్ష విధించాడమ్మా సగర చక్రవర్తి ! .
.
అటువంటి దౌర్భాగ్యునితో రామునికి పోలిక తేవడమా ! నీవు స్పృహలోనే ఉన్నావు కదా! .
.
అసలు అడవికి పంపటానికి రాముడు ఏ నేరం చేశాడో మేమంతా తెలుసుకో గోరుతున్నాము ,నిష్కారణముగా సత్పధగామిని శిక్షిస్తారా! ఆ పాపము ఊరకే పోదు!
.
సిగ్గూఎగ్గూలేని కైక ఇంతమంది ఇన్నిమాటలంటున్నా తనకేమీ పట్టనట్లు అలాగే ఉండిపోయింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: